తుర్కియే-సిరియా: భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు?– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, తుర్కియేలోని బబ్-అల్-హవా సరిహద్దు నుంచి

రెండు భారీ గేట్లపై ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ కనిపిస్తోంది. ఒక గేటుపై తుర్కియే జెండా ఎగురుతోంది. గేటుకు అటువైపు మాత్రం సిరియా రెబల్ సంస్థ జెండా కనిపిస్తోంది.

ఎందుకంటే దక్షిణ తుర్కియే సరిహద్దుల్లోని ప్రాంతాలు చాలా వరకు సిరియా అధ్యక్షుడు బసర్ అల్-అసద్ ఆధీనంలో లేవు.

ఉదయం ఏడు అవుతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ రెండు డిగ్రీలుగా చూపిస్తోంది. తుర్కియే సరిహద్దుకు పెద్దయెత్తున ప్రజలు చేరుకుంటున్నారు.

ప్రతి ఐదు-పది నిమిషాలకు ప్రజలను దింపడానికి వస్తున్న కారు లేదా చిన్న వ్యాన్‌లు కనిపిస్తున్నాయి.

ఇక్కడకు వస్తున్న వారిలో పిల్లలు, వృద్ధులతోపాటు యువత కూడా ఉన్నారు. మహిళలు కూడా భారీగా వస్తున్నారు.

శిథిలమైన తమ ఇళ్ల నుంచి తీసుకురాగలిగిన వస్తువులను మాత్రమే వీరు వెంట తెచ్చుకుంటున్నారు.

సర్వం కోల్పోయిన బాధతో

కొద్దిసేపటికి మా ముందు ఒక కారు ఆగింది. దానిలో నుంచి అయిదుగురు దిగారు. ఆ డ్రైవర్‌కు వారు వీడ్కోలు పలికి సరిహద్దు వైపుగా వస్తున్నారు.

ఇటీవల భారీ భూకంపం నడుమ ఈ కుటుంబానికి చెందిన రెండంతస్తుల భవనం శిథిలమైంది. ఆ తర్వాత వీరు ఒక గుడారంలో కొన్ని రోజులు గడిపారు.

ఇప్పుడు తమ సొంత ఊరు ఇద్లిబ్‌కు వెళ్లిపోవడానికి వీరు వచ్చారు.

‘‘తుర్కియేలో మాకు ఏమీ మిగలలేదు. అందుకే ఇద్లిబ్‌లోని మా అమ్మానాన్న దగ్గరకు వెళ్లిపోతున్నాం. మళ్లీ తిరిగి వస్తామో లేదో తెలియదు’’అని స్కూలులో టీచర్‌గా పనిచేసే ఉబైద్ హరాక్ చెప్పారు.

విధ్వంసకర భూకంపం తర్వాత, తుర్కియేలో జీవిస్తున్న వందలాది సిరియా కుటుంబాలు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవడానికి ఇక్కడకు వస్తున్నాయి.

ఐడీ కార్డులు ఉండేవారు సరిహద్దులు దాటి తమ సొంత ఊరు వెళ్లేందుకు తుర్కియే ప్రభుత్వం అనుమతిస్తోంది. మరోవైపు ఇక్కడే ఉండేవారికి అనుమతి కాలం ముగిసిపోయినా మరో ఆరు నెలలు గడువు పొడిగిస్తోంది.

సరిహద్దుల్లో భయం, ఉద్రిక్తత

ఈ సరిహద్దు దగ్గర భయంతోపాటు ఉద్రిక్త వాతావరణం కూడా కనిపిస్తోంది. ఇది వరకు ఇక్కడ కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐడీ కార్డులు లేనివారు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించడంతో వారిని నియంత్రించేందుకు తుర్కియే భద్రతా దళాలు బల ప్రయోగం కూడా చేశాయి.

సిరియాలో అంతర్యుద్ధం మొదలై 12 ఏళ్లు గడుస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితుల నడుమ తుర్కియేకు దాదాపు 40 లక్షల మంది సిరియన్లు ఆశ్రయం కోసం వచ్చారు.

అయితే, భూకంపం తర్వాత వీరిలో కొన్ని కుటుంబాలు వెనక్కి వెళ్లిపోయేందుకు ఈ సరిహద్దుకు వస్తున్నాయి. వీరికి తుర్కియేలో పూట గడవడం కూడా కష్టమవుతోంది.

61 ఏళ్ల జలాల్ దాగలీ.. తుర్కియేలోని అంతాక్యా నగరంలో కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఫిబ్రవరి 6నాటి భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో అంతాక్యా కూడా ఒకటి.

శిథిలాల కింద కనిపిస్తున్న తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను జలాల్ మాకు చూపించారు.

‘‘నా భార్య, నలుగురు పిల్లలు, మా తమ్ముడి కుటుంబం అందరూ శిథిలాల కింద సమాధి అయ్యారు. నాలుగు రోజుల తర్వాత వారి మృతదేహాలను బయటకు తీయగలిగాం. మిగతా బంధువులు బతికి ఉన్నారో లేదో తెలియదు. ఎవరూ ఫోన్లు ఎత్తడం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలో, తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మళ్లీ తుర్కియేకు రావడం మాత్రం చాలా కష్టం’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

స్వచ్ఛంద సంస్థల సాయం..

తుర్కియేలోని బబ్ అల్-హవా సరిహద్దుకు సమీపంలోనే సిరియాలోని ఇద్లిబ్ నగరం ఉంటుంది. దీనికి కుడివైపు హాలెప్, ఎడమ వైపు అలెప్పో నగరాలు ఉంటాయి.

గత ఏడాది ప్రత్యేక అనుమతులు పొందిన వారిని మాత్రమే బబ్ అల్-హవా సరిహద్దు గుండా అనుమతించేవారు. అయితే, భూకంపం తర్వాత సాధారణ పౌరులకూ తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

140 ట్రక్కులతో సహాయక సామగ్రి తుర్కియే నుంచి ఉత్తర సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు ఐక్యరాజ్యసమితి శుక్రవారం వెల్లడించింది.

ఉదయం ఏడు గంటలకు ఈ సరిహద్దు దగ్గర డజను ట్రక్కులు సహాయక సామగ్రితో కనిపించాయి. సాయంత్ర వరకు దాదాపు 58 ట్రక్కులు ఇటువైపుగా వెళ్లాయి.

ఒక ట్రక్కు డ్రైవర్‌తో మేం మాట్లాడాం. ‘‘మా ట్రక్కుల్లో దుప్పట్లు, దుస్తులు ఉన్నాయి. ఇవి తుర్కియే ప్రభుత్వం నుంచి రాలేదు. స్వచ్ఛంద సంస్థలు వీటిని సేకరించాయి. అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్కడ సాయం అందించి త్వరగా వెనక్కి వచ్చేస్తాను’’అని ఆయన చెప్పారు.

ప్రాణాలతో బయటపడితే చాలు..

మేం సరిహద్దుకు అవతల కనిపిస్తున్న సిరియా రెబల్ సంస్థ సైనికులతోనూ మాట్లాడాం. పరిస్థితి చాలా దారుణంగా ఉందని వారు చెబుతున్నారు.

అలెప్పోకు చెందిన 29 ఏళ్ల శామిల్ మాట్లాడుతూ.. ‘‘సిరియాకు చాలా తక్కువ అంతర్జాతీయ సాయం అందుతోంది. ఇద్లిబ్, అలెప్పో, దరకూశ్ లాంటి నగరాలు శిథిలమయ్యాయి. అక్కడి ప్రజలే ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. రష్యా, ఇరాన్‌ల నుంచి కొంత సాయం అందుతోంది’’అని ఆయన చెప్పారు.

సిరియాకు తిరిగి వస్తున్న వారికి అక్కడ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తెలుసు. అయితే, అలాంటి విధ్వంసకర భూకంపాల నుంచి ప్రాణాలతో బయటపడటమే అదృష్టమని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)