You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశలో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ, మరి ఇప్పుడేం చేయబోతున్నారు?
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసే అంశంపై ఎట్టకేలకు వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధుల్లో నిరాశకు కారణమైంది.
ఐదుగురు సభ్యుల డివిజన్ బెంచ్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయంతో తీర్పు నివ్వగా, మరికొన్ని అంశాల్లో న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు కనిపించాయి.
అయితే, వివాహాలను చట్టబద్ధంచేసే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయంతో ధర్మాసనం తీర్పునిచ్చింది. ‘‘ఈ అంశం పార్లమెంటు పరిధిలో ఉంది. మేం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం’’ అని ధర్మాసనం తెలిపింది.
మరోవైపు స్వలింగ సంపర్క జంటలకు సామాజిక, చట్టపరమైన హక్కులను కల్పించేందుకు ఒక కమిటీ ఏర్పాటుచేస్తామనే ప్రభుత్వ ప్రతిపాదను కూడా కోర్టు ఆమోదించింది.
భారత్‌లో లక్షల సంఖ్యలో ఉండే ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులు ఈ తీర్పు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో చాలా వేగంగా ఈ కేసుపై విచారణ జరగడంతో పాజిటివ్‌గా తీర్పు వస్తుందని ఈ కమ్యూనిటీ ఆశించింది. కానీ, అలా జరగలేదు.
ముంబయిలో 19 ఏళ్లుగా తన జీవిత భాగస్వామితో సహజీవనం చేస్తున్న డాక్టర్ ప్రసాద్ రాజ్ దాడేకర్ ఈ తీర్పుపై ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు.
‘‘తీర్పు వింటున్నప్పుడు నా కళ్లలో నుంచి నీరు వస్తూనే ఉన్నాయి. 19 ఏళ్ల నుంచీ మా బంధం అలానే ఉండిపోయింది. ముందుకు అడుగులు పడటం లేదు. కానీ, సమానత్వపు హక్కుల కోసం మేం పోరాడుతూనే ఉంటాం’’ అని ఆయన చెప్పారు.
మరోవైపు స్వలింగ సంపర్కుల కోసం పోరాడే రచయిత అశోక్ రావు కూడా తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
‘‘స్వలింగ సంపర్కం నేరంకాదని కోర్టు చెప్పినప్పుడు మా కోసం అండగా ఒకరు ఉన్నారని అనిపించింది. కానీ, నేడు మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడం గురించి, ఈ విషయాన్ని ప్రభుత్వానికే అప్పగించడం గురించి మాట్లాడారు. ఈ తీర్పు కోసం ఎదురు చూసీచూసీ నా వయసు అయిపోతోంది. ఇన్నేళ్లు గడుస్తున్నా మేం సాధించినదంటూ ఏమీలేదు’’ అని ఆయన అన్నారు.
స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు 2018లో తీర్పునిచ్చింది. ఆ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ..‘‘హోమోసెక్సువాలిటీ నేరం కాదు. స్వలింగ సంపర్కులకు కూడా సాధారణ ప్రజల్లానే ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. గౌరవంతో హుందాగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’’ అని అన్నారు.
తాజా తీర్పులో భాగంగా.. స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటుచేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన ప్రతిపాదనకు మంగళవారం కోర్టు సమ్మతించింది.
ఆ నిపుణుల కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సహా కొన్ని హక్కులను కల్పించే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
తాజా కేసు విషయంలో సుప్రీం కోర్టు ‘పాసింగ్ ద పార్సిల్’ గేమ్ ఆడినట్లుగా అనిపించిందని 34 ఏళ్ల నుంచీ లెస్బియన్ రిలేషన్‌షిప్‌లోనున్న పియా చందా అన్నారు.
యాక్టివిస్టు హరీశ్ అయ్యర్ స్పందిస్తూ.. ‘‘ఆ కమిటీలో ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులకూ ప్రాతినిధ్యం కల్పించాలి. అది ఏకపక్ష కమిటీ కాకూడదు’’ అని అన్నారు.
తాజా తీర్పుతో వివాహ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా చూడలేమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. అయితే, ట్రాన్స్‌జెండర్లతోపాటు స్వలింగ సంపర్కులు ప్రస్తుత చట్టాల కింద పెళ్లిళ్లు చేసుకోవచ్చని కోర్టు పునరుద్ఘాటించింది.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్-194 గురించి తాజా తీర్పుల్లో జడ్జిలు స్పందించారు. ఈ చట్టం కింద మతాంతర, కులాంతర వివాహాలను భారత్‌లో నమోదుచేస్తుంటారు.
ఈ కేసుపై తీర్పు నిచ్చే సమయంలోనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌కు సవరణ చేయడంపై చర్చ జరిగింది. అయితే, చివర్లో ఈ చట్టానికి సవరణ చేయడం అనేది తమ పరిధిలోలేదని కోర్టు తెలిపింది.
దత్తత విషయానికి వస్తే, ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులు, వివాహం కాని జంటలు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఈ విషయంలో కొన్ని సవరణలు తీసుకురావాలని, అప్పుడే ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ప్రతినిధులకూ దీనిలో చోటు కల్పించినట్లు అవుతుందని జస్టిస్ ఎస్‌కే కౌల్ కూడా అన్నారు.
అయితే, మిగతా ముగ్గురు న్యాయమూర్తులు ఈ వాదనతో విభేదించారు. దీంతో స్వలింగ సంపర్కులకు ఈ హక్కు ఉండబోదని అంతిమంగా ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఈ అంశంపై ‘హమ్‌సఫర్ ట్రస్టు’ ఫౌండర్ అశోక్ కాక్ స్పందిస్తూ.. ‘‘దత్తత తీసుకోవడం, ఆస్తి హక్కులు, పింఛను, రేషన్ కార్డులు.. ఇలా దాదాపు అన్ని హక్కులూ మాకు చాక్లెట్ చూపించినట్లు చూపించి వెనక్కి లాగేసుకున్నారు’’ అని అన్నారు.
తర్వాత ఏమిటి?
విచారణ సమయంలో ‘‘పెళ్లంటే ఇద్దరి కలయిక. అది కేవలం పురుషుడు, మహిళ మధ్య కలయికే కానవసరం లేదు’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
‘‘నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును తీసేసుకోవడమంటే ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య. ఎందుకంటే లైంగికత ఆధారంగా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం వ్యతిరేకిస్తుంది’’ అని న్యాయవాదులు చెప్పారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘నచ్చిన వ్యక్తిని ప్రేమించడం, వారితో కలిసి జీవించడం ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయి. కానీ, నచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకునే హక్కుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇవే స్వలింగ సంపర్కులకు కూడా వస్తాయి’’ అని అన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలను కొన్ని మతపరమైన సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి సంబంధాలు సహజమైనవని చెబుతున్నాయి.
ఈ అంశంపై న్యాయవాది కరుణా నంది ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో మీకు నాలుగు భిన్నమైన తీర్పులు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ, వాటన్నింటినీ పరిశీలిస్తే స్వలింగ సంపర్కుల హక్కులను పరిరక్షించాలని, ఈ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని కోర్టు చెప్పింది’’ అని అన్నారు.
మరోవైపు డాక్టర్ ప్రసాద్ రాజ్ స్పందిస్తూ.. ‘‘సాధారణ ప్రజలకు ఉండే హక్కులన్నీ ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులకు కల్పించాలనే భావాన్ని కోర్టు వ్యక్తంచేసింది. అయితే, ఈ విషయంలో ముందుకువెళ్లే బాధ్యత ప్రభుత్వానికి అప్పగించింది’’ అని అన్నారు.
‘‘ప్రభుత్వం ఈ హక్కులను మాకు ఇచ్చేందుకు అంగీకరిస్తుందని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్. మా కమ్యూనిటీకి కూడా ఓటు బ్యాంకు ఉంది. ఎవరూ మా ఓట్లు పోగొట్టుకోవాలని కోరుకోరు’’ అని చెప్పారు.
అయితే, మొదట ఈ తీర్పును లోతుగా అధ్యయనం చేస్తామని, అప్పుడే ప్రభుత్వం ముందు మా వాదన బలంగా వినిపించేందుకు అవకాశం దొరుకుతుందని స్వలింగ సంపర్కుల ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం 34 దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత ఉంది. ఆసియాలోనూ తైవాన్, నేపాల్ ఇప్పటికే స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాయి.
ఇవి కూడా చదవండి
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)