తినకుండానే బరువు పెరుగుతున్నారా? కారణం ఇదే

    • రచయిత, రాక్వెల్ సోలెర్ బ్లాస్కో, సబ్రినా లాప్
    • హోదా, బీబీసీ కన్వర్జేషన్

ఊబకాయం లేదా అధిక బరువు అనే పదాలను విన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది అనారోగ్యకరమైన ఆహారం, వారి జీవనశైలి. కానీ ఆరోగ్యవంతమైన జీవనశైలి ఉన్నా అధికంగా బరువు పెరుగుతారనే విషయం మీకు తెలుసా?

ఇటీవలి కాలంలో పర్యావరణంలోని కొన్ని రసాయన సమ్మేళనాలు మనిషిలో అధిక బరువు లేదా ఊబకాయం వృద్ధికి దోహదం చేస్తాయని తేలింది.

ఈ రసాయన సమ్మేళనాలను ఒబెసోజెన్స్ అంటారు.

అజీర్ణం లేదా కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా వీటి ప్రభావానికి లోనై శరీరంలో తెల్ల కొవ్వు కణజాలం లేదా కొవ్వు ద్రవ్యరాశి పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతూనే ఉంటాం.

షాకింగ్ విషయం ఏంటంటే.. మనం రోజూ వాడే డిటర్జెంట్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ డబ్బాలు, బట్టలు, కాస్మోటిక్స్ ఇలా అన్నింటిలో ఈ కెమికల్స్ ఉంటాయి.

ఇప్పటివరకు సుమారు 50 రకాల రసాయనాలను ఒబెసోజెన్‌లు లేదా పొటెన్సియల్ ఒబెసోజెన్‌లుగా విభజించారు.

వాటిలో బిస్ ఫినాల్ ఎ, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, థాలేట్స్, పాలీబ్రోమినేటెడ్ డైఫినైల్ ఈథర్స్, పెర్ఫ్లోరో ఆల్కైలేటెడ్ పదార్థాలు, పారాబెన్స్, యాక్రిలామైడ్, ఆల్కైల్ఫెనాల్స్, డిబుటిల్టిన్ వంటివి అంతేకాకుండా కాడ్మియం, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు శరీర బరువును పెంచుతాయి.

ఇవి శరీర బరువును ఎలా పెంచుతాయి?

నిజానికి ఈ లోహాలు స్వయంగా ఊబకాయానికి దోహదం చేయవు. కానీ రకరకాలుగా బరువు పెరగడానికి కారణమవుతాయి.

ఉదాహరణకు అవి అడిపోసైట్స్ అనే కొవ్వు కణాల విస్తరణను ప్రేరేపిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే అవి కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే కణాల సంఖ్య, పరిమాణాన్ని పెంచుతాయి.

ఈ తెల్ల కొవ్వు కణజాలం పెరుగుదల ఊబకాయానికి దారి తీస్తుంది. అంతేకాదు, ఇది వివిధ అవయవాల్లో ముఖ్యంగా కాలేయంలో గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు చేరడానికి కారణమవుతుంది.

అదేవిధంగా ఈ ఒబెసోజెన్స్ పదార్థాలకు గురికావడం వల్ల హార్మోన్ల పనితీరు కూడా మారుతుందని కనుగొన్నారు.

ఈ హార్మోన్లలో సెక్స్ హార్మోన్లు లేదా థైరాయిడ్ హార్మోన్ల వర్గానికి చెందినవి ముఖ్యమైనవి. వీటికి బరువు పెరగడం, జీవక్రియతో సంబంధం ఉంటుంది.

అంతేకాకుండా ఈ రసాయనాలు గట్ మైక్రోబయోటాను కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి లిపిడ్ల శోషణను నియంత్రించే బ్యాక్టీరియా. శరీరంలో లక్షలాదిగా ఉంటాయి

కాబట్టి వాటి క్షీణత అనేది టైప్ 2 డయాబెటిస్ లేదా ఊబకాయం వంటి వ్యాధులకు కారణమవుతుంది.

అధిక ప్రమాదం ఎప్పుడుంటుంది?

మనం ఒబెసోజెన్స్‌కు ఎప్పుడు టచ్‌లోకి వస్తామో దాని ఆధారంగా కూడా వ్యాధి ప్రభావాలు మారుతూ ఉంటాయి.

ముఖ్యంగా జీవితం ప్రారంభ దశల్లో (పిండం, శిశువు దశల్లో) దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ఉన్నపుడు ఒబెసోజెన్స్ పదార్థాలకు గురైతే దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది.

ఆ సమయంలో వాతావరణ ప్రభావం కారణంగా శిశువు శరీరం మార్పులకు లోనవుతుంది. దీంతో జీవితాంతం కొన్ని వ్యాధులు శరీరంలో పెరిగే ప్రమాదం ఉంటుంది. ఒత్తిడి లేనప్పుడు కూడా ఇటువంటి మార్పులు ఉంటాయి.

ఊబకాయంలోనూ ఇలాంటి మార్పులు వస్తాయా?

ఊబకాయంలోనూ ఇలాంటివి జరుగుతాయని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి.

మనిషి పెరిగే దశలో వీటి ప్రభావాలకు లోనైతే జన్యుపరమైన మార్పులకు దారితీస్తుంది. దీనివల్ల డీఎన్ఏను మారదు కానీ, దాని ప్రభావం మారే అవకాశాలు ఎక్కువ.

అంటే ఇది కణాల పనితీరును మార్చగలదు. తద్వారా ఊబకాయం, ఇతర జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రభావం ఇక్కడితో ఆగిపోదు.

జంతువులలో చేసిన అధ్యయనాల ద్వారా ఈ మార్పులు తదుపరి తరాలకూ చేరవచ్చని కనుగొన్నారు. అంటే, ఈ వ్యాధులు వారసత్వంగా రావొచ్చు.

ఎలా రక్షించుకోవాలి?

మన దైనందిన జీవితంలో ఒబెసోజెన్‌లతో జీవిస్తున్నప్పటికీ మనల్ని రక్షించుకునే దారులూ ఉన్నాయి.

  • ధూమపానానికి దూరంగా ఉండటం
  • ప్యాక్డ్ ఫుడ్స్, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం.
  • ప్లాస్టిక్, సౌందర్య సాధనాలు, లోషన్ల వాడకాన్ని తగ్గించడం.
  • పురుగుమందులతో తయారైన ఆహారం తినడం తగ్గించడం.
  • వీలైనంత వరకు అన్నింటినీ రీసైకిల్ చేసి ఉపయోగించడం.

ముఖ్యంగా వైద్యారోగ్య అధికారులు ఈ పదార్ధాల వినియోగం తగ్గించడానికి విధానపరమైన చర్యలు తీసుకోవాలి.

అదనంగా ఒబెసోజెన్‌లపై నిరంతర పరిశోధన అవసరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)