తమిళనాడు: తండ్రి సమాధి వెతుకుతూ మలేసియా వరకు సాగిన భారతీయుడి ప్రయాణం

    • రచయిత, ప్రభురావు ఆనందన్
    • హోదా, తమిళనాడు జర్నలిస్టు

తనకు 6 నెలలున్నప్పుడు చనిపోయిన తండ్రి సమాధి మైళ్ల దూరంలోని మరో దేశంలో ఉందని తెలుసుకున్న ఒక భారతీయుడు, తన తండ్రి సమాధిని చూసేందుకు అక్కడికి వెళ్లారు.

చిన్నప్పుడు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తిరుమారన్‌ను అడిగితే మాత్రం చెప్పేందుకు తన దగ్గర ఏ జ్ఞాపకాలు లేవు.

ఎందుకంటే, ఆయన ఎలా ఉండేవారో కూడా తిరుమారన్‌కి తెలియదు. తిరుమారన్ తండ్రి పేరు కె.రామసుందరం. ఆయన మలేసియాలో స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు.

1967లో న్యూమోనియాతో ఆయన చనిపోయారు. అప్పటికి తిరుమారన్ పుట్టి కేవలం ఆరు నెలలు మాత్రమే. అదే ఏడాది తిరుమారన్, ఆయన తల్లి ఇద్దరూ భారత్‌లోని తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డారు. 1987లో తిరుమారన్‌కి 22 ఏళ్ల వయసున్నప్పుడు, ఆయన తల్లి కూడా మరణించారు. తన భర్త ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని, మంచి గాయకుడని ఎన్నో సార్లు ఆమె తన కొడుకుకి చెప్పారు.

తన భర్త తన కోసం రాసిన ఉత్తరాలను సైతం చూపించింది. ఆమె చనిపోవడానికి ముందు, తన భర్త గురించి అత్యంత కీలకమైన వివరాలను కూడా తన కొడుకుతో పంచుకున్నారు.

భర్త సమాధి మలేసియాలోని కెర్లింగ్ పట్టణంలో ఉందని, అక్కడే ఆయన నివసిస్తూ చనిపోయారని చెప్పింది.

తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు తిరుమారన్ నవంబర్‌లో తన తండ్రి సమాధి వెతికేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

తిరుమారన్ వయసు ప్రస్తుతం 55 ఏళ్లు.

తమిళనాడులోని తిరునల్వేల్లి జిల్లాలో వెట్టిచాకిరి నుంచి పిల్లల్ని రక్షించి వారి కోసం ఒక పాఠశాలను నడుపుతున్నారు.

‘‘నా తండ్రి సమాధి దగ్గరికి ఒక్కసారైనా వెళ్లాలని నేను అనుకునే వాణ్ని. కానీ, ఇప్పటి వరకు ఎప్పుడూ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు.’’ అని తిరుమారన్ చెప్పారు.

గూగుల్ సెర్చ్‌తో ప్రారంభించాను..

తన తండ్రి స్కూల్‌ను కనుగొనేందుకు ఎంతో ప్రయత్నించానని తిరుమారన్ చెప్పారు.

అయితే, తన తండ్రి స్కూల్ పేరు తప్ప, పెద్దగా ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి తనకేమీ వివరాలు తెలియదని అన్నారు.

కెర్లింగ్‌లో తమిళ కమ్యూనిటీ నడిపే చిన్న స్కూల్ తోటా తేసియా వకాయ్ తమిళ్ పల్లిలో ఇంగ్లీష్‌ను తన తండ్రి రామసుందరం బోధించే వారు.

ఈ స్కూల్ పేరుతో గూగుల్‌లో సెర్చ్ చేయాలని తిరుమారన్ తన విద్యార్థులను కోరారు.

‘‘నాకు పెద్దగా కంప్యూటర్లను ఆపరేట్ చేయడం తెలియదు. అందుకు, నా విద్యార్థులే నా తండ్రి స్కూల్‌ని గూగుల్‌లో వెతికారు. ఆ స్కూల్ ఫోటోను నాకు చూపించారు. ఆ సమయంలో నేనెంతో ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని తిరుమారన్ చెప్పారు.

అదేవిధంగా ఆ స్కూల్‌ మరో ప్రాంతానికి తరలించారని కూడా తిరుమారన్ తెలుసుకున్నారు. సాయం కోసం ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి తిరుమారన్ మెయిల్ పంపారు.

స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, తిరుమారన్‌కు తన తండ్రి పూర్వ విద్యార్థుల కాంటాక్టు వివరాలు తెలిశాయి. చాలా మంది ఇప్పటికీ మలేషియాలోనే ఉన్నారు.

వారిని కాంటాక్ట్ అయ్యేందుకు తిరుమారన్ ప్రయత్నించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి, తిరుమారన్‌కి చాలా మంది విద్యార్థుల నుంచి స్పందన వచ్చింది. తన తండ్రి సమాధి వెతికేందుకు తాము సాయం చేస్తామని చెప్పారు.

తన తండ్రి పూర్వ విద్యార్థులు స్పందించిన తీరు చూసి నిజంగా తానెంతో ఆశ్చర్యానికి గురైనట్టు తిరుమారన్ చెప్పారు. వారు ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్నారు. వారు తన తండ్రి గురించి ఎంతో మాట్లాడారని తెలిపారు.

స్కూల్‌కి, కాలేజీకి వెళ్లేందుకు తన తండ్రి సైకిల్ కొనిచ్చిన విషయాన్ని కూడా ఒక విద్యార్థి తనకు తెలిపారని తిరుమారన్ చెప్పారు. మరో విద్యార్థి తాను మరింత ప్రతిభావంతంగా చదివేందుకు తన తండ్రి చేసిన సాయాన్ని గుర్తుకు చేసుకున్నారని అన్నారు.

‘‘ఇవన్ని నేను విన్న తర్వాత, నేను నా జీవితంలో ఏం కోల్పోయానో తెలుసుకున్నాను’’ అని తిరుమారన్ అన్నారు.

పొదల దగ్గర సమాధి

మలేషియాలో తన తండ్రి పూర్వ విద్యార్థులలో కొందరు సమాధి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత తనకు తెలియజేసినట్టు తిరుమారన్ చెప్పారు.

నవంబర్ 8న తిరుమారన్ తన తండ్రి సమాధిని చూసేందుకు మలేషియా వెళ్లారు. అప్పుడే సూర్యోదయమవుతున్న సమయంలో, కెర్లింగ్‌లోని ఒక పురాతన శ్మశాన వాటికలో తిరుమారన్ అడుగు పెట్టారు.

ఆ శ్మశాన వాటికంతా పూర్తిగా చెట్లతో కమ్ముకుపోయింది.

సమాధులను దాటుకుని వెళ్లిన తర్వాత, పొదల దగ్గరున్న ఒక సమాధి వద్దకు తిరుమారన్ చేరుకున్నారు. అదే ఆయన తండ్రి సమాధి.

‘‘ఆ సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. సమాధి కాస్త అరిగిపోయినట్టు కనిపించింది. కానీ, సమాధి రాయిపై నా తండ్రి ఫోటోతో పాటు పేరు, ఆయన పుట్టిన, మరణించిన తేదీలు రాసి ఉన్నాయి’’ అని తిరుమారన్ చెప్పారు. అప్పటి వరకు తాను కనీసం తన తండ్రి ఫోటోను చూడలేదని, కనీసం ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదని అన్నారు.

తిరుమారన్ తల్లి భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో, తన తండ్రి సమాధి నుంచి చేతిలో పట్టేంత మట్టిని మాత్రమే తీసుకుని వచ్చిందని, ఆ మట్టిని ప్రస్తుతం తన తల్లి సమాధి వద్ద ఉంచినట్టు తిరుమారన్ చెప్పారు.

ఈ సారి తాను తన తల్లి సమాధి వద్ద నుంచి కొంత మట్టిని తీసుకొచ్చానని, దాన్ని తన తండ్రి సమాధి వద్ద ఉంచినట్టు తెలిపిన తిరుమారన్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా చేయడం ద్వారా మరణం తర్వాత కూడా వారు ప్రేమను పంచుకుంటారని అన్నారు.

తన తండ్రి సమాధిని సందర్శించిన తిరుమారన్, ఆ తర్వాత తన తండ్రి పూర్వ విద్యార్థుల సాయంతో సమాధిని శుభ్రపరిచి, కొవ్వొత్తులు వెలిగించి, ప్రార్థనలు నిర్వహించారు.

నవంబర్ 16న ఆయన భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యేంత వరకు ఎన్నోసార్లు ప్రార్థనలు చేశారు. తాను ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా తన ప్రయాణం సాగిందని, ఎన్నో మరచిపోని జ్ఞాపకాలను, అనుభూతులను మిగిల్చిందని చెప్పారు. వాటిలో తన తండ్రి ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.

‘‘నేను అచ్చం నా తండ్రిలాగానే ఉన్నానని ఆయన విద్యార్థులు చెప్పారు. తండ్రి లేకుండా పెరిగిన ఒక అబ్బాయికి ఇదే పూర్తి తరహా జీవితం’’అని తిరుమారన్ అన్నారు.

తిరుమారన్ జీవిత కథనం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆకట్టుకుంది. తిరుమారన్ జర్నీని ఆయన కూడా ట్వీట్ చేశారు.

‘‘మనిషి ఎన్నో ఎమోషన్లను కలిగిన వ్యక్తి. తండ్రి సమాధి కోసం తిరుమారన్ వెతుకులాట, ఆయన జీవితం కోసం వెతికిన మాదిరిగా అనిపించింది’’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)