You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ధీరావత్ భారతి: తెలంగాణలో చివరి ఏకగ్రీవ ఎమ్మెల్యే ఆమేనా?
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్నికలంటేనే పోటీ. ఒక్కోసారి అది ఏకపక్షంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో హోరాహోరీగా సాగొచ్చు.
ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజేతలవుతారు.
కానీ, కొన్ని సందర్భాలలో పోటీ ఎవరూ లేకుండా ఒకే ఒక అభ్యర్థి ఉంటే అలాంటప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.
ప్రత్యక్ష ఎన్నికలలో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ.
తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొందరున్నారు.
అయితే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరూ ఇలా ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికైన సందర్భం లేదు.
2002 తరువాత ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడా ఏకగ్రీవమన్న మాటే లేదు.
ఆ చివరి ఏకగ్రీవ ఎమ్మెల్యే ఎవరు? అంతకంటే ముందు తెలంగాణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనవారు ఎవరెవరు? త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ వివరాలు తెలుసుకుందాం.
పోటీ లేకుండా వారు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం.
దేవరకొండలో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం నుంచి ధీరావత్ రాగ్యా నాయక్ గెలిచారు.
అంతకుముందు రెండు ఎన్నికలలో ఓటమి పాలైన ఆయన్ను దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఆ ఎలక్షన్లలో గెలిపించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన తన మూడో ప్రయత్నంలో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 180 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాగ్యా నాయక్ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడిగా ఉండేవారు.
అయితే, 2001 డిసెంబరులో ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సొంతూరు మద్దిమడుగులో నిర్వహిస్తున్న ఓ జాతరలో పాల్గొనేందుకు వెళ్లారు.
అక్కడ మావోయిస్టులు కాల్పులు జరపడంతో రాగ్యానాయక్ ప్రాణాలు కోల్పోయారు.
దాంతో దేవరకొండ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు, కానీ...
రాగ్యా నాయక్ మృతి తరువాత 2002 మే నెలలో దేవరకొండ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ రాగ్యా నాయక్ భార్య ధీరావత్ భారతికి టికెట్ ఇచ్చింది.
రాగ్యా నాయక్ నక్సలైట్ల దాడిలో చనిపోవడంతో ఆయన కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే పోటీగా తాము అభ్యర్థిని నిలపబోమని అన్ని రాజకీయ పార్టీలూ ప్రకటించాయి.
అయితే, రామావత్ శంకర్ నాయక్ అనే స్వతంత్ర అభ్యర్థి మాత్రం నామినేషన్ దాఖలు చేశారు.
దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు శంకర్ నాయక్‌తో చర్చలు జరిపి చనిపోయిన ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్య అసెంబ్లీకి ఎన్నికయ్యేలా సహకరించాలని కోరడంతో ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
దాంతో పోటీ అభ్యర్థులెవరూ లేకపోవడంతో రాగ్యా నాయక్ భార్య ధీరావత్ భారతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
దాంతో 2002 నుంచి 2004 వరకు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పించింది.
రాగ్యా నాయక్ ఎలా చనిపోయారు?
అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్ల ప్రాబల్యం తీవ్రంగా ఉండేది. తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో పీపుల్స్ వార్ నక్సలైట్ల ప్రభావం ఉండేది.
రాగ్యా నాయక్ మరణానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేస్తున్న ఎలిమినేటి మాధవరెడ్డి 2000 సంవత్సరం మార్చిలో నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో చనిపోయారు.
అది జరిగిన తరువాత సంవత్సరమే 2001లో రాగ్యా నాయక్ కూడా నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
రాగ్యా నాయక్ సొంతూరులో జరిగిన ఓ జాతరకు వెళ్లగా అక్కడ నక్సలైట్లు ఆయనపై కాల్పులు జరిపారు.
నక్సలైట్లతో చర్చలు జరిపే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు గాను అప్పటి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమైన సమయంలో రాగ్యా నాయక్‌పై ఈ దాడి జరిగింది.
ధీరావత్ భారతి తరువాత ఏకగ్రీవాలు ఎందుకు లేవు?
అసెంబ్లీ ఎన్నికల్లో ధీరావత్ భారతి ఏకగ్రీవంగా ఎన్నికై దాదాపు ఇరవయ్యేళ్లు దాటింది.
భారతి తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు.
2002లో ధీరావత్ భారతి ఏకగ్రీవంగా గెలిచిన ఉప ఎన్నిక తరువాత తెలంగాణ ప్రాంతంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
సిటింగ్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వంటి కారణాలతో పాటు మరణించిన సందర్భాలలోనూ ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ ఇతర పార్టీలు తమ తరఫున అభ్యర్థులను నిలపడంతో పోటీ తప్పలేదు.
ఏకగ్రీవ ఎన్నికలు తగ్గుతాయా?
ధీరావత్ భారతి కంటే ముందు తెలంగాణ ప్రాంత నియోజకవర్గాల నుంచి అనేక మంది నేతలు ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1972 ఎన్నికల్లో అత్యధికంగా ఏడుగురు తెలంగాణ ప్రాంత నియోజకవర్గాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1952 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో పరిగి, కొడంగల్, కామారెడ్డి, బాన్స్‌వాడ, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆలూరు, ఆర్మూర్, గద్వాల, బోధన్, వికారాబాద్, జగిత్యాల, బూర్గంపహాడ్, డోర్నకల్, అమరచింత, తాండూర్, మక్తల్, ముధోల్, నిర్మల్, చెన్నూరు, రామాయంపేట వంటి నియోజకవర్గాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యేలున్నారు.
మారిన రాజకీయ పరిస్థితులు,పార్టీల సంఖ్య పెరగడం, రాజకీయాలపై ఆసక్తి పెరగడం వంటి అనేక కారణాల వల్ల ముందుముందు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు తగ్గుతాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ఇవి కూడా చదవండి:
- ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)