You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చికెన్ బిర్యానీ 100, మటన్ బిర్యానీ 150.. తెలంగాణలో అభ్యర్థుల ఖర్చుల్లో అంతకంటే తక్కువ చూపించడానికి వీల్లేదు
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుకు పరిమితులున్నాయి. తనకు నచ్చినంత డబ్బు ఎలక్షన్లలో ఖర్చు చేస్తానంటే నిబంధనలు అంగీకరించవు.
కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, 1961లోని రూల్ 90 ప్రకారం గరిష్ఠంగా ఎంత ఖర్చు చేయొచ్చో అంతకుమించి ఖర్చు పెట్టడానికి నిబంధనలు అంగీకరించవు.
తెలంగాణ విషయానికొస్తే ఇక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కొక్కరు గరిష్ఠంగా రూ. 40 లక్షలు ఖర్చు చేయొచ్చు.
నిబంధనలను అతిక్రమించి అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(6) ప్రకారం అది అవినీతిగా పరిగణిస్తారు.
2022 జూన్‌లో ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచారు. దాంతో తెలంగాణ సహా కొన్ని ఇతర రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు రూ.40 లక్షలు గరిష్ఠ పరిమితిగా నిర్ణయించారు.
చిన్న రాష్ట్రాల్లో గరిష్ఠ పరిమితి ఇంతకంటే తక్కువగా ఉంటుంది.
ఎంత ఖర్చు చేశామో చెప్పాల్సిందే..
నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైన రోజు వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చు లెక్కలంతా చెప్పాల్సి ఉంటుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం అభ్యర్థి కానీ, ఆయన ఎలక్షన్ ఏజెంట్ కానీ ఈ ఖర్చుకు సంబంధించిన అకౌంట్ నిర్వహించాలి.
ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 75 రోజుల్లోగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ అకౌంట్ అంతా అధికారులకు సమర్పించాలి.
అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ జిల్లా ఎన్నికల అధికారికి ఈ వివరాలన్నీ సమర్పించాలి.
ఎవరైనా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తే రెండు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల అకౌంట్ నిర్వహించాలి.
ఆయా నియోజకవర్గాలు ఏ జిల్లాల పరిధిలోకి వస్తాయో అక్కడి ఎన్నికల అధికారికి వేర్వేరుగా ఖర్చుల వివరాలు అందించాలి.
లెక్కలు చెప్పకపోతే అనర్హత వేటు
ఫలితాల తరువాత నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించకపోతే శిక్ష ఉంటుంది.
అభ్యర్థులు సకాలంలో ఖర్చుల లెక్కలు చూపించనప్పుడు, దానికి ఆ అభ్యర్థి చెప్పిన కారణాలతో ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందనప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం డిస్‌క్వాలిఫై చేయొచ్చు.
ఈ అనర్హత గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఉండొచ్చు. గెలిచిన అభ్యర్థులైతే సభ్యత్వం కోల్పోతారు. ఓడిపోయినవారైతే కమిషన్ విధించిన శిక్షా కాలంలో పోటీ చేసే అర్హత కోల్పోతారు.
చికెన్ బిర్యానీ 100, మటన్ బిర్యానీ 150
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు తమ ఖర్చుల లెక్క చూపించినప్పుడు తమకు నచ్చినంత ధరలు వేసుకునే వీల్లేదు.
అంటే అసలు ధర కంటే బాగా తక్కువ ధరలకు రశీదులు ఇచ్చి తక్కువ ఖర్చు చేసినట్లు చూపించడానికి వీల్లేకుండా కనీస ధరలు ఎంత అనేది కమిషన్ ప్రతిపాదించింది.
దాని ప్రకారం ఎలక్షన్లలో ప్రచారానికి వాడే వాహనాలకు అద్దెలు, ఫంక్షన్ హాల్, ఆహారం వంటివాటి అనేక వస్తువులు, సేవల వినియోగానికి కమిషన్ అప్రూవ్ చేసిన ధరల కంటే తక్కువ చూపించడానికి వీల్లేదు.
రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ ప్రచారంలో బస్ ఉపయోగిస్తే దాని అద్దె రోజుకు రూ. 6 వేలు
మినీ బస్ అయితే అద్దె(రోజుకు) – రూ. 3,500
ఇన్నోవా వంటి పెద్ద కార్లు అయితే రూ. 4,000
ట్రాక్టర్ అయితే డీజిల్, డ్రైవర్ ఖర్చు అన్నీ కలిపి రోజుకు రూ. 1,000 ఖర్చు చూపించొచ్చు.
ఫంక్షన్ హాల్ ఖర్చు పట్టణ ప్రాంతాల్లో అయితే రోజుకు రూ. 15,000. అదే గ్రామాల్లో అయితే రూ.12,000.
ప్రచార వీడియోలు ప్రదర్శించడానికి, సభలు, సమావేశాలు టెలికాస్ట్ చేయడానికి ఉపయోగించే తెరలకు అద్దె రోజుకు రూ.15,000.
డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే రోజుకు ఒక్కో డ్రోన్ కెమెరాకు కనీసం రూ. 5 వేలు ఖర్చు చూపించాలి.
ఇక ఆహారం విషయానికొస్తే భోజన ఖర్చు ఒక్కొక్కరికి రూ. 80, టిఫిన్ ఖర్చు గ్రామాల్లో అయితే రూ. 30, పట్టణాల్లో అయితే రూ. 35 కనీస ఖర్చుగా చూపించాలి.
చికెన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో అయితే ఒకటి రూ. 100, పట్టణాల్లో రూ. 140.
మటన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో రూ. 150, పట్టణాల్లో రూ. 180
వెజ్ బిర్యానీ గ్రామాల్లో రూ. 70, పట్టణాల్లో రూ. 80.
టీ పట్టణాల్లో అయితే రూ. 10, గ్రామాలలో అయితే రూ. 8.
సమోసా రూ. 10.
వాటర్ బాటిల్ రూ. 20.
పార్టీ కార్యకర్తలు మెడలో వేసుకునే కండువాలు ఒక్కొక్కటి రూ. 15, టోపీలు ఒక్కొక్కటి రూ.20, ఫోటోలు ప్రింట్ చేసిన టీ షర్ట్‌లైతే రూ.100 ఖర్చు చూపించొచ్చు.
ఇలా ప్రచారంలో పెట్టే ప్రతి ఖర్చు కూడా కమిషన్ సూచించిన కనీస మొత్తాల మేరకు ఉండాలి.
కుర్చీలు, టెంట్లు, బొకేలు, దండలు అన్నిటి లెక్కా చెప్పాల్సిందే..
పార్టీలు, అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించినప్పుడు చేసే ఖర్చులలో ఏమేం వెల్లడించాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ ముందే సూచించింది.
దాని ప్రకారం స్టార్ క్యాంపెయినర్లు కాకుండా అభ్యర్థి తరఫున ఎవరు సభలు, ర్యాలీలు నిర్వహించినా ఖర్చుల లెక్క చెప్పాల్సిందే.
అందులో సభకు వచ్చేవారిని తరలించడానికి వాహనాల కోసం పెట్టిన ఖర్చు, సభావేదిక ఏర్పాటు, కుర్చీలు, పెండాల్స్, టెంట్లు వంటి అన్ని ఖర్చులు చెప్పాలి.
బొకేలు, పూల మాలలు, పూల అలంకరణలకు చేసే ఖర్చుల వివరాలూ సమర్పించాల్సిందే. లౌడ్ స్పీకర్లు, యాంప్లిఫయర్లు, కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు, డిజిటల్ బోర్డులు, సభలలో ప్రదర్శనలకు కళాకారులను తీసుకొస్తే వారికి చేసిన చెల్లింపుల వివరాలు వంటివన్నీ చెప్పాలి.
అభ్యర్థులు, నాయకులు హెలికాప్టర్లు వాడితే ఆ అద్దె వివరాలు కూడా చెప్పాలి. జనరేటర్లు, విద్యుత్ బిల్లులు, సీరియల్ సెట్లు వంటి విద్యుదలంకరణలు, హోటల్ గదుల అద్దెలు అన్నిటి లెక్కలు ఇవ్వాలి.
స్టార్ క్యాంపెయినర్ల ఖర్చుల సంగతేంటి?
ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల పేర్లు ప్రకటిస్తుంటాయి. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలైతే 20 మందిని, రిజిష్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పార్టీలైతే 10 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకోవచ్చు.
అయితే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్సటి నుంచి ఏడు రోజుల్లోగా స్టార్ క్యాంపెయినర్లు ఎవరెవరనేది రాష్ట్రంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో)కు చెప్పాలి.
నిర్ణీత గడువులోగా స్టార్ క్యాంపెయినర్ల జాబితా అందజేస్తే ఎన్నికల ఖర్చుల్లో ఈ స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులు రాకుండా మినహాయింపు ఉంటుంది.
సంబంధిత పార్టీలో సభ్యత్వం ఉన్నవారినే స్టార్ క్యాంపెయినర్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఏ నియోజకవర్గానికైనా ప్రచారానికి వెళ్తే ఆ ప్రయాణ ఖర్చులు అక్కడి అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిధిలోకి రావు.
ఇవి కూడా చదవండి:
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)