You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఎలా వ్యాపిస్తుంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు ‘ఐ ఫ్లూ’తో ఇబ్బంది పడుతున్నారు.
‘ఐ ఫ్లూ’ను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్ అంటారు. వాడుక భాషలో కళ్ల కలకలు అంటుంటారు. ఐఫ్లూ సోకిన వారి కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి.
కళ్లు గులాబీ రంగులోకి మారడం వల్ల ‘పింక్ ఐ’ అని కూడా అంటారు.
కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో పుసి ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అసలు కళ్ల కలకలు ఎందుకు వస్తాయి?
ఇది ఒక రకమైన ఇన్‌ఫెక్షన్. ఒక్కోసారి జలుబుకు కారణమైన వైరస్ వల్ల కూడా కళ్ల కలకలు వస్తుంటాయి.
వైరస్, బ్యాక్టీరియా, అలర్జీల వల్ల కళ్ల కలకలు వస్తుంటాయని అమెరికాలోని ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’(సీడీసీ) చెప్తోంది.
ఒక్కోసారి కంట్లో ఏవైనా రసాయనాలు పడినా, గాలి కాలుష్యం వల్ల, ఫంగస్ వల్ల, కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా కలకలు వస్తాయని సీడీసీ చెప్తోంది.
ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?
బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
అలర్జీల కారణంగా వచ్చిందైతే వ్యాపించదు.
బ్యాక్టీరియా వల్ల వచ్చే ఐ ఫ్లూ లేదా వైరల్ ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అదే అలర్జిక్ ఫ్లూ అయితే అలా వ్యాపించదు.
ఐఫ్లూతో బాధపడుతున్నవారి కళ్లలోకి చూసినా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.. సాధారణంగా అలాంటి ప్రమాదం ఉండదు. బాగా దగ్గరగా వెళ్లినప్పుడు ఇతర రకాలుగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి ఎందుకు
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్ వ్యాపించే అవకాశం, మనగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలా వ్యాపిస్తుంది?
ఐఫ్లూతో బాధపడేవారు కళ్లలో మంట కారణంగా, నీళ్లు కారడం వల్ల కళ్లు తుడుచుకుని ఆ చేతులతో ఏవైనా వస్తువులను పట్టుకుంటే.. వాటిని మళ్లీ పట్టుకున్నవారికి వైరస్ వ్యాపిస్తుంది.
అలాగే, ఐ ఫ్లూ ఉన్నవారికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు, ముఖం ముఖం తాకినప్పుడు కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుంది.
ఐ ఫ్లూ ఉన్నవారు ఉపయోగించిన టవళ్లు, రుమాళ్లు ఇతరులు వాడినా వైరస్ వ్యాపిస్తుంది.
ఐ ఫ్లూ వచ్చిందని ఎలా గుర్తించాలి?
కళ్లు ఎరుపెక్కడం, నీరు కారడం, దురదగా ఉండటం, కంటి రెప్పలు అంటుకుపోవడం వంటివి కళ్లకలకలో ఉండే ప్రధాన లక్షణాలు.
ఈ లక్షణాలు కనిపిస్తే కళ్లకలకలు వచ్చాయని అర్థం. అయితే కొన్ని రకాల ఐ ఇన్‌ఫెక్షన్లలో కూడా కంటి రెప్పలు అంటుకుంటుంటాయి.
మరి కళ్లకలకలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
సాధారణంగా ఇవి రెండు వారాలలో వాటంతట అవే పూర్తిగా తగ్గిపోతాయి.
నీళ్లు కాచి, చల్లార్చి కాస్త దూదిని ఆ నీటిలో ముంచి కళ్లను వీలైనంత నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి.
చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి.
శభ్రమైన, ఉతికిన టవల్స్ లేదా కర్చీఫ్‌లు మాత్రమే వాడాలి.
కళ్లకలకలు చాలా త్వరగా వ్యాపిస్తాయి కనుక తగ్గేవరకు కళ్లజోడు పెట్టుకోండి.
కానీ కళ్లల్లో విపరీతమైన నొప్పి, దురద, బాగా ఎరుపెక్కి మంట ఎక్కువవుతుందంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి:
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)