You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
అనారోగ్యం వస్తే వైద్యుల దగ్గరకు వెళ్లడం తప్పనిసరి. అయితే, ప్రభుత్వ ఆసుపత్రులైనా, ప్రైవేటు క్లినిక్కులైనా డాక్టర్ కన్సల్టేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి చూసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. పైగా ఇది ఎంతో ఖరీదుతో కూడుకున్న వ్యవహారం.
ప్రైవేటుగా ఆన్‌లైన్‌లో డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఏమాత్రం ఉచితం కాదు. దానికి వందల రూపాయాల్లో చార్జీలు విధించే ప్రైవేటు వైద్యులు ఆసుపత్రులు కూడా చాలా ఉన్నాయి.
కానీ ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఆన్‌లైన్‌లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ ద్వారా వైద్యుడ్ని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తీ ఉచితంగా కల్పిస్తోంది.
రోజులో ఎప్పుడైనా సరే మనం ఈ సేవలు వినియోగించుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వ వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేకించి నేషనల్ టెలీకన్సల్టేషన్ సర్వీసు (National TeleConsultation Service)esanjeevaniOPDని నిర్వహిస్తోంది.
ఈ సేవలను అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఏపీలో ఇప్పటి వరకు అత్యధికంగా 3.17 కోట్ల మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటికే 10 కోట్ల మంది ప్రజలు వినియోగించుకుంటున్న ఈ esanjeevaniOPD అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? విధి విధానాలు ఏమిటి? తదితర వివరాలు తెలుసుకుందాం.
ఏమిటి ఈ-సంజీవని?
ఒక్క మాటలో చెప్పాలంటే...ఇది ఆన్‌లైన్ ఓపీ.
మీరు ఆసుపత్రికెళ్లి ఓపీలో చూపించుకునే పనిలేకుండా ఇంట్లోనే ఆన్‌లైన్ ఓపీలో ఆరోగ్య సలహాలు పొందడం.
దేశంలో పౌరులకు టెలీమెడిసిన్ వర్చువల్ కన్సల్టేషన్ సేవలను విస్తృతంగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే నేషనల్ టెలీ కన్సల్టేషన్ సర్వీసులు, ఈసంజీవనిఓపీడీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంతకుముందే ఈ సేవలను ప్రారంభించినప్పటికీ ఇవి అంతగా విస్తృతం కాలేదు. కానీ కోవిడ్ సమయంలో ప్రతి రాష్ట్రం కూడా ఈ సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆదేశించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తదనంతరం కూడా ఈ సేవలను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఇప్పటివరకు దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ సేవలను వినియోగించుకున్నప్పటికీ, దుదరృష్టవశాత్తు ఇప్పటికీ చాలా మందికి వీటిపై అవగాహన లేదు. ఈ పథకంపైన సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేకపోవడంతో ప్రజలు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నారు.
ఏఏ జబ్బులకు వైద్య సలహాలు ఇస్తారు?
నేషనల్ టెలీకన్సల్టేషన్ సర్వీస్ కింద ఇప్పటివరకు 40 రకాల అవుట్ పేషెంట్ విభాగాలను ఈ ఆన్‌లైన్ వేదికపైన అందుబాటులోకి తెచ్చింది.
జ్వరం, జలుబు తదితర సాధారణ జబ్బులకు సంబంధించిన జనరల్ మెడిసిన్, ఆర్థోపిడిక్స్ - ఎముకల సంబంధిత జబ్బులు (Orthopaedics), గైనకాలజీ, సైకియాట్రి, చర్మసంబంధిత వ్యాధులు (డెర్మటాలజీ) AIDS/HIV రోగులకు యాంటీరెట్రోవైరల్ థెరపీ (antiretroviral therapy (ART), కార్డియాలజీ, సాంక్రమికేతర జబ్బులు (Non-Communicable Disease (NCD), చెవి గొంతు ముక్కు సంబంధిత సమస్యలు (ENT) నేత్ర వైద్య సేవలు (Ophthalmology), జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, రుమటాలజీ, పల్మనాలజీ, డెంటల్ ఓపీడీ తదితర విభాగ సంబంధిత సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఏమున్నాయి?
ఆయుర్వేద, న్యూరోపతీ, యునానీ, సిద్ధ, నేచురోపతీ ఓపీడీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంతమంది వైద్యులు అందుబాటులో ఉంటారు?
1,152 ఓపీడీ విభాగాలకు సంబంధించి మొత్తం 2,29,057 మంది వైద్యులు, స్పెషలిస్టులు ఆందుబాటులో ఉంటారు.
ఈ వైద్యులను ఎలా ఎంపిక చేస్తారు?
ఎయిమ్స్, నిమ్స్, లాంటి ప్రభుత్వ స్పెషాలిటీ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ వైద్యులు, ఇతర ప్రైవేటు వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు.
ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ టెలీమెడిసిన్ కన్సల్టేషన్ కోసం వైద్యులను నియమించుకుంటుంది.
వీరంతా అర్హులైన అనుభవం ఉన్న వైద్యులు కాబట్టి వీరిచ్చే సలహాలపైన ఎలాంటి అనుమానాలుండవు.
ఈ సంజీవని ఓపీడీ ఏం నిర్వహిస్తుంది?
- రోగి వివరాలను నమోదు చేస్తుంది
- ఓపీ టోకన్ జనరేట్ చేస్తుంది
- వరుస క్రమాన్ని నిర్వహిస్తుంది
- వైద్యుడితో ఆడియో-వీడియో కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తుంది
- వైద్యుల సూచనలో ఈ-చీటి రూపొందిస్తుంది
- రోగికి ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్ సందేశాలను పంపుతుంది
- ఆయా రాష్ట్రాల వైద్యులు అందించే సేవల వివరాలు తెలుపుతుంది
- పూర్తి ఉచిత సేవలు అందిస్తుంది
ఓపీడీకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ఈసంజీవని ఓపీడీ సేవలు పొందాలంటే ముందుగా మీ దగ్గర తప్పనిసరిగా ఒక ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉండాలి.
గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఈ యాప్‌లను డౌన్లోడు చేసుకోవాలి.
యాప్‌లో లేదా వెబ్‌సైటులో మీ మొబైల్ నంబర్ అడుగుతారు. దానికి ఓటీపీ వస్తుంది, దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఓటీపీ పొందిన తరువాత రోగికి సంబంధించిన పూర్తీ వివరాలను అందులో పొందుపరచాలి.
ఓపీ టోకెన్ కోసం రిక్వెస్టు పంపాలి.
తరువాత మీ జబ్బుకు సంబంధించి ఏదైనా పాత మెడికిల్ రికార్డులు ఉంటే అందులో అప్‌లోడ్ చేయాలి.
తరువాత మీ మొబైల్ నెంబరకు నోటిఫికేషన్ వస్తుంది.
ఇందులో పేషెంట్‌కు ఒక ఐడీ నెంబరు, టోకెన్ నెంబరు వస్తాయి.
వీటి సాయంతో లాగిన్ అవ్వాలి.
డాక్టర్ నేరుగా వీడియో కన్సల్టేషన్‌కు వస్తారా?
వెంటనే రారు. మీరు ఒక్కసారి టోకెన్ తీసుకున్న తరువాత మీకు సంబంధించి ఒక వైద్యుడిని మీకు కేటాయిస్తారు. ఆ వైద్యుడి ఆన్‌లైన్ ఓపీలో మీ వెయిటింగ్ లిస్టు నెంబరు మీకు వస్తుంది.
అప్పుడు వెయిటింగ్ రూమ్ విండోలో “CALL NOW” బటన్ యాక్టివేట్ అవుతుంది.
అప్పుడు మీరు 120 సెకన్ల లోపు ఈ “CALL NOW” బటన్‌ను నొక్కాలి.
ఈ బటన్ నొక్కిన 10 సెకన్ల తరువాత వైద్యుడు నేరుగా మీతో వీడియో కాల్‌లోకి వచ్చి మాట్లాడతారు. మీ ఆరోగ్యాన్ని పరిశీలించి మందులు రాస్తారు.
ఈ-ప్రిస్క్రిప్షన్ అంటే ఏమిటీ?
ఆన్‌లైన్ కన్సల్టేషన్ తరువాత వైద్యుడు మీ ఆరోగ్య పరిస్థితిని మదింపు వేస్తారు. గత రికార్డులను పరిశీలిస్తారు.
అనంతరం మీకు ఎలాంటి మందులు వాడాలో, ఏమేమి పరీక్షలు చేయించుకోవాలో నిర్దిశిస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తారు.
ఇదంతా ఎలక్ట్రానిక్ ప్రింట్ రూపంలో ఉంటుంది.
ఈ-ప్రిస్క్రిప్షన్‌ను మీరు ఎప్పుడైనా డౌన్‌లోడు చేసుకోవచ్చు.
టోకెన్ తీసుకున్నాక ఎంతకాలం పనిచేస్తుంది?
ఒకసారి ఆన్‌లైన్‌లో టోకెన్ పొందాకా ఆ రోజు వరకే అది చెల్లుతుంది.
ఆన్‌లైన్‌లో ఓపీలో సాధారంగా రోగి ఎంత సేపు వెయిటింగ్ లిస్టులో నిరీక్షించాల్సి ఉంటుంది?
ప్రస్తుతం ఆన్‌లైన్ ఓపీలో రోగిని చూడటానికి సగటున 7 నిమిషాలకుపైగా సమయం పడుతోంది
ఫలాన వైద్యుడ్ని సంప్రదించామని గుర్తు పెట్టుకోవడమెలా?
ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్‌లోనే జరుగుతుంది కాబట్టి ప్రతిదీ రికార్డు అవుతుంది.
ప్రతి కన్సల్టేషన్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు నంబరు ఇస్తారు.
తదుపరి మీరు కన్సల్టేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ నంబరు ఆధారంగా మీకు మొదట చూసిన వైద్యుడ్నే మీకు కేటాయించే వీలు కలుగుతుంది.
రోగి వివరాలు తప్పుగా నమోదు చేస్తే సరిచేసుకోవచ్చా?
వీలు ఉండదు.
రోగి వివరాలు నమోదు చేసుకునే సమయంలో ఇంటిపేరు, ఆధార్ నంబరు, తదితర వివరాలను చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి.
ఒకసారి నమోదు చేశాక ఆ వివరాలను మళ్లీ సరిచేసుకోవడం ఇందులో కుదరదు.
అయితే రోగికి సంబంధించిన ఈ-మెయిల్, మొబైల్ నంబర్లను మాత్రం మనకు అవసరమైనప్పుడు సవరించుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో వైద్యుడికి కన్సల్టేషన్ పీజు చెల్లించాల్సి ఉంటుందా?
ఒక్కపైసా కూడా చెల్లించక్కర్లేదు.
ఒకేరోజు రెండు టోకెన్లను జనరేట్ చేసుకోవచ్చా?
కుదరదు. మొదటి టోకెన్ కన్సల్టేషన్ పూర్తి కాకుండా కొత్తగా మరొక టోకెన్ జనరేట్ చేసుకోవడం కుదరదు.
నెట్‌స్పీడు సరిగ్గా లేకుండా కన్సల్టేషన్ మధ్యలో ఆగిపోతే నా టొకెన్ రద్దు అవుతుందా?
రద్దు కాదు. మీ కన్సల్టేషన్ పూర్తయి మీకు ప్రిస్క్రిప్షన్ రాసే వరకు మీ టోకెన్ లైవ్‌లోనే ఉంటుంది.
ఆన్‌లైన్ ఓపీడీ సేవలు పొందాలనుకున్న ప్రతిసారీ నేను కొత్తగా నమోదు చేసుకోవాలా?
అవసరం లేదు. ఒకసారి మీకు యూజర్ ఐడీ వచ్చాక దాని ఆధారంగా నేరుగా లాగిన్ అవ్వొచ్చు.
పేషెంట్ ఐడీ నంబరు తరచూ మారుస్తారా?
లేదు. ఒకసారి మీకు పేషెంట్ ఐడీ నెంబరు ఇచ్చాక దాన్ని మీ జీవితకాలంలో మార్చరు. ఈ ఐడీ నెంబరు 16 అంకెల్లో ఉంటుంది.
స్పెషాలిటీ సేవలు అందుతాయా?
ఆన్‌లైన్ ఓపీడీలో కొన్ని రాష్ట్రాలు స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఓపీడీ సేవల సమయాలు
- జనరల్ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 9:00 AM to 4:00 PM
- ఆయుర్వేద ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00 PM
- యోగా ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00 PM
- నేచురోపతి ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00 PM
- యునానీ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00 PM
- హోమియోపతి ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00PM
- సిద్ధ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 2:00 PM
తెలంగాణలో..
- జనరల్ సర్జరీ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- ఆప్తమాలజీ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- ఆర్తోపెడిక్స్ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- జనరల్ మెడిసిన్ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- గైనకాలజీ ఓపీడీ : సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- పీడియాట్రిక్స్ ఓపీడీ : సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- ఈఎన్‌టీ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- సైకియాట్రీ ఓపీడీ: సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
- డెర్మటాలజీ ఓపీడీ : సోమవారం నుంచి శనివారం వరకు: 10:00 AM to 01:00 PM
మరిన్ని వివరాలకు https://esanjeevaniopd.in/Home లింక్‌లో తెలుసుకోవచ్చు.
ప్రతి పీహెచ్‌సీని ఒక హబ్‌లా చేశాం: ఏపీ హెల్త్ కమిషనర్
ఈసంజీవని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్ చెప్పారు.
‘‘ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఒక హబ్‌గా మార్చాం. ఏపీలో మొత్తం 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ముగ్గురు స్పెషలిస్టులు, 5 మంది వైద్యులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చేశాం. ఈ పీహెచ్‌సీలే కాకుండా ప్రతి జిల్లాను కూడా ఒక హబ్‌గా చేశాం. వీటన్నిటికీ మంచి కనెక్టివిటీ కల్పించాం. ప్రతి పీహెచ్‌సీలో టెలీకన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్ సమర్థంవంతగా నిర్వహించడానికి వీలుగా ఒక డెస్క్ టాప్ ట్యాబ్‌లు ఏర్పాటు చేశాం. దీంతో పాటు 8350 మంది టెలీకాలర్స్ వినియోగించుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు
త్వరలోనే ఈ-ఓపీడీ (e-OPD) సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనివల్ల ఈసంజీవనీ యాప్‌లో టెలీ కన్సల్టేషన్ కోసం నమోదు చేసుకున్న రోగులు తమ ప్రాంతంలోని పీహెచ్‌సీలోని ఈ-ఓపీడీకి నేరుగా కాల్ చేసి వైద్యులను సంప్రదించవచ్చని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం ఎవర్ని సంప్రదించాలి?
రోగుల సహాయం కొరకు ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్, టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. ఈ నెంబర్లు ద్వారా సంప్రదించి మన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Helpline Number: +91-11-23978046
Toll Free: 1075
Andhra Pradesh Helpline Number: 0866-2410978
Telangana Helpline Number: 104
లేదా
Helpline Email ID:[email protected]
ఇవి కూడా చదవండి:
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)