You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సమ్మక్క-సారలమ్మ: ఉప్పొంగిన జంపన్న వాగు, ప్రాణాలు తప్ప ఇంకేం మిగలలేదన్న బాధితులు
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర తెలంగాణలో ఎడతెగకుండా కురిసిన వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రైతులు, చిరు వ్యాపారులు, మారుమూల ఉండే గ్రామాల ప్రజలు.. ఇలా అందరూ నరకయాతన చూస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో వరద భయంకరంగా వచ్చింది.
సమ్మక్క, సారలమ్మ గద్దెలుండే మేడారంలో వందల సంఖ్యలో చిన్న దుకాణాలు ఉంటాయి.
జాతర జరిగేప్పుడు కాకుండా మిగిలిన రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగా, వందల్లోనే ఉంటుంది. ఆ సమయంలో కూడా వీరికి ఈ షాపులే ఆధారం.
జాతర సమయాల్లో సందడిగా, మిగిలిన రోజుల్లో సాదాగా సాగిపోయే వీరి జీవితాలు ఒక్కసారి తలకిందులైపోయాయి.
అందుకు కారణం మేడారాన్ని ఆనుకుని ప్రవహించే జంపన్న వాగు.
మామూలు రోజుల్లో మేడారం భక్తులు స్నానాలు చేసే ఈ వాగు, ఇప్పుడు ఉగ్రరూపంలో దాల్చి చుట్టుకుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది.
కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో మేడారం పక్కన పారే జంపన్న వాగుకు వరద వచ్చింది.
అడవుల్లో కురిసిన వానతో పాటూ, అనేక చిన్న వాగులూ ఈ పెద్ద వాగులో కలుస్తాయి.
దీంతో ఈసారి కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగుకు ప్రస్తుత మేడారం వాసులు ఎప్పుడూ చూడనంత వరద వచ్చింది.
‘నా జన్మలో నేను ఇంత వరద చూడలేదు’
‘‘నా జన్మలో నేను ఇంత వరద చూడలేదు. తిండి లేదు. బట్టల్లేవు. సొమ్ములు, డబ్బు గంగపాలైంది. మా ఇల్లు ఎంత ఎత్తుందో అంత నీరు వచ్చింది. ఆ సమ్మక్క తల్లి మమ్మల్ని ప్రాణాలతో మాత్రం ఉంచింది.’’ అంటూ బీబీసీతో చెప్పారు గండికోట లక్ష్మి అనే చిరు వ్యాపారి.
సరిగ్గా సమ్మక్క గద్దెల ప్రాంగణం ఎదురుగానే లక్ష్మి దుకాణం ఉంటుంది.
బీబీసీ వెళ్లేప్పటికి వారి టిఫిన్ సెంటర్‌కి సంబంధించిన ప్లేట్లపై పేరుకున్న వరద మట్టిని కడుగుతున్నారు.
షాపులో ఉండే వస్తువులన్నీ బురద కొట్టుకుపోయాయి. ఇంట్లోని పిల్లలు తమ పుస్తకాలు, పెద్దవాళ్లు విలువైన కాగితాలను ఎండలో ఆరబెడుతున్నారు.
లక్ష్మీ షాపే కాదు.. మేడారం గ్రామంలో ఎటు చూసినా ఇళ్లు, షాపుల్లోంచి బురదను కడిగే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
షాపుల్లోని వస్తువులు కొట్టుకుపోగా, ఉన్నవేమైనా పనికొస్తాయేమోనన్న ఆశతో వాటి బురద కడుగుతూ కూర్చున్నారు చిరు వ్యాపారులు.
రోడ్డుపై కూర్చుని తన దుకాణంలో మట్టిలో మునిగిపోయిన కొత్త గాజులను కడుగుతోన్న తుపాకుల లక్ష్మి అనే పెద్దావిడతో బీబీసీ మాట్లాడింది.
కొత్త వ్యక్తులు పలకరించేసరికి ఆమె ఒక్కసారిగా భోరుమని ఏడ్చారు. తమ ప్రాణాలు తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ వాపోయారు.
‘‘మావోళ్లు ఇరుక్కుపోతే హెలికాప్టర్లు వచ్చి కాపాడాయి. ప్రాణాలు దక్కాయి. ప్రాణాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు.
ఈ గాజులు కడుగుతున్నాను కానీ ఇవీ పనికిరావు. ఒక్కో షాపు వారూ రెండు మూడు లక్షల రూపాయలు నష్టపోయారు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి స్టాకు పెట్టుకున్నారు. కానీ ఇంతలో ఘోరం జరిగింది.
మీరే చూడండి.. ఆ దేవుడి ఫోటోలన్నీ కరాబయ్యాయి. అంతా ఆగం అయింది. ఎలా బతకాలో తెలీదు. సేట్ల కాళ్లూ వేళ్లూ పట్టుకుని అప్పు తీసుకుని పెట్టిన స్టాక్ అంతా పోయింది.
అందరూ ఇళ్లల్లో కూర్చుని ఏడుస్తున్నారు. ఆఖరికి ఇంట్లో గ్యాస్ పొయ్యిలూ, వంట సామాన్లూ, గిన్నెలూ అన్నీపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం.’’ అన్నారు లక్ష్మి.
‘‘మీ కాల్మొక్తా.. మమ్ముల్ని ఆదుకోండి అంటూ కన్నీళ్లతో చేతులెత్తి మొక్కుతున్నారామె..’’
తుపాకుల లక్ష్మి చెప్పిన పరిస్థితే ప్రతీ షాపులోనూ, ప్రతీ ఇంటిలోనూ కనిపించింది.
ఎవరూ తమ సామాగ్రి కాపాడుకోలేకపోయారు. దానికి కారణం ఉంది. జంపన్న వాగుకు గతంలో వరదలు వచ్చినా, ఊరు మొత్తం మునిగేది కాదు.
కానీ, ఈసారి అలాకాదు. అంతా అకస్మాత్తుగా జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు అంతా జలమయం అయిపోయింది.
‘‘ఆవేళ పొద్దున్న ఏడు ఏడున్నర ప్రాంతంలో నీరు వచ్చింది. మాల్ (సామాగ్రి) సర్దుకునేలోపు అంతా ఆగం అయిపోయి నీరు పెరిగిపోయింది.
దీంతో మేం పిల్లల్ని మాత్రం తీసుకుని భవనం ఎక్కాం. కింద బియ్యం తడిసిపోయింది. తినడానికి ఏమీ లేదు. మొదటి రోజు మాత్రం గవర్నమెంటు వాళ్లు హాస్టల్లో భోజనం పెట్టారు. తరువాత పెట్టలేదు.
ఇక కిందున్న సామాగ్రి మొత్తం నాని, మట్టికొట్టిపోయింది. వ్యాపారంలో రెండు మూడు లక్షల నష్టం ఉంటుంది. గాజులు, కీచైన్లు, బొమ్మలు.. ఏవీ పనికిరావు. అన్నీ బురదే..’’ అంటూ వివరించారు శ్రీకుమార్.
మేడారంలో సొంతిల్లు కూడా లేని శ్రీకుమార్ ఒక ప్రభుత్వ భవనం ప్రాంగణంలో కాపురం ఉంటున్నారు. తన కుటుంబంతో సహా ఒక భవనం ఎక్కి ప్రాణాలు కాపాడున్నారు.
వంట సామాగ్రి, ఆహార పదార్థాలు కూడా లేకపోవడంతో స్థానికులకు ప్రభుత్వ హాస్టల్లో తాత్కాలికంగా భోజనం ఏర్పాటు చేశారు అధికారులు.
నీళ్లలో నాని వాసన వస్తోన్న బియ్యాన్ని చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు స్థానికులు.
షాపుల్లో అమ్మే దేవుడి పటాలు, తాళ్లు, గాజులు, పిల్లల బొమ్మలు, బెల్లం, ఇళ్లల్లో వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు.. అన్నీ నీళ్లపాలయ్యాయి.
వాగు కేవలం గంటల వ్యవధిలో అకస్మాత్తుగా పొంగడంతో ఎవరికీ తమ ప్రాణాలు తప్ప ఆస్తులు, సామాన్లు, దుకాణాలు కాపాడుకునే అవకాశమే దక్కలేదు.
సమ్మక్క, సారలమ్మ గద్దెల మెట్ల వరకూ నీళ్లు వెళ్లాయి. గద్దెలు మునగనప్పటికీ, ఆ ప్రాంగణం మొత్తం నీరు చేరింది.
మేడారానికి వెళ్లే దారులు బురదమయమై బండ్లు జారిపోతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు తెగిపోయాయి. చెట్లు పడిపోయాయి.
కరెంటు స్తంభాలు నేలకూలి తీగలు రోడ్లపై ఉన్నాయి. మూడు రోజులుగా కరెంటు లేదు.
జంపన్న వాగు ప్రస్తుతం శాంతించింది. అదే వాగులో తమ సామాగ్రి శుభ్రం చేసుకుంటున్నారు కొందరు స్థానికులు.
ఇవి కూడా చదవండి:
- బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
- ఉత్తరాఖండ్ వరదలు: ‘నా భార్య నా కళ్ల ముందే నదిలో కొట్టుకుపోయింది...’
- అమెజాన్ అడవుల్లో నలుగురు పిల్లల్ని కాపాడిన కుక్క తప్పిపోయింది... అన్వేషణ కొనసాగుతోంది
- ఎవరెస్ట్ రూపం మారుతోందా? ఒక్కసారిగా మరణాలు ఎందుకు పెరిగాయి?
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)