You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోర్బీ బ్రిడ్జి ప్రమాదం: 135 మంది మరణానికి బాధ్యులు ఎవరు?
- రచయిత, లక్ష్మీ పటేల్
- హోదా, బీబీసీ గుజరాతీ
2022 అక్టోబరు 30న గుజరాత్‌లోని మోర్బీలో ఓ తీగల వంతెన కుప్పకూలడంతో 135 మంది మరణించారు. వీరిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు.
ఆ ఘటనకు దాదాపు ఏడాది గడుస్తోంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్టోబరు 10న గుజరాత్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
బ్రిడ్జ్ ప్రమాదానికి ఒరేవా గ్రూపు, సంస్థ డైరెక్టర్ జయ్‌సుఖ్ పటేల్, మేనేజర్లు దీపక్ దవే, దీపక్ పరేఖ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిట్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
ఒరేవా గ్రూపు ప్రెసిడెంట్ జయ్‌సుఖ్ పటేల్, ఆయన మేనేజర్లు దీపక్ దవే, దీపక్ పరేఖ్‌లు నిర్లక్ష్యంగా (క్రిమినల్ నెగ్లిజెన్స్) వ్యవహరించడం వల్లే 135 మంది మరణించే పరిస్థితి వచ్చిందని సిట్ తెలిపింది. ఈ ప్రమాదాన్ని గుజరాత్‌లో మనుషుల వల్ల జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదాల్లో ఒకటిగా సిట్ పేర్కొంది.
2,000 పేజీలకుపైనే ఉన్న ఈ తుది నివేదికలో అసలు ఆ ఘటన ఎలా జరిగింది? దాని వెనుక పరిణామాలు ఏమిటి? లాంటి వివరాలను పేర్కొన్నారు.
ఒరేవా కంపెనీ ‘నిర్వహణ లోపాలు (మిస్‌మేనేజ్‌మెంట్), సాంకేతిక వైఫల్యాలు (టెక్నికల్ ఫెయిల్యూర్స్), నిర్లక్ష్యం, నిరంకుశ ధోరణి’లను ప్రమాదానికి కారణాలుగా రిపోర్టు పేర్కొంది. అందుకే జయ్‌సుఖ్ పటేల్, ఆయన ఇద్దరు మేనేజర్లు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించింది.
గుజరాత్ హైకోర్టు ఎలా స్పందించింది?
ఒరేవా కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగితే, అసలు ఎందుకు ఇప్పటికీ వరకూ కంపెనీపై చర్యలు తీసుకోలేదని విచారణ సమయంలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ అనిరుధ్ పీ మాయి సభ్యులుగాగల ధర్మాసనం ప్రశ్నించింది.
గుజరాత్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కమల్ త్రివేదీ స్పందిస్తూ.. ‘‘వంతెన నిర్వహణ, ఆపరేషన్లలో ఒరేవా గ్రూపు అవకతవకలను ఆ రిపోర్టు ప్రధానంగా ప్రస్తావించింది’’ అని చెప్పారు.
‘‘ఒరేవా గ్రూపు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మోర్బీ నగరపాలక సంస్థ చైర్మన్‌ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)లో భాగంగా వంతెనకు మరమ్మతులను ఒరేవా నిర్వహించాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.
‘‘బ్రిడ్జి పరిస్థితిని కంపెనీ సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు వినియోగదారుల నుంచి వసూలుచేసే చార్జీలను కూడా పెంచాలని కోరింది. కానీ, ఆ ప్రతిపాదనలను నగరపాలక సంస్థ తిరస్కరించింది’’ అని కమల్ అన్నారు.
‘‘అయితే, ప్రస్తుత చార్జీలపైనే బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించాలని లేకపోతే ఆ బ్రిడ్జి నిర్వహణను తమకే అప్పగించాలని నగరపాలక సంస్థ సూచించింది. కానీ, బ్రిడ్జి మేనేజ్‌మెంట్‌ను అప్పగించడంలో ఒరేవా గ్రూపు విఫలమైంది’’ అని కమల్ చెప్పారు.
‘‘మరోవైపు బ్రిడ్జి మరమ్మతులు కూడా కంపెనీ చేయలేదు. అయితే, ప్రభుత్వంతో ఎంవీయూను పునరుద్ధరించిన తర్వాత బ్రిడ్జి మరమ్మతులను దేవ్‌ప్రకాశ్ సొల్యూషన్స్ అనే సంస్థకు ఒరేవా అప్పగించింది’’ అని వివరించారు.
‘‘ఈ విషయంలో ఎలాంటి టెక్నికల్ నిపుణుల ఒపీనియన్‌ను ఒరేవా తీసుకోలేదు. అలానే మోర్బీ మున్సిపాలిటీని కూడా సంప్రదించలేదు’’ అని చెప్పారు.
‘‘అయితే, దేవ్‌ప్రకాశ్ సొల్యూషన్స్‌కు కాంట్రాక్టు అప్పగించింది ఎవరు? ఈ విషయంలో అసలు మున్సిపాలిటీకి ఏమైనా సమాచారముందా? అసలు వారికివారే ఎలా కాంట్రాక్టులు ఇచ్చేసుకుంటారు?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది.
అనంతరం సిట్ రిపోర్టును ఉదహరిస్తూ.. ‘‘ఇక్కడ ఒరేవా కంపెనీ నిర్లక్ష్యంతో వ్యవహరించింది. బ్రిడ్జి పరిస్థితి గురించి నిపుణుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే.. కచ్చితంగా బ్రిడ్జికి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలని లేదా ఆధునికీకరించాలని చెప్పేవారు’’ అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
‘‘మరమ్మతుల పనులు అరకొర పూర్తైన తర్వాత కూడా మున్సిపాలిటీతో ఒరేవా కంపెనీ అసలు చర్చలు జరపలేదు. బ్రిడ్జిని మళ్లీ పర్యటకుల కోసం తెరచినప్పుడు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు’’ అని తెలిపింది.
‘‘మరోవైపు టిక్కెట్ల విక్రయాలపైనా ఎలాంటి నియంత్రణా లేకుండా పోయింది. ఎలా అసలు ఆ బ్రిడ్జిపైకి వందల మందిని అనుమతించారు?’’ అని ప్రశ్నించింది.
అయితే, ఆ కంపెనీపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ధర్మాసనం సూచించింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘మేం సిట్ రిపోర్టు కోసం ఎదురుచూశాం. ఇప్పుడు చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపింది.
ఆ తర్వాత ఒరేవా కంపెనీ న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు ఆదేశాలపై బాధితులకు మేం రూ.14 కోట్ల పరిహారం ఇచ్చాం. ఇప్పటికీ మరింత పరిహారం కావాలని చాలా మంది కన్జూమర్ కోర్టు దగ్గరకు వస్తున్నారు. మేం అనాథలైన పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాం. వారు పెద్దయ్యేవరకూ అన్నీ మేం చూసుకుంటాం’’ అని చెప్పారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన బాధితుల్లో మహిళలు, చిన్నారుల వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఒరేవా సంస్థలకు రాష్ట్ర హైకోర్టు సూచించింది.
బాధితుల అడ్వొకేట్ ఏం చెబుతున్నారు?
మోర్బీ బ్రిడ్జి బాధితుల తరఫున కోర్టులో వాదించిన అడ్వొకేట్ ఉత్కర్ష్ దవే మీడియాతో మాట్లాడారు. ‘‘నేడు (మంగళవారం) గుజరాత్ హైకోర్టులో కేసు విచారణ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ తమ నివేదిక సమర్పించింది’’ అని చెప్పారు.
‘‘ఆ రిపోర్టులో ఘటనకు బాధ్యత వహించాల్సిందని ఒరేవా కంపెనీ, సంస్థ ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్లు, ఇద్దరు మేనేజర్లేనని సిట్ పేర్కొంది. ఆ కంపెనీ బ్రిడ్జికి ఎలాంటి సర్టిఫికేషన్ తీసుకోలేదు. టికెట్ విక్రయాలపైనా మార్గదర్శకాలు లేవు. మరోవైపు బ్రిడ్జిపై భద్రతా సిబ్బంది కూడా తగిన స్థాయిలో మోహరించలేదు. అందుకే అక్కడ ప్రజలను నియంత్రించడం కష్టమైంది’’ అని అన్నారు.
‘‘ఎంత మంది బ్రిడ్జి మీదకు వెళ్తున్నారు? ఎంత మంది వస్తున్నారు? అనే విషయంలో అసలు నియంత్రణే లేదు. ఆ కంపెనీ పనులను మరో సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు’’ అని చెప్పారు.
‘‘మొత్తంగా ఇదొక సమగ్ర నివేదిక. దీనిలో మోర్బీ మున్సిపాలిటీ అధికారుల పాత్రపై తర్వాత విచారణలో దర్యాప్తు చేపడతారు’’ అని వివరించారు.
నివేదికలో సిట్ ఏం సూచించింది?
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు బ్రిడ్జిల ఫిట్‌నెస్‌పై ఆడిటింగ్ నిర్వహించాలని సిట్ సూచించింది. బ్రిడ్జిపైకి వచ్చేవారు, వెళ్లేవారి సంఖ్యను పరిమితం చేయాలని, వారి రికార్డులు నిర్వహించాలని సూచించింది.
ఏదైనా భవనాన్ని ప్రజలు ఉపయోగిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించేలా ‘స్టాండార్డ్ ఆఫ్ ప్రొసీజర్స్’ను సిద్ధం చేయాలి.
సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెస్స్, రిపెయిర్స్ పనులకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించి, వీటిని కచ్చితంగా పాటించాలి.
ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ప్రజలను కాపాడేందుకు అవసరమైన సదుపాయాలు, పరికరాలు అందుబాటులో ఉండాలి.
ఏదైనా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తున్నప్పుడు సదరు సంస్థ టెక్నికల్ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయాలి. వారి దగ్గర నిపుణులైన అధికారులు ఉన్నారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.
2022 అక్టోబరు 30న ఏం జరిగింది?
మోర్బిలోని మచ్ఛు నదిపై ఓ బ్రిడ్జి 2022 అక్టోబరు 30న కుప్పకూలింది. ఆ బ్రిడ్జిపై నిలబడిన చాలా మంది ఆ నదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ఘటనలో 135 మంది మరణించారు. ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను మోర్బీకి చెందిన ఒరేవా గ్రూపుకు అప్పగించారు.
150 ఏళ్లనాటి ఈ బ్రిడ్జిని ఏళ్ల నుంచి అసలు పట్టించుకోలేదు. దీంతో బ్రిడ్జి కేబుల్స్ బాగా బలహీనం అయ్యాయి. నట్లు, బోల్టులు కూడా వదులుగా అయిపోయాయి. ఆ రోజు అక్కడికి వచ్చిన అంతమందిని మోసే సామర్థ్యం ఆ బ్రిడ్జికి లేదు.
దీనిపై ఇండియాతోపాటు ఇంటర్నేషనల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అసలు సరైన అనుమతులు తీసుకోకుండానే ప్రజల కోసం ఈ బ్రిడ్జిని ప్రారంభించారని, అసలు బ్రిడ్జి మెయింటెనెస్స్ పట్టించుకోలేదని ఆ కథనాల్లో రాశారు.
ఘటన తర్వాత తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిలో ముగ్గురు సెక్యూరిటీగార్డులు, ఇద్దరు టెకెట్లు ఇచ్చేవారు, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు.
ఒరేవా గ్రూపు ఓనర్ జయ్‌సుఖ్ పటేల్ కూడా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయారు.
జయ్‌సుఖ్ పటేల్ ఎవరు?
జయ్‌సుఖ్ పటేల్ తండ్రి ఒధావ్‌జీ పటేల్‌ను భారత్‌లో ‘ఫాదర్ ఆఫ్ వాల్ క్లాక్స్’గా పిలుస్తారు. 1971లో ఆయన ఒరేవా గ్రూపును ఏర్పాటుచేశారు.
అప్పట్లో ఆ కంపెనీ పేరు ‘అజంతా ట్రాన్సిస్టర్ క్లాక్ మాన్యుఫ్యాక్చరర్’గా ఉండేది. రూ. లక్షలతో ఏర్పాటుచేసిన ఈ కంపెనీలో ఒధావ్‌జీ వాటా రూ.15,000.
అయితే, ఆ తర్వాత అజంతా క్లాక్స్‌కు భారత్‌లో విశేష ప్రజాదరణ వచ్చింది. 1981లో మిగతా ముగ్గురు పార్ట్‌నర్స్ కంపెనీ నుంచి వెళ్లిపోయారు. దీంతో అజంతా కంపెనీ ఒధావ్‌జీ చేతికి వచ్చింది.
కన్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో వరుసగా 12 ఏళ్లపాటు ‘హైయెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డు’ను అజంతా గ్రూపుకు భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.
45 దేశాల్లో కంపెనీ సేవలు విస్తరించాయి. 2012 అక్టోబరులో ఒధావ్‌జీ పటేల్ మృతి అనంతరం కంపెనీని ఆయన కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత తనకు వచ్చిన కంపెనీకి ‘ఒరేవా’గా జయ్‌సుఖ్ పటేల్ పేరుపెట్టారు.
ఇవి కూడా చదవండి
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)