You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలో పొంగుతున్న యమున, దక్షిణ కొరియాలో వరదలకు 22 మంది మృతి, ఇటలీలో హీట్‌వేవ్ అలర్ట్
- రచయిత, క్రిస్టీ కూనీ
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ కొరియాలో కుండపోతగా కురుస్తోన్న వర్షాల కారణంగా 22 మంది మరణించారు. మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఎడతెగని వర్షాల కారణంతో సెంట్రల్ నార్త్ చుంగ్‌చియాంగ్ ప్రావిన్స్‌లోని ప్రధాన ఆనకట్ట పొంగిపొర్లుతోంది.
భారీ వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. కార్లు కొట్టుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ వర్షాలతో 22 మంది చనిపోగా, మరో 14 మంది గల్లంతయ్యారని, వేలాది మంది తమ నివాసాలను విడిచిపెట్టి తరలిపోవాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
ఉత్తర జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ పర్వత ప్రాంతంలోని కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అత్యంత ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఇళ్లన్నీ వరద నీటికి కొట్టుకుపోయాయని ఎమర్జెన్సీ రెస్పాండర్ స్థానిక మీడియాకు తెలిపారు.
సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధాని హాన్ డక్ సూ ఆ దేశ సైన్యాన్ని కోరారు.
సెంట్రల్ చుంగ్‌చియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న భూగర్భ సొరంగంలో 19 కార్లు మునిగిపోయినట్లు అధికారులు చెప్పారు.
దీంతో, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
శనివారం స్థానిక కాలమానం 6.30 గంటలకు గోసన్ డ్యామ్ పొంగిపొర్లడంతో, 6,400 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని దక్షిణ కొరియా న్యూస్ ఏజెన్సీ యోన్‌హ్యాప్ తెలిపింది.
డ్యామ్‌కి సమీపంలో ఉన్న లోతట్టు గ్రామాలు, ఆ గ్రామాలను కలిపే రోడ్లు పూర్తిగా నీట మునిగాయి.
కొంతమంది ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుని పోయారు.
నెమ్మదిగా ప్రయాణించే రైళ్లన్నింటిన్ని, కొన్ని బుల్లెట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దేశ రైల్వే ఆపరేటర్ కోరైల్ ప్రకటించింది.
మరికొన్ని బుల్లెట్ ట్రైన్ రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని తెలిపింది.
కొండచరియలు విరిగిపడటంతో, నార్త్ చుంగ్‌చియాంగ్‌లో ఒక రైలు పట్టాలు తప్పింది.
ఈ ఘటనలో ఒక ఇంజనీర్ గాయాలు పాలయ్యారు.
ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేరు. బుధవారం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని కొరియా వాతావరణ విభాగం అంచనావేసింది.
వాతావరణ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.
గత కొన్ని రోజులుగా భారత్, చైనా, జపాన్‌తో పాటు పలు దేశాలలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి.
కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమునా నది పొంగడంతో దిల్లీ నగరంలోకి వరద నీరు చేరింది.
పర్యావరణ మార్పులతో వేడెక్కిన వాతావరణంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలంటున్నారు.
16 ఇటలీ నగరాలకు అధిక ఉష్ణోగ్రతలతో రెడ్ అలర్ట్ జారీ
మరోవైపు కొన్ని దేశాలలో వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే.. మరికొన్ని దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి.
ఇటలీలో 16 నగరాలలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు.
ఆరోగ్యవంతులు కూడా ఈ ఉష్ణోగ్రతలకు ప్రభావితమవుతారని ఈ అలర్ట్‌లు సూచిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో రోమ్, ఫ్లోరెన్స్, బోలోగ్నా వంటి టూరిస్ట్ ప్రదేశాలన్నింటికీ ఈ రెడ్ అలర్ట్‌లు వర్తించనున్నాయి.
సాధారణం కంటే ఎక్కువ కాలం పాటు ఈసారి హీట్‌వేవ్‌లున్నాయి. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి.
మరో హీట్‌వేవ్ సమీపిస్తున్నందున యూరప్‌లో వచ్చే వారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనాలున్నాయి.
రెడ్ అలర్ట్‌లు జారీ చేసిన ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు బయటకి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, ఇటలీ ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.
ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
- ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను మార్చితే ఏమవుతుంది? పర్వతారోహకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
- లావోస్: ‘ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఇదే’
- గాఫ్ ఐలాండ్: ఈ అందమైన ద్వీపంలో పని చేయడానికి మనిషి కావాలంట.. జీతం 22 లక్షలు
- వడదెబ్బ: ఎండలో ఆ సమయంలో ఎక్కువసేపు ఉంటే కోమాలోకి వెళ్లిపోతామా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)