మెదడుపై ఆకలి ఎలాంటి ప్రభావం చూపుతుంది, ప్రవర్తనను ఎలా మార్చేస్తుంది?

    • రచయిత, పాయల్ భుయన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆహారం, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందా? ఆలోచన విధానాన్ని మార్చుతుందా?

మన మానసిక ఆరోగ్యానికి, ఆహారానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే.

మనం తినే ఆహారానికి, మన అనుభూతికి మధ్య లోతైన సంబంధం ఉందని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

మంచి ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం. ప్రస్తుతం సెలబ్రిటీలు సొంత డైట్ ప్లాన్‌ను అనుసరిస్తున్నారు.

ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న డైట్ మార్కెట్ ప్రస్తుతం రూ. 20,78,830 కోట్ల (250 బిలియన్ డాలర్లు) పరిశ్రమగా మారినట్లు ఒక అంచనా.

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న 2 వేల మందిపై చేసిన ఒక అధ్యయనంలో, కాస్తయినా బరువును తగ్గించుకున్న 80 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లు తేలింది.

ఇలా ఎందుకు జరిగింది? డైట్ సమయంలో తీసుకున్న ఆహారమే దీనికి కారణమా?

మెదడుపై ఆకలి ప్రభావం

మన మెదడుపై ఆకలి ప్రభావం చూపుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు చాలా సార్లు కోపం కూడా వస్తుంది. తగినంత పోషకాలు, కేలరీలు అందకుంటే మన మెదడు సరిగ్గా పనిచేయడానికి కష్టపడుతుంది.

రోజువారీ జీవితంలో కొంత సమయం పాటు ఆకలితో ఉండటం వల్ల మన ఆలోచన విధానం, మానసిక స్థితి ప్రభావితం అవుతుందా?

కార్పొరేట్ ఉద్యోగి, మార్కెటింగ్ నిపుణుడు రవికాంత్ దీని గురించి బీబీతో మాట్లాడారు.

‘‘బాగా ఆకలి వేసినప్పుడు చాలా కోపం, చిరాకు వస్తాయి. నాకు ఆకలి ఎక్కువ. అందుకే నేను వ్రతాలు లాంటివి చేయలేను. ఆకలి వేసినప్పుడు నా మూడ్ పాడవుతుంది. రోజులో ఒక పూట తినకపోయినా నా చుట్టుపక్కల ఉన్న వారందరిపై కోప్పడటం మొదలు పెడతాను. ఆకలి వేసినప్పుడే కోపం కూడా వస్తుందని నేను పదో తరగతి చదువుతున్నప్పుడే గ్రహించాను’’ అని అన్నారు.

భావోద్వేగాలపై ఆహారం ప్రభావం

మన ఆలోచనలపై భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి రావడానికి కారణాలు తెలుసుకుంటే వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.

భావోద్వేగాలపై ఆహారం ప్రభావం గురించి మానసిక నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్ నిషా ఖన్నా బీబీసీతో మాట్లాడారు. "మానవులకు మూడు ప్రాథమిక అవసరాలు ఉంటాయి. అవి తిండి, నిద్ర, శారీరక అవసరాలు. ఈ మూడింటిలో ఏదైనా నెరవేరకపోతే అది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మనం ఎన్ని గంటలు ఆకలితో ఉంటామో దాని ప్రభావం నేరుగా మెదడుపై పడుతుంది. అల్పాహారం చాలా ముఖ్యమైనదని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం పూట అవసరమైన శక్తిని అల్పాహారం అందిస్తుంది. మన నిర్ణయాధికారం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యాన్ని ఆహారం ప్రభావితం చేస్తుంది’’ అని నిషా ఖన్నా చెప్పారు.

మానసిక స్థితిపై ఆహారం ప్రభావం ఏంటి?

చెడు మానసిక స్థితి మనల్ని నిరాశవాదులను చేస్తుందని 2022నాటి ఒక అధ్యయనం సూచిస్తుంది. నిరాశావాదం కారణంగా మన ఆలోచనలు మరింత ప్రతికూలంగా మారతాయి. మానసిక స్థితి చెడ్డగా ఉన్నప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మరి తిన్న ఆహారానికి, మానసిక స్థితికి సంబంధం ఏంటి?

ఆహారం జీవరసాయన శాస్త్రం

ముంబైలో నివసించే 35 ఏళ్ల శిల్పా ఒక గృహిణి. ఆమె ప్రీ-డయాబెటిక్. కానీ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడం, మూడ్‌ను బాగు చేసుకోవడం కోసం ఐస్‌క్రీమ్‌తో పాటు డార్క్ చాక్లెట్ తింటారు.

శిల్పా మాట్లాడుతూ, ‘‘ఐస్‌క్రీం లేదా డార్క్ చాక్లెట్ తిన్న వెంటనే నేను అకస్మాత్తుగా చాలా సంతోషంగా మారిపోతాను. పీరియడ్స్ ప్రారంభ రోజుల్లో నాకు చాలా నొప్పిగా ఉంటుంది. ఐస్‌క్రీం, డార్క్ చాక్లెట్‌లు నొప్పిని మర్చిపోయేందుకు సహాయపడతాయి. ప్రీ-డయాబెటిక్ అయినప్పటికీ ఐస్‌క్రీమ్, డార్క్ చాక్లెట్లను నేను వదల్లేను. అవి తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ వెళ్తాను’’ అని చెప్పారు.

ఆహారానికి మన మానసిక స్థితికి మధ్య గల సంబంధాన్ని బీబీసీతో ప్రముఖ డైటీషియన్, వన్ హెల్త్ కంపెనీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శిఖా శర్మ చెప్పారు.

ఆహారం మన హార్మోన్లను ప్రేరేపిస్తుందని శిఖా శర్మ అన్నారు.

‘‘ఆహారం ఒక జీవ రసాయన శాస్త్రం. ఇది మన హార్మోన్లను ప్రేరేపిస్తుంది. చాలా మంది సంతోషంగా, కోపంగా, విచారంగా, టెన్షన్‌లో ఉన్నప్పుడు తమకు నచ్చిన ఆహారాన్ని తింటూనే ఉంటారు. చక్కెర, చీజ్, ఆల్కహాల్, పుట్టగొడుగులు, పాలు వంటి ఆహార పదార్థాలు హార్మోన్లను ప్రేరేపిస్తాయి’’ అని ఆమె చెప్పారు.

జంక్ ఫుడ్, ఒత్తిడిలో తినడం

డైటీషియన్ డాక్టర్ శిఖా శర్మ ప్రకారం మెదడులో కోపం, ఆకలి కేంద్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అందుకే ఒకటి ప్రభావితమైనప్పుడు, వెంటనే మరొకటి కూడా చురుగ్గా మారుతుంది.

బ్యాంకింగ్ ప్రొఫెషనల్, దిల్లీలో నివసించే ప్రియాంక బీబీసీతో మాట్లాడుతూ తాను 'స్ట్రెస్ ఈటింగ్'లో మునిగిపోతానని చెప్పారు.

‘‘ఒత్తిడికి గురైనప్పుడు దాన్నుంచి బయటపడటానికి నాకు ఆహారం సహాయపడుతుంది. ఆఫీసులో పని ఎక్కువైనప్పుడల్లా నేను జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నట్లు గ్రహించాను. జంక్ వల్ల నా బరువు బాగా పెరుగుతోంది. బరువు వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది’’ అని ఆమె వివరించారు.

మనస్సు, శరీరాన్ని కలిపి ఉంచగలిగేది ఆహారం అని మానసిక నిపుణురాలు అరుణ బ్రూటా చెప్పారు.

‘‘ఎక్కువసేపు ఆహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు సృజనాత్మకంగా ఆలోచించలేరు. కోపం, టెన్షన్ పెరిగిపోతుంది. సహనం కూడా అంతం అవుతుంది. శరీరంలో సోడియం సమతుల్యత కూడా అవసరం. శరీరంలో ఎక్కువ సోడియం ఉన్న వ్యక్తులకు అధిక బీపీ ఉండటంతో పాటు త్వరగా కోపం వస్తుంది. లో షుగర్ ఉన్నవారు కూడా తొందరగా కోపం తెచ్చుకుంటారు’’ అని ఆమె వివరించారు.

డాక్టర్ శిఖా శర్మ మాట్లాడుతూ, “ఆకలితో ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. చేసే పనిపై దృష్టి సారించలేరు. త్వరగా పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆకలి, గ్యాస్, ఎసిడిటీ లేదా మద్యం మత్తులో ఉన్నప్పుడు అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది’’ అని శిఖా శర్మ చెప్పారు.

ఆహారం, ఆరోగ్యంలో లయను ఎలా కాపాడుకోవాలి?

న్యూట్రీషనిస్ట్, డైటీషియన్ డాక్టర్ శిఖా శర్మ కొన్ని సలహాలు ఇచ్చారు.

పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

శరీరం సిర్కాడియన్ రిథమ్‌ను గుర్తించి దాని ప్రకారం తినండి.

రెండు భోజనాల మధ్య ఎక్కువగా విరామం ఇవ్వవద్దు.

తగినంత నీరు త్రాగాలి

సీజన్, వయస్సు ప్రకారం ఆహారం తినండి.

దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)