You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధత: సుప్రీంకోర్టులో విచారణపై గే జంటలు ఏమంటున్నాయి?
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగా, గే వివాహాల విషయంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, ఎందుకంటే ఇది మొత్తం సమాజంపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అన్నది.
ఎన్నో ఆశలతో, అంచనాలతో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు సుప్రీంకోర్టు విచారణను వారు శ్రద్ధగా గమనిస్తున్నారు.
ఐఐటీ దిల్లీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి అభిషేక్ ఒక గే.
28 ఏళ్ల అభిషేక్ డేటింగ్ యాప్ ద్వారా 28 ఏళ్ల న్యాయవాది సూరజ్ తోమర్‌ని కలిశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య నెలకొన్న సాన్నిహిత్యం, సంభాషణలు ప్రేమగా మారాయి.
గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ కలిసే ఉంటున్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాన్ని సుప్రీంకోర్టు గుర్తిస్తుందని ఈ ఇద్దరు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు.
‘‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు వారి పిల్లలకి ప్రేమను పంచలేరని కాదు. స్వలింగ సంపర్కుల వివాహ చట్టం ఉండటం ద్వారా విద్యా, వైద్య రుణాలు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను మేం కూడా పొందుతాం’’ అని చెప్పారు.
న్యాయపరమైన విధానాల్లో లోపం ఉన్నందున తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేకపోయామని తెలిపారు.
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టం తమ ప్రాథమిక హక్కు అని, దాన్ని తాము తప్పనిసరిగా పొందుతామని ఈ ఇద్దరు చెబుతున్నారు.
గే కపుల్స్ విషయంలో భయపడుతోన్న సమాజం
నాగ్‌పూర్‌కి చెందిన సుబోధ్ వయసు 30 ఏళ్లు. వృత్తి పరంగా ఫ్యాషన్ డిజైనర్.
2011లో తన హోమోసెక్సువాలిటీ గురించి తన తల్లికి చెప్పారు.
‘‘ఇదంతా నా కుటుంబానికి ఎలా చెప్పాలో అని నేను చాలా భయపడ్డాను. కానీ, ఎప్పుడైతే ఈ విషయం గురించి నేను నా కుటుంబానికి చెప్పానో, అప్పుడు వారందరూ దీన్ని అంగీకరించారు’’ అని తెలిపారు.
‘‘ఆర్టికల్ 377కి ఆమోదం ఇచ్చినప్పుడు, పెళ్లికి ఎందుకు ఇవ్వరు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లభించిన తర్వాత, ఎవరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు’’ అని సుబోధ్ చెప్పారు.
‘‘ఒకవేళ సింగిల్ పేరెంట్స్ పిల్లల్ని దత్తత తీసుకోగలిగినప్పుడు, తల్లి లేదా తండ్రి ఒకరి నుంచే ప్రేమను, సంరక్షణను పిల్లలు పొందుతున్నప్పుడు మేమెందుకు అదే ప్రేమను, సంరక్షణను అందించలేం. స్వలింగ సంపర్క వివాహం తర్వాత ఇద్దరు తల్లులు లేదా ఇద్దరు తండ్రులుంటారు’’ అని చైల్డ్ అడాప్షన్‌పై కూడా సుబోధ్ మాట్లాడారు.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరంగా ఆమోదం లభించినప్పటికీ, ప్రజల ఆలోచనల్లో మార్పులు రావడానికి చాలా సమయం పడుతుందని సుబోధ్ భావిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి గే కపుల్స్ ఏం అంచనావేస్తున్నారు?
‘‘మా డిమాండ్లను పార్లమెంట్‌కి పంపకుండా, సుప్రీంకోర్టు దానికదే ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వంపై మాకెలాంటి నమ్మకం లేదు. మాకేదైనా నమ్మకం ఉందంటే అది సుప్రీంకోర్టుపైనే.
ఎందుకంటే, ఆర్టికల్ 377 విషయంపై కూడా సుప్రీంకోర్టు మా పక్షాన నిలబడి, మా బాధలను విన్నది’’ అని లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్ పర్సన్ నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన రితికా చెప్పారు.
ఒకవేళ స్వలింగ సంపర్కుల వివాహాన్ని భారత్‌లో అనుమతించకపోతే..
బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీలో బిజినెస్ ఎకనామిస్ట్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న 37 ఏళ్ల సాత్విక్, ఆగస్టు 2020లో దేశం విడిచి పెట్టి వెళ్లారు.
2007లో సాత్విక్ తన మాస్టర్స్ కోసం యూకే వెళ్లారు. 2009లో పూర్తి చేశారు.
ఆ తర్వాత కొంత కాలం పనిచేసి, లండన్ నుంచి భారత్‌కు వచ్చారు. భారత సంస్కృతిని ఆయనెంతో ఇష్టపడతారు.
కానీ, తన గే పార్టనర్‌తో కలిసుండే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సాత్విక్, ఆ తర్వాత పూర్తిగా దేశం విడిచి వెళ్లారు.
తన పార్టనర్‌తో కలిసి ఉండేందుకు ఇల్లు కూడా దొరకకపోవడంతో, తన భాగస్వామితో కలిసి దేశం విడిచి వెళ్లి పోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
‘‘ఎనిమిదేళ్లుగా మేం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మేమింకా భారత్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతి ఇస్తేనే ఇది జరుగుతుంది.’’ అని తెలిపారు.
స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు లేకపోవడంతో, చాలా మంది గే కపుల్స్ దేశం విడిచి వెళ్తున్నారు. దీని వల్ల భారత్ పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లేకపోయినా పెళ్లిళ్లు చేసుకుంటోన్న కొందరు
కోల్‌కతాకు చెందిన మౌసుమి బెనర్జీకి 35 ఏళ్ల వయసు. ఒక ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
బీబీసీతో మాట్లాడిన సమయంలో తాను ఒక లెస్బియన్ అని తెలిపారు. గత ఫిబ్రవరిలోనే తన పెళ్లి జరిగిందన్నారు.
కుటుంబం, స్నేహితుల సమక్షంలో కోల్‌కతాలోని శోభా బజార్‌లోని ఆలయంలో తమ పెళ్లి జరిగినట్లు మౌసుమి బెనర్జీ చెప్పారు.
‘‘మా పెళ్లి చట్టబద్ధం కాకపోవడంతో, మేం ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య సేవలు పొందలేకపోతున్నాం. సాధారణంగా పెళ్లయిన జంటలకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను, మేం కూడా పొందాలి’’ అన్నారు.
ఈ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించడం ద్వారా తాము సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందుతామని మౌసుమి చెప్పారు.
ప్రజలు తమని భిన్నంగా చూడరనీ, ప్రజల ఆలోచన కూడా మారుతుందన్నారు. సమాజంలో తమకూ సమానమైన గౌరవం లభించాలని మౌసుమి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
- టూత్‌పేస్ట్ ట్యూబ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్... 65 మంది అరెస్ట్
- ఐపీఎల్ 2023: పరుగుల వర్షం, రికార్డుల మోత... చరిత్రలో నిలిచిపోయేలా లక్నోVs. పంజాబ్ మ్యాచ్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)