You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘అమ్మకూ ఓ తోడు కావాలి కదా!’ - తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు
- రచయిత, కె.శుభగుణం
- హోదా, బీబీసీ తమిళ్
‘‘పెళ్లీడుకొచ్చిన నా కొడుకులు నా వద్దకు వచ్చి, ‘అమ్మా.. మళ్లీ పెళ్లి చేసుకో’ అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను’’ అని సెల్వి చెప్పారు.
అదే సమయంలో, తాను చాలా గర్వంగా ఫీలయ్యానని, భర్తలను కోల్పోయి ఒంటరిగా పిల్లల్ని పెంచుతోన్న ఎంతో మంది మహిళలున్న ఈ సమాజంలో ఎవరూ కూడా ఈ విధంగా ఆలోచించలేదని సెల్వి అన్నారు.
కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వికి ఇద్దరు కొడుకులు భాస్కర్, వివేక్. వీరు చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో తమ తండ్రిని కోల్పోయినప్పుడు పెద్ద కొడుకు భాస్కర్ వెల్లోర్‌లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వివేక్ 11వ తరగతిలో ఉన్నారు.
‘‘అప్పటి వరకు మేము ఎప్పుడూ కూడా మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదు. మా పట్టణంలో ఎంతో మంది మహిళలు వారి భర్తలను కోల్పోయి, ఒంటరిగానే పిల్లల్ని పెంచుతున్నారు. కానీ, ఒకసారి కాలేజీ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు, స్కూల్‌లో పనిచేసే ఒక టీచర్ వద్దకు వెళ్లాను. ఎప్పటిలాగా నార్మల్‌గానే నేను టీచర్ వద్దకు వెళ్లాను. అప్పుడు ఆ టీచర్ అమ్మ రెండో వివాహం గురించి మాట్లాడారు. ఎంతో కాలంగా మీ అమ్మ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు ఆమెకు మీరు రెండో పెళ్లి చేయకూడదు? అని ప్రశ్నించారు’’ అని భాస్కర్ చెప్పారు.
ఆ సమయంలో టీచర్ మాట్లాడిన ఈ మాటలను భాస్కర్ జీర్ణించుకోలేకపోయారు. తన తల్లితో మాట్లాడకపోవడం వల్ల టీచర్ ఇలా మాట్లాడి ఉంటారని అనుకుంటూ, టీచర్ మాటలను పక్కన పెట్టారు భాస్కర్.
పునర్‌వివాహం చర్చలు మళ్లీ ఎలా ప్రారంభమయ్యాయంటే
ఆ తర్వాత చాలా కాలం పాటు భాస్కర్ దీని గురించి పట్టించుకోలేదు. కాలేజీ ముగించుకుని, ఉద్యోగంలో మునిగిపోయి బయట ప్రపంచంలో బతకడం ప్రారంభించారు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే పుస్తకాలను చదివేవారు. పుస్తకాలు చదవడాన్ని ఆయన మెల్లమెల్లగా తన అలవాటుగా మార్చేసుకున్నారు.
అదే సమయంలో, పుస్తకాలు చదివే అలవాటున్న ఎంతో మంది స్నేహితులను కలిశారు.
పునర్‌వివాహాలపై పెరియార్ రాసిన విషయాలను చదివిన భాస్కర్, ఈ విషయాలపై తన స్నేహితులతో చర్చించే వారు.
పెరియార్ రాసిన విషయాలను చదివిన భాస్కర్ కూడా ఒక దశలో.. ‘‘మన ఇంట్లో కూడా, తల్లి భర్తను కోల్పోయి, ఒంటరిగా గడుపుతోంది. ఎందుకు ఆమె మళ్లీ పెళ్లి చేసుకోకూడదు’’ అనే విషయంపై ఆలోచించారు.
ఇదే విషయాన్ని తన తమ్ముడు వివేక్‌కి తెలియజేశారు. తన అన్న నిర్ణయాన్ని ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఒప్పుకున్నట్లు వివేక్ తెలిపారు. తన అడుగు జాడల్లో నడవడమే తన నిర్ణయమన్నారు. ఇద్దరూ కలిసి ఈ నిర్ణయాన్ని తమ తల్లి ముందుంచారు.
‘‘అమ్మ వ్యక్తిగత జీవితమంతా మా చుట్టూనే తిరిగిందని మాకు తెలుసు. ఆమెకి కూడా వ్యక్తిగత జీవితమంటూ ఉండాలి కదా. కానీ, ఈ విషయం అమ్మతో మాట్లాడేందుకు కాస్త సంకోచించాం’’ అని తెలిపారు.
ఈ విషయాన్ని తాము నేరుగా చెప్పకుండా, మరో విధంగా తెలియజేయాలనుకున్నాం. ‘‘ఒక రోజు అమ్మ నాతో నా పెళ్లి గురించి మాట్లాడింది. నాకు పెళ్లీడు రావడంతో పెళ్లి చేసుకోవాలని అభ్యర్థించింది. వెంటనే నేను నువ్వు పెళ్లి చేసుకోకుంటే, నేను చేసుకోను అన్నట్లు చెప్పేశాను’’ అని భాస్కర్ తెలిపారు.
ఆ తర్వాత ఈ విషయాన్ని తన తల్లితో మాట్లాడుతూ వచ్చానని అన్నారు. ‘‘నువ్వు ఎంతో కాలంగా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నావు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. తొలుత నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నేను చేసుకుంటాను’’ అని చెప్పినట్లు భాస్కర్ తెలిపారు.
పునఃవివాహాన్ని వ్యతిరేకించిన బంధువులు
కొన్నేళ్ల పాటు తన ఇద్దరు కొడుకులు ఇదే విషయంపై పదే పదే మాట్లాడుతూ ఉండటంతో చివరికి సెల్వి రెండో వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. భర్తలను కోల్పోయిన చాలా మంది జీవితాంతం ఒంటరిగానే బతుకుతున్నారు. దీంతో చాలా మంది బంధువులు తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒప్పుకోలేదు.
‘‘నా పెద్ద కొడుకు దీని గురించి మాట్లాడినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నా కొడుకు పెళ్లీడుకి వచ్చాక నేను మళ్లీ చేసుకుంటానా? అని తిట్టాను. చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందన్నాను. కానీ ఎన్నేళ్లు నువ్వు ఒక్కదానివే కష్టపడతావు. నీలాంటి ఒకరు నీకంటూ జీవిత భాగస్వామిగా ఉంటే, నేను, తమ్ముడు బయట ఎక్కడికి వెళ్లైనా పని చేసుకోవచ్చు కదా అని నా కొడుకులు అన్నారు’’ అని సెల్వి తెలిపారు.
అయితే ఇదంతా పక్కన పెడితే, తమకంటూ ఒక జీవితముంటోంది. దానిలో జీవించాలి. ‘‘ఇలా చేయడం ద్వారా నా లాంటి భర్తలను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న వారికి ఉదాహరణగా నిలవగలను’’ అని ఆలోచించానని చెప్పారు. ఈ విషయం గురించి అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించినట్లు తెలిపారు.
తన జీవితాన్ని నిర్ణయించుకునే ధైర్యాన్ని, తెగువను తన కొడుకులు తనకు అందించారని సెల్వి అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ఎవరూ కూడా, తన రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించారు.
ఎంతో ఆలోచించిన తర్వాత, తన కొడుకులు తనకు సపోర్ట్‌గా నిలుస్తారనే ఆశతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
తల్లి కోసం వరుడిని వెతకడం ప్రారంభించిన కొడుకులు
తన తల్లి నుంచి అనుమతి పొందిన తర్వాత, తన కోసం సరైన వరుడిని వెతకడం ప్రారంభించారు కొడుకులు. ‘‘భార్యను కోల్పోయి, మా తల్లిని రెండో వివాహం చేసుకునే పెళ్లి కొడుకుని వెతికే ప్రక్రియ అంత తేలిగ్గా పూర్తవుతుందని మేము అనుకోలేదు’’ అని భాస్కర్ తెలిపారు.
పిల్లలు చెప్పినప్పటికి కూడా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ఎలా అంగీకరించావని చాలా మంది ప్రశ్నించారని సెల్వి చెప్పారు. విడాకులు తీసుకున్న వారు రెండో పెళ్లి చేసుకునేందుకు చట్టాలు అంగీకరిస్తున్నప్పుడు, తానెందుకు భయపడాలి అని ప్రశ్నించినట్లు చెప్పారు.
పిల్లలకు భారం కాకుండా చివరి రోజుల్లో తన కోసం ఒక జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
‘‘పెళ్లి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఒక స్నేహితుడిలా మీ వెంట ఒకళ్లు ఉండేవాళ్లు. వారిచ్చే సపోర్టు మీకు మరింత ధైర్యాన్ని అందించాలి’’ అని సెల్వి చెప్పారు.
మీ ఫీలింగ్స్‌ను దాచిపెట్టొద్దు
‘‘నా పిల్లల తండ్రిని కోల్పోయినప్పుడు, భర్త లేకుండా ఒంటరిగా బతుకుతుండటంతో చాలా మంది నా వద్దకు తప్పుడు ఉద్దేశంతోనే వచ్చారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరూ కూడా నా ముందుకు రాలేదు. నా భర్త చనిపోయినప్పుడు కనీసం మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా లేదు. రాత్రి పూట బయటికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. ఈ సమయంలో ఎక్కడికి పోతున్నావంటూ వారు ప్రశ్నించే వారు’’ అని సెల్వి అప్పటి రోజులను గుర్తుకు చేసుకుంటూ బాధపడ్డారు.
భర్త లేకుండా ఒంటరిగా బతుకుతుండటంతో చాలా మంది తనతో లైంగిక సంబంధం పెట్టుకునేలా మాట్లాడేవారని అన్నారు.
‘‘ఈ విషయాన్ని మీ భార్యకు లేదా భర్తకు చెప్పాలా? అని నేను ప్రశ్నించే దాన్ని. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లి పోయే వారు’’ అని తెలిపారు.
భర్తలను కోల్పోయి, ఒంటరిగా బతుకుతున్న చాలా మంది యువతలతో తాను మాట్లాడుతున్నానని, వారికి కూడా ఒక ఆశను అందిస్తున్నట్లు చెప్పారు.
‘‘నా లాగా భర్తలను కోల్పోయిన వారు తప్పనిసరిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మరో జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా అనుభవంతో చెబుతున్నా, చాలా మంది మహిళలు వారి ఫీలింగ్స్‌ను దాచిపెట్టేస్తూ, భయంతో బతుకుతుంటారు’’ అని సెల్వి చెప్పారు.
అలా జీవించడం చాలా కష్టమని, అలా బతకాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.
వారి జీవితాలకు కూడా ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని, తమ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పొందాలని ఆశించారు.
‘‘ఇలాంటి సమస్యలు కేవలం మహిళలే ఎందుకు ఎదుర్కోవాలి? మహిళలనే దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడనని నేను కొన్నిసార్లు ఆలోచించేదాన్ని. కానీ, ఆ తర్వాత అర్థమైంది, దేవుడు కాదు చుట్టూ ఉన్న సమాజం ఈ సమస్యను క్రియేట్ చేసింది. దేవుడు వారిని సృష్టించాడు’’ అని సెల్వి అన్నారు.
సెల్వి పునఃవివాహానికి ఆమె కుటుంబానికి చెందిన ఎవరూ హాజరుకాలేదు. ఆమె పెళ్లి చేసుకున్న వరుడు తరఫు వాళ్లు కొందరు ఈ పెళ్లికి వచ్చారు.
ఎంత మంది పిల్లలు తన తల్లి కోసం ఇలా ఆలోచిస్తారు?
‘‘భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక నా మామకి, అత్తకి, తల్లికి ఫోన్ చేశాను. కానీ, ఎవరూ ముందుకు వచ్చి సాయమందించలేదు. చేసేదేం లేక ఒంటరిగానే పిల్లల్ని పెంచాను. ఆ సమయంలో, నా కొడుకులు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేశారు. ఆ పరిస్థితులను అర్థం చేసుకున్నారు’’ అని సెల్వి తెలిపారు.
ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ పెరిగిన తన కొడుకులు, సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
సెల్వి ప్రస్తుతం యేలుమలై అనే ఒక రైతు కూలీని పెళ్లి చేసుకున్నారు. ‘‘ఎంత మంది కొడుకులు తల్లికి కూడా పెళ్లి అవసరం అని ఆలోచిస్తారు. ఆమెకి కూడా భాగస్వామి అవసరం అనుకుంటారు. నేను నా కొడుకుల గురించి ఆలోచించినప్పుడు, చాలా గర్వంగా భావిస్తాను’’ అని ఎంతో సంతోషంతో సెల్వి అన్నారు.
ఇవి కూడా చదవండి
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)