You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మళ్లీ వరదలు వస్తే ఈ నగరం తట్టుకోగలదా?
- రచయిత, కే శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడేళ్ల క్రితం చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. రాను రాను వీటిని అంచనా వేయడం కష్టమైపోతోంది.
వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి చెన్నై నగరం సన్నద్ధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
చెన్నైలో నవంబర్‌లో పాఠశాలలు, కాలేజీలు మూసివేయడం ఇది రెండోసారి. గత శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు నగరం స్తంభించిపోయింది.
1.2 కోట్ల జనాభా ఉన్న నగరంలో వీధులు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు నడుచుకుంటూ వెళ్లడం కొన్ని వీడియోలలో కనిపిస్తోంది.
రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
చెన్నైలో నవంబర్ 1న భారీ వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లల్లో ఇంత పెద్ద వర్షం కురవలేదని చెబుతున్నారు. పది రోజుల తరువాత వరదలు ముంచెత్తుతున్నాయి.
వర్షాల కారణంగా అక్టోబర్ 31 నుంచి కనీసం 26 మంది చనిపోయారు. ఈ ప్రాంతంలో వర్షాలు తరచుగా కురవడమే కాక, అనూహ్యంగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల, అధికార యంత్రాంగం వేగంగా స్పందించడం కష్టమవుతోందని చెబుతున్నారు.
"రుతుపవనాలు ప్రారంభమైన 24 గంటల్లోనే 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ఎవరూ ఊహించలేదు" అని డాక్టర్ ఎస్.జనకరాజన్ అన్నారు. ఆయన సౌత్ ఏషియా కన్సార్టియం ఫర్ ఇంటర్ డిసిప్లినరీ వాటర్ రిసోర్సెస్ స్టడీస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
"ఇది పూర్తిగా అనూహ్యం. ఉదయం నుంచి సాయంత్రానికి వాతావరణ హెచ్చరికలు మారిపోయాయి" అని ఆయన అన్నారు.
నీరు నిలిచిపోయిన ప్రాంతాలలో మోటార్ పంపులు తెప్పించి నీటిని తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించారు.
కానీ, సముద్రమట్టం పెరగడం, వడగాడ్పులు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఈ నగరం మరిన్ని సన్నాహాలు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. 2015లో వచ్చినట్టు బీభత్సమైన వరదలు మళ్లీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
"వర్షాకాలం ప్రారంభంలోనే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరిందంటే ఈ నగరం వానలకు ఏ మాత్రం సిద్ధం కాలేదని అర్థమవుతోంది" అని ఎస్ఏ హరీస్ సుల్తాన్ అన్నారు. చెన్నైలోని అవినీతి నిరోధక నిఘా సంస్థ అరప్పోర్ ఇయక్కం సభ్యుడుగా ఉన్నారు హరీస్.
దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన చెన్నై పారిశ్రామిక ఉత్పత్తులకు, ఆటోమొబైల్ తయారీ రంగానికి కేంద్రంగా ఉంది.
దేశంలో అధిక ప్రాంతాలు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. అంటే జూన్‌లో వర్షాకాలం ప్రారంభమవుతుంది.
కానీ, చెన్నైకి అలా కాదు. అక్కడ అక్టోబర్, నవంబర్ నెలలలో వర్షాకాలం వస్తుంది. వేసవిలో నీటి అవసరాలకు వర్షాలే ఆధారం.
2019లో ఈ నగరం తీవ్రమైన కరువును ఎదుర్కొంది. సంక్షోభాన్ని తగ్గించడానికి ఇతర జిల్లాల నుంచి రోజుకు ఒక కోటి లీటర్ల నీటిని తీసుకురావలసి వచ్చింది.
భౌగోళికంగా చెన్నై లోతట్టు ప్రాంతంలో ఉంది. ఈ నగరంలో చాలా ప్రాంతాలు సముద్ర మట్టానికి కేవలం రెండు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
ప్రపంచంలో 2050 నాటికి భారీ వరద నష్టాన్ని ఎదుర్కోబోయే 20 తీరప్రాంత నగరాల్లో చెన్నై ఒకటని ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదికలో పేర్కొంది.
దక్షిణాసియాలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నందున, చెన్నై నగరం "రెట్టింపు వేడి, ఉక్కపోత, తుఫానులను" ఎదుర్కొంటుందని నివేదిక ప్రధాన పరిశోధకుడు తెలిపారు.
ఈ సంవత్సరం వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సన్నాహాల్లో భాగంగా వరద నీటిని బయటకు పంపించే కాలువల ఏర్పాటుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమైంది. వీధుల్లో నిండిన వరద నీటిని ఈ కాలువలు సముద్రానికి చేరుస్తాయి.
కానీ, వానలు మొదలైన మూడు రోజులకే నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది. జనజీవనం స్థంభించిపోయింది
రుతుపవనాలు అనూహ్యంగ అమారడంతో, పరిస్థితిని అదుపు చేయడంలో నగరం తడబడిందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ అన్నారు.
"ఇప్పుడు తక్కువ సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటిని అంచన అవేయడం కష్టంగా ఉంది. అంచనా సంగతి పక్కన పెట్టినా, పర్యవేక్షణ కూడా సవాలుగా మారింది" అని ఆయన అన్నారు.
నగరంలో ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భజలాల నిర్మాణాలు వరద నీరు నిల్చిపోకుండా ఆపడానికి, వర్షపు నీటిని నిల్వ చేయడానికి సరిపోవని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"కాంక్రీట్ నిర్మాణాలు నగరమంతా ఆక్రమించుకున్నాయి" అని అన్నా యూనివర్సిటీలో జియాలజీ ప్రొఫెసర్ ఎల్ ఎలంగో అన్నారు.
గత దశాబ్ద కాలంలో చెన్నై నగరంలో భారీ స్థాయి నిర్మాణాలు, వేగవంతమైన పారిశ్రామికీకరణ చోటుచేసుకుంది. వీటిలో చాలావరకు నీటి పారుదలకు సరైన ప్రణాళిక లేకుండా, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయకుండా కట్టినవే.
నగరంలో 8 శాతం కంటే ఎక్కువ భూమి నిర్మాణంలో ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం డేటా చెబుతోంది.
పెద్ద పెద్ద నీటి కాలువలు, భూగర్భ జలాలను నిల్వ చేసే నిర్మాణాలు ఏమంత ప్రయోజనం చేకుర్చవని, నగరంలో పెరుగుతున్న కాంక్రీటు నిర్మాణాలు నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుకుంటున్నాయని ప్రొఫెసర్ ఎలంగో అన్నారు.
"దీనికి బదులు భవనాలు, వీధుల డ్రైనేజీ వ్యవస్థలను రిజర్వాయర్‌లకు అనుసంధానించేందుకు నగర యంత్రాంగం ప్రయత్నించాలని" ఆయన అన్నారు.
వర్షాల తరచుదనం పెరగడం వల్ల, వాతావరణ సమాచారం అందించే ఏజెన్సీలకు, విపత్తు నిర్వహణ సిబ్బందికి స్పందించేందుకు తక్కువ సమయం ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
"బలహీనమైన తుపాను నుంచి అత్యంత తీవ్రమైన తుపానుగా అభివృద్ధి చెందడానికి రెండు నుంచి నాలుగు రోజులు పడుతుంది. కానీ, ఇప్పుడు ఈ వ్యవధి తగ్గిపోతోంది" అని మాథ్యూ కోల్ అన్నారు.
అందుకే ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను అనుసరించాలని. ఎక్కువ బహిరంగ ప్రదేశాలు ఉండేటట్టు, నీరు భూమి లోపలకి ఇంకేట్టు జాగ్రత్తలు తీసుకుంటూ నగరాల పునఃనిర్మాణం జరగాలి" ఆయన అన్నారు.
ప్రొఫెసర్ జనకరాజన్ కూడా ఇందుకు అంగీకరిస్తున్నారు. వర్షపు నీటిని సేకరించి, భూగర్భంలో నిల్వ చేయడానికి వీలుగా భవనాలు, ఇళ్ల మిద్దెలపై మరిన్ని నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు.
"ఇది జరిగితే, చెన్నై తుపాను, కరువు రెండింటినీ ఎదుర్కునే సామర్థ్యాన్ని పొందుతుంది" అని ప్రొఫెసర్ జనకరాజన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సమంత: 'నేను చనిపోతానని కూడా రాసేశారు' అని కంటతడి పెట్టిన నటి
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ‘రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’’