You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- రచయిత, కీర్తి దుబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, చైనా సరిహద్దుల్లో 2020 నుంచీ ప్రతిష్టంభన నెలకొని ఉంది. డోక్లాం, లద్దాఖ్‌లోని గల్వాన్ లోయల నుంచి ఈ వివాదం తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు కూడా విస్తరించింది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, గత మూడేళ్లలో తొలిసారిగా భారత విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారులు సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు బీజింగ్‌కు వెళ్లారు.
తాజాగా వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశానికి హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి శిల్పక్ అంబులే బీజింగ్ చేరుకున్నారు.
డబ్ల్యూఎంసీసీ సదస్సులో భాగంగా జులై 2019 తర్వాత రెండు దేశాల సీనియర్ అధికారులు నేరుగా చర్చలు జరపడం ఇదే తొలిసారి. మే 2020లో లద్దాఖ్‌లో ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య 11 డబ్ల్యూఎంసీసీ సమావేశాలు జరిగాయి. అయితే, ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. వీటి నుంచి పెద్దగా ఫలితాలు కూడా కనిపించలేదు.
ప్రస్తుతం బీజింగ్‌కు వెళ్లిన శిల్పక్ అంబులే.. చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
చైనా విదేశాంగ శాఖ సహాయక మంత్రి హువా చున్యింగ్‌తో కూడా శిల్పక్ బుధవారం చర్చలు జరిపారు. అనంతరం చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను ఇద్దరు నాయకులు సమీక్షించినట్లు పేర్కొంది.
చైనా భాష మాండరిన్‌పై శిల్పక్‌కు మంచి అవగాహన ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇదివరకటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లు చైనా నాయకులను కలిసినప్పుడు వీరికి ‘‘అఫీషియల్ ట్రాన్స్‌లేటర్’’గా శిల్పక్ వెళ్లారు.
అయితే, తాజా సమావేశంలో ఇద్దరు నాయకులు ప్రధానంగా సరిహద్దు వివాదంపైనే దృష్టి సారించినట్లు ఆ సమావేశం పేరును చూస్తే స్పష్టం అవుతోంది.
లద్దాఖ్ సెక్టార్‌లో ఇటు భారత్, అటు చైనా 50,000 మందికిపైగా సైనికులను మోహరించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని యాంగ్సేలో గత డిసెంబరులో ఘర్షణల అనంతరం అక్కడ కూడా మోహరింపులను మరింత పెంచారు.
మరోవైపు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మెరుగ్గా స్పందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పార్లమెంటు వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇటీవల వెల్లడించారు.
తాజా సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులను ఇద్దరు నాయకులు సమీక్షించారు. బలగాల ఉపసంహరణపై చర్చలు జరిపారు’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సాధారణానికి తీసుకువచ్చేందుకు, వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది’’అని వివరించారు.
‘‘ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు 18వ దశ సీనియర్ కమాండర్ల సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించాలని ప్రతిపాదించారు’’అని ప్రకటనలో తెలిపారు.
డబ్ల్యూఎంసీసీ మీటింగ్ గత ఏడాది అక్టోబరులో చివరిసారిగా జరిగింది. లద్దాఖ్‌లోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌లో రెండు దేశాలు బలగాల ఉపసంహరణకు నెల రోజుల తర్వాత ఇది చోటుచేసుకుంది.
‘‘గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌లోని పేట్రోలింగ్ పిల్లర్ 15లో భారత్, చైనా బలగాలు సెప్టెంబరులో ఉపసంహరించుకున్నారు. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి డెప్సాంగ్, చార్సింగ్ నాలా పరిధిలోని ప్రాంతాల్లో గస్తీ కాసేందుకు వెళ్లే మార్గాల్లో కొన్ని ఇప్పటికీ చైనా సైన్యం నియంత్రణలోనే ఉన్నాయి’’అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో తెలిపింది.
మరోవైపు ఇటీవల ఒక వార్తా సంస్థతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడారు. ‘‘సరిహద్దుల్లో చైనా భారీగా మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టడంతో మనం కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్నాం. నిజానికి మనం 25 ఏళ్లకు ముందే ఈ ప్రాజెక్టులు చేపట్టి ఉండాల్సింది’’అని ఆయన అన్నారు.
‘‘చైనా వైపు ఒకసారి చూడండి. వారిది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారితో పోలిస్తే, మనది చిన్న ఆర్థిక వ్యవస్థ. వారిపై పోరాటానికి మమ్మల్ని వెళ్లమంటారా?’’అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.
సమావేశం ఫలితం ఏమిటి?
మూడేళ్ల తర్వాత నేరుగా జరిగిన ఈ సమావేశం ఫలితం ఏమిటి?, దీని అనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నలపై దిల్లీలోని చైనా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైజల్ అహ్మద్ మాట్లాడారు.
‘‘డబ్ల్యూఎంసీసీ అనేది చాలా సుదీర్ఘ ప్రక్రియ. మనకు వెంటనే ఫలితాలు కనిపించవు. కానీ, అంతిమంగా ఇవి మనల్ని ఫలితాలవైపు తీసుకెళ్తాయి’’అని అహ్మద్ అన్నారు.
‘‘2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 11 డబ్ల్యూఎంసీసీ మీటింగ్‌లు జరిగాయి. అయితే, నేరుగా కూర్చొని సమావేశం జరపడం ఇదే తొలిసారి. మనం కలిసి కూర్చొంటే మెరుగ్గా మాట్లాడొచ్చు, అక్కడి పరిస్థితులు కూడా ఇద్దరికీ అనుకూలంగా ఉంటాయి’’అని ఆయన అన్నారు.
‘‘చైనాతో మనం అనుసరించే విధానాలు ‘టాప్ టు బాటమ్’ ఉండకూడదు. ‘బాటమ్ టు టాప్’ విధానాలను మనం పాటించాలి. నేరుగా రెండు దేశాల దౌత్యవేత్తలు కలిసి చర్చలు జరపడం చాలా ముఖ్యం. నిజానికి ఇలాంటి 20-30 సమావేశాలు నిర్వహిస్తే, మనకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి’’అని ఆయన చెప్పారు.
2020లో గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీటిలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు కూడా కొందరు సైనికులు మరణించారు.
అయితే, 2005, 2012, 2013ల్లో రెండు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ గల్వాన్‌లో చైనా దాడి చేసిందని అప్పట్లో భారత్ వ్యాఖ్యానించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది.
‘‘కొత్త ఒప్పందాలు అవసరం’’
డోక్లాం వివాదానికి వస్తే, అది మూడు దేశాల కూడలిలో నెలకొన్న ప్రతిష్టంభన. భూటాన్, చైనా, భారత్‌ల మధ్య ఆ వివాదం తలెత్తింది.
1890ల్లో బ్రిటిష్ రాజ్‌తో కుదిరిన ఒప్పందానికి అటు భారత్, చైనా భిన్నంగా భాష్యం చెప్పడంతో ఈ వివాదం తలెత్తిందని విదేశీ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు.
‘‘భారత్, చైనాల మధ్య చాలా ఒప్పందాలు కుదిరాయి. వీటిలో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి కూడా ఉన్నాయి. చైనా వీటిని ఒక కోణంలో చూస్తుంటే, భారత్ మరో కోణంలో చూస్తోంది’’అని డాక్టర్ ఫైజల్ చెప్పారు.
‘‘ఈ విషయంలో వివాదాలు తొలగాలంటే రెండు దేశాలు కూర్చొని చర్చలు జరపాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలి. దీనికి కొంత సమయం పడుతుంది’’అని ఆయన అన్నారు.
విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయా?
అయితే, అంతర్జాతీయ పరిణామాలు నేడు దేశీయ వార్తల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చైనా పదేపదే అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ మంత్రి చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో చర్చలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
అయితే, విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు లేదా దేశీయ పరిణామాలు చైనాతో చర్చలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని డాక్టర్ అహ్మద్ చెప్పారు.
‘‘ద్వైపాక్షిక చర్చలకు స్పష్టమైన అజెండా, దిశానిర్దేశాలు ఉన్నప్పుడు ఇతర అంశాలు పెద్దగా ప్రభావం చూపించవు’’అని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.
‘‘ద్వైపాక్షిక చర్చలకు భారత్ ప్రాధాన్యం ఇవ్వాలి. చైనా, రష్యాల విషయంలో అమెరికా ఐసోలేషన్ పాలసీతో ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో మనం నేరుగా చర్చలు జరపడమే మెరుగైన విధానంగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య గాడితప్పిన సంబంధాలను కూడా వీటితో మనం మెరుగుపరచుకోవచ్చు’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?
- ఏజ్ ఆఫ్ కన్సెంట్: సెక్స్‌కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రోహిణీ సింధూరి-రూపా మౌద్గిల్: ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవేంటి, కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)