నేషనల్ పెన్షన్ స్కీం: రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పింఛను రావాలంటే ఇలా చేయండి...

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

ప్రభుత్వం నుంచి పింఛను సదుపాయం కోల్పోతున్న ఉద్యోగ వర్గానికి ఒక రక్షణ కవచం ఉండాలనే ఉద్దేశంతో మొదలు పెట్టిన మదుపు మార్గం నేషనల్ పెన్షన్ స్కీం.

2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలులోకి వచ్చిన ఈ మదుపు మార్గం 2009 నాటికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ స్కీం ద్వారా మదుపు చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కోటీ డెబ్బై లక్షలు దాటింది.

ఉద్యోగ విరమణ తర్వాత తగినంత ఆదాయం కోసం అనేక మదుపు మార్గలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, నేషనల్ పెన్షన్ స్కీం మిగిలిన మదుపు మార్గాల కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

దీనికి ప్రధానంగా రెండు కారణాలు:

  • ఈ స్కీం ద్వారా మదుపు చేసిన మొత్తంలో యాభై వేల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మదుపు మార్గానికి మద్దతు ఇవ్వడం. అంటే 30% ఆదాయపు పన్ను కట్టే వారికి మదుపు చేసిన వెంటనే పదిహేడు వేల దాకా ప్రయోజనం ఉంటుంది.
  • ప్రముఖ బ్యాంకుల ఫండ్ మేనేజర్లు ఈ స్కీం ద్వారా మదుపు చేసిన పెట్టుబడి లాభసాటిగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న స్కీం కావడం వల్ల మిగిలిన మ్యూచువల్ ఫండ్స్, యూలిప్ లాంటి మార్గాలతో పోల్చుకుంటే మదుపు చేసే ఖర్చు చాలా తక్కువ.

ఈ స్కీం పనితీరు ఎలా ఉంటుంది?

స్థూలంగా చూస్తే నేషనల్ పెన్షన్ స్కీం మదుపు మార్గం మ్యూచువల్ ఫండ్స్ పనితీరుకు దగ్గరగా ఉంటుంది.

మదుపరుల పెట్టుబడిని ఫండ్ మేనేజర్లు వివిధ రూపాలలో మదుపు చేసి అలా వచ్చిన లాభాన్ని మదుపరులకు అందజేస్తారు.

కానీ కేవలం పెన్షన్ కోసం ఉద్దేశించిన స్కీం కావడం వల్ల మదుపరుల వయసు అరవై ఏళ్ళు వచ్చే దాకా లాభాల కోసం వేచి ఉండాలి.

అంతేకాదు, 60 ఏళ్ళు వచ్చాక కూడా ఒక నిర్దిష్టమైన మొత్తానికి యాన్యుటీ తీసుకోవాలి. ఈ యాన్యుటీ ఒక పెన్షన్ లాగా మదుపరులకు ఉపయోగపడుతుంది.

ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుకుని అన్ని ప్రముఖ బీమా కంపెనీలు ఈ యాన్యుటి సదుపాయాన్ని అందిస్తున్నాయి. మదుపరులు తమ అవసరానికి తగిన యాన్యుటీ ప్లాన్ తీసుకోవచ్చు.

మదుపరులు తమ అవసరాన్ని బట్టి నాలగు స్కీములలో ఏదైనా ఎన్నిక చేసుకోవచ్చు

  • స్కీం ఈ (ఈక్విటీ): ఈ స్కీం ద్వారా మదుపు చేసిన మొత్తంలో 75% దాకా ఈక్విటీలో పెట్టుబడిగా పెడతారు.
  • స్కీం సీ (కార్పొరేట్ డెబిట్): 100% కార్పొరేట్ బాండ్లలో మదుపు చేసే అవకాశం ఈ స్కీం ద్వారా కలుగుతుంది.
  • స్కీం జీ (గవర్నమెంట్ బాండ్): కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే బాండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ స్కీం ద్వారా అందుబాటులోకి వస్తుంది.
  • స్కీం ఏ (ఇతర మదుపు మార్గలు): పైన ఇచ్చిన మూడు మదుపు మార్గాలు కాకుండా ఇతర మదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ స్కీం ద్వారా కలుగుతుంది. కానీ ఈ స్కీం కేవలం ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం లేదు.

ఏ స్కీములను ఎంచుకోవాలి?

నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా పైన ఇచ్చిన నాలగు స్కీములలో ఎందులో అయినా మదుపు చేసుకునే అవకాశం మదుపరులకు ఉంది.

ఈ నాలుగు స్కీములలో దేనికదే ప్రత్యేకమైనది కాబట్టి ఈ స్కీముల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఎక్కువ రిస్క్ ఉన్న ఈక్విటీ స్కీం ద్వారా 45 ఏళ్ళ లోపు ఉన్న ఉద్యోగులు మదుపు చేసి గరిష్ట లాభాన్ని పొందవచ్చు.

కానీ, రిటైర్మెంట్ వయసుకు దగ్గరగా ఉన్నవారు ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అలాంటి వారు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయడం చెప్పదగిన సూచన.

ఇలా వివిధ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా మదుపు చేసే అవకాశం కల్పించడం నేషనల్ పెన్షన్ స్కీం ప్రత్యేకత.

వీటితోపాటు, ఆటో సెలెక్ట్ సౌలభ్యాన్ని మదుపరులు వాడుకుంటే వారి వయసు పెరిగేకొద్దీ వారి మదుపు ఈక్విటీ నుంచీ డెబిట్ వైపుకు మళ్ళుతుంది.

ఈ స్కీంలో రిస్క్ అసలు లేదా?

పైన చెప్పిన స్కీములలో ఏది ఎంపిక చేసుకున్నా ఎంతో కొంత రిస్క్ తప్పదు. రిస్క్ అంటూ లేని మదుపు మార్గం ఏదీ లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్కీం కావడం వల్ల రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.

100% ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసుకున్న వారికి కూడా నష్టభయం తగ్గుతుంది తప్ప ఎంతో కొంత రిస్క్ కచ్చితంగా ఉంటుంది.

దీర్ఘకాల దృక్పథంతో మదుపు చేసిన వారికి రిస్క్ తగ్గుతుంది అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది.

మరోవైపు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం ద్వారా ఈ స్కీం కంటే ఎక్కువ లాభాలను గడించవచ్చు అనే వాదన కూడా ఉంది. కానీ ఆదాయపు పన్ను సౌలభ్యం మాత్రం అందులో ఉండదు.

కాబట్టి రిటైర్మెంట్ అవసరాల కోసం ఈ స్కీం వాడుకోవడం చెప్పదగిన సూచన.

ఎలా నమోదు చేసుకోవాలి?

దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా ఈ స్కీంలో మదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

కానీ దీనికి ముందుగా నేషనల్ పెన్షన్ స్కీం వెబ్‌సైటులో పాన్-ఆధార్ కార్డ్ ఉపయోగించి ఒక పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(PRAN) తీసుకోవాలి.

ఆ తర్వాత ఆ సంఖ్యను తమ బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి, సులభంగా తమకు నచ్చిన స్కీంలో మదుపు చేసుకోవచ్చు.

అలాగే డిమాట్ సదుపాయాన్ని కల్పించే సంస్థల ద్వారా కూడా ఈ స్కీంలో నమోదు చేసుకోవచ్చు.

ఈ రెండు మార్గాలలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా కేవలం రెండు మూడు పనిదినాలలో నమోదు పని పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)