You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
బ్రేక్‌ఫాస్ట్‌ను రాజులాగా, లంచ్‌ను యువరాజులాగా, డిన్నర్‌ను పేదవాడిలాగా తినాలని ఇంగ్లిష్ నానుడి ఉంది. అయితే, బ్రిటీష్ వాళ్లే కాదు, చాలామంది డిన్నర్‌ను గట్టిగానే లాగిస్తుంటారు.
కానీ, ఇటీవలి పరిశోధనల ప్రకారం రోజు ప్రారంభంలోనే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. దీనిల్ల బరువు పెరగకపోవడమే కాక, రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరీకరణ, అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువసేపు ఉండకుండా అదుపు చేసే అవకాశం ఉంటుందట.
న్యూయార్క్ యూనివర్సిటీలో పరిశోధకులు దీనిపై ఒక ప్రయోగం చేశారు. ప్రీ డయాబెటిస్, ఇంకా ఊబకాయం సమస్య ఉన్న 10 మంది వ్యక్తులను రీసెర్చర్లు 2 గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రోజులో తొలి 8 గంటలలోనే కేలరీలు తీసుకునేలా, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండేలా చూశారు.
రెండో గ్రూపులోని సభ్యులు వారంపాటు తాము రోజులో తీసుకునే కేలరీలలో 50 శాతాన్ని సాయంత్రం 4 తర్వాత తినేలా చూశారు.
ఫలితాలలో మొదటి గ్రూపు సభ్యుల జీర్ణక్రియ చక్కగా ఉండటం, డయాబెటిస్‌లో తగ్గుదలను గమనించారు. మరి మీరు మీ ఫాస్టింగ్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?
ఉపవాసం అంటే ఏమిటి?
‘‘ఫాస్టింగ్(ఉపవాసం) అంటే ఒక నిర్ధిష్ట కాలానికి శరీరంలోకి ఎలాంటి ఆహారం లేదా నీళ్లు తీసుకోవడాన్ని మానేయడం" అని పోషకాహార నిపుణురాలు కెర్రీ టోరెన్స్ అన్నారు.
దీన్నే అప్పుడప్పుడు ఆహారం తీసుకోవడం, ఒక నిర్దేశిత టైమ్‌కు మాత్రమే ఆహారం తీసుకోవడం అని కూడా మీరు అనుకోవచ్చు.
ఇవి మీ శరీరాన్ని ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉంచే విధానాలుగా భావించొచ్చు.
ఉపవాసంతో ఉపయోగాలేంటి?
ఫాస్టింగ్ వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. అందులో ముఖ్యమైంది మీ శరీరంలో ఉన్న కొవ్వును ఉపయోగించుకునే అవకాశం కలగడం. అలాగే పొట్టలో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా సంఖ్యను పెంచుకునే అవకాశం కూడా ఒకటి. అదే విధంగా గుండె జబ్బులకు కారణమయ్యే బీపీ, కొలెస్ట్రాల్‌లను తగ్గించుకునే వీలు ఏర్పడుతుంది.
ఉపవాసం వల్ల శరీరానికి ముసలితనం రావడం కాస్త నెమ్మదిస్తుందని పరిశోధనలు తేల్చాయి. అలాగే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ పెరుగుదలకు కూడా అవకాశం కలుగుతుంది. ఈ హార్మోన్ కారణంగానే శరీరం తనను తాను బాగు చేసుకునే శక్తిని పొందుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధులు ఉన్న వారికి ఇది మరింత ఉపయోగం.
‘ఫాస్టింగ్’ అందరికీ సరిపడుతుందా?
ఈటింగ్ డిజార్డర్ నుంచి కోలుకుంటున్నవారు, గర్భిణులు, తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నవారు, పిల్లలకు పాలిచ్చేవారు ఈ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండటం మంచిదని కెర్రీ సూచించారు.
అలాగే 18 ఏళ్ల లోపు వయసున్నవాళ్లు, వృద్ధులు, డయాబెటీస్, బీపీ, కిడ్నీలో రాళ్లు, యాసిడ్ రీఫ్లక్స్ లాంటి సమస్యలు ఉన్నవారు, ఇప్పటికే మందులు వాడుతున్నవారు ఈ కొత్త ఆహారపు అలవాటును చేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని కెర్రీ అన్నారు.
సంతానాన్ని కనగలిగే వయసులో ఉన్న మహిళల్లో ఇలాంటి ఉపవాసాల వల్ల రుతుక్రమం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది.
ఇక ఉపవాస విధానాలలో కూడా అనేక రకాలుంటాయి. వీటిని రోజువారి లేదా వారాల వారీగా అనుసరిస్తూ వెళ్లొచ్చు.
5:2 డైట్ ప్లాన్
డాక్టర్ కమ్ జర్నలిస్ట్ అయిన మైఖేల్ మోస్లీ 2013లో ఈ డైట్ ప్లాన్‌ను సృష్టించారు. డైటింగ్ చేసేవాళ్లు ఈ ప్లాన్‌లో ఎప్పటిలాగానే తింటారు. కానీ, వరసగా కాకుండా వారంలో ఏవో ఒక 2 రోజులు 25 శాతం కేలరీలనే తీసుకుంటారు. (మహిళలైతే 500 కేలరీలు, పురుషులైతే 600 కేలరీలు).
ఈ విధానాన్ని అనుసరించడం వల్ల మహిళలు వారంలో సుమారు అరకేజీ, పురుషులు అంతకంటే కాస్త ఎక్కువ బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ ఫాస్టింగ్ దశలో తక్కువ కొవ్వు ఉండే మాంసం, కూరగాయల్లాంటి ప్రొటీన్ సాంద్రత ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది.
ఇలాంటి సమయాలలో కొందరు తాము నీరసపడిపోతున్నామని, తలనొప్పిగా ఉంటోందని, ఏకాగ్రత నిలపలేకపోతున్నామని చెప్పడం గమనించారు. అలాంటి వారు ఎక్కువ నీరు , హెర్బల్ టీ వంటివాటిని తీసుకోవడం మంచిది.
16:8 డైట్ ప్లాన్
ఇది న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అనుసరించిన విధానమే. ఇందులో తొలి 8 గంటల్లోనే ఆహారం తీసుకోవడం, మిగిలిన 16 గంటలకు ఉపవాసం ఉంటారు.
ఫాస్ట్ 800 డైట్ ప్లాన్
డాక్టర్ మైఖేల్ మోస్లే రూపొందించిన ఈ ఆహారపు విధానం, వేగంగా బరువు తగ్గడానికి రూపొందించింది. అయితే, బరువు తక్కువ సమస్యతో బాధపడేవారు, ఈటింగ్ డిజార్డర్ నుంచి కోలుకుంటున్నవారు, టైప్ 1 మధుమేహం ఉన్నవారు, గుండెజబ్బులు, ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నవారు, వ్యాయామాలు చేసేవారికి నిపుణులు దీన్ని సిఫారసు చేయరు.
ఈ విధానంలో మొదటి దశ 2 నుంచి 12 వారాలు ఉంటుంది. తొలి దశలో రోజుకు 800 కేలరీల ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో తక్కువ కొవ్వు ఉన్న ప్రొటీన్ ఆహారం, కూరగాయలులాంటివి ఉంటాయి. అవి శరీరాన్ని కొవ్వును కరిగించే కెటోసిస్ దశకు తీసుకెళతాయి.
రెండో దశలో, ఈ విధానాన్ని పాటించే వాళ్లు వారంలో 2 రోజులు 800 కేలరీల మాత్రమే తీసుకుంటారు. మిగిలిన అయిదు రోజులు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తీసుకుంటారు.
ఇక మూడో దశను మెయింటెనెన్స్ స్టేజ్ అని కూడా అనొచ్చు. ఈ దశలో కూడా లో-షుగర్ ఉన్న మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ ఫాస్టింగ్‌లో ఆకలి కారణంగా కలిగే బాధ, తలనొప్పి, మలబద్ధకంలాంటివి ఉంటాయి. రోజుకు మూడు లీటర్ల చొప్పున నీటిని తీసుకోవడం వల్ల అలసట తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)