You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజా: 'మురికి నీళ్లు తాగుతున్నా, నాకు వేరే ఆప్షన్ లేదు'
వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకెళ్లేందుకు గాజా నగరానికి చెందిన మహమూద్ అబ్దుల్ హకీం వేచి చూస్తున్నారు. ఆయన చాలా అలసిపోయి ఉన్నారు. కానీ, తన తల్లిదండ్రులు, భార్యాపిల్లల కోసం అక్కడ ఉన్నారు.
ముప్పై రెండేళ్ల మహమూద్ అందరితో క్యూలో నిల్చుని ఉన్నారు. వాళ్లంతా తమ వద్ద ఉన్న చిన్నా, పెద్ద వాటర్ బాటిళ్లు నింపుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ నీళ్లు సురక్షితమైనవి కావు. అయినా వారికి మరో అవకాశం లేదు. అక్కడ ఆ నీళ్లే దొరుకుతున్నాయి.
అవి చాలా ఉప్పగా ఉన్నాయని, సముద్రపు నీళ్లలా ఉన్నాయని మహమూద్ చెప్పారు.
'' నేను మురికి నీళ్లు తాగుతున్నా, ఎందుకంటే నాకు మరో అవకాశం లేదు. 50 ఇజ్రాయెలీ షెకెల్స్ (సుమారు రూ.1040 )తో ఒక బ్యారెట్ నీటిని కొనుక్కుంటున్నాం.
గతంలో మరీ ఇబ్బందిగా ఉంటే 20 షెకెల్స్ ( సుమారు రూ. 416) పెట్టి కొనుక్కునేవాళ్లం'' అని ఆయన చెప్పారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో సుమారు 1400 మందికిపైగా చనిపోయారు. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ నీటి సరఫరా, విద్యుత్ సరఫరాను నిలిపేసింది. దీంతో గాజా ప్రాంతం సంక్షోభంలో చిక్కుకుంది.
ఫలితంగా మురికి నీళ్లను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
''నేను అదృష్టవంతుడినే. ఒక బ్యారెల్ నీళ్లు సంపాదించగలిగాను. అవి మాకు మూడు రోజులు సరిపోతాయి. వాటిని నా కుుటంబ సభ్యులతో పాటు, మరో 35 మంది నిరాశ్రయులైన పాలస్తీనియన్లతో కలిసి వాడుకుంటాం.''
ప్రత్యక్ష పోరుకి దిగడంతో పాటు భారీ వైమానిక దాడుల నేపథ్యంలో గాజా నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించినప్పటికీ మహమూద్ కుటుంబం మాత్రమే అక్కడే ఉండాలని అనుకుంటోంది.
మీరు దక్షిణ ప్రాంతం వైపు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించినప్పుడు అక్కడున్న వారి నుంచి ఒకే భావన వ్యక్తమవుతోంది. 'మేం ఎక్కడికెళ్లాలి. అక్కడికెళ్లి మేం ఏం తినాలి?' అంటున్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ గాజా ప్రాంతంలో 3,500 మంది చనిపోయారని, మరో 12,500 మందికి పైగా గాయాలపాలయ్యారని పాలస్తీనియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
''ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బాంబులు వేస్తామని ఇజ్రాయెల్ ఇప్పుడు హెచ్చరిస్తోంది'' అని మహమూద్ అన్నారు. ఇప్పుడేం చేయాలోనన్న భావోద్వేగం ఆయనలో కనిపించింది.
మహమూద్ కొనుగోలు చేసిన 500 లీటర్ల నీళ్లు 38 మందితో కలిసి వాడుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిని కుండలు, పాత్రల్లో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
ఆయన తన ఇంట్లో వంటగదిలో ఉన్న కుళాయిలను చూపించారు. వాటి నుంచి చుక్క నీరు కూడా రావడం లేదు. నిర్దిష్ట సమయం ప్రకారమే ఆయన కుటుంబం నీళ్లు తాగేలా ప్రణాళిక వేసుకుంది. కొంత నీటిని అవసరాలకు వాడుకోగా, వంట చేసుకునేందుకు కొద్దిగానే మిగులుతున్నాయి.
పాలస్తీనియన్లు బావుల నుంచి నీటిని తోడి ట్యాంకర్లకు నింపుతున్నారని, వాటిని చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని గాజా ప్రాంతవాసులు చెబుతున్నారు.
చిన్నపిల్లలున్న కుటుంబాలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
''పిల్లల ఆకలి తీర్చేందుకు పాప్‌కార్న్ చేయాల్సి వస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం మా దగ్గర అదే మిగిలింది'' అని నహేద్ అబు హర్బీద్ చెప్పారు. ఆమె పశ్చిమ గాజాకి సమీపంలోని తల్-అల్-హవాలో తన సోదరి, ఏడుగురు మేనల్లుళ్లు, మేనకోడళ్లతో కలిసి ఉంటున్నారు.
ఇజ్రాయెల్ విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటి నుంచి ఇంట్లో చీకటి అలముకొంది.
ప్రస్తుతం మా దగ్గర మిగిలి ఉన్న నీళ్లు ఇవేనంటూ ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న నీటిని చూపించారు నహేద్. నీళ్లు మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియదు.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు చేస్తోంది.
''తాగడానికి నీళ్లు లేక చనిపోయే పరిస్థితి వస్తోంది'' అని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యూఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇళ్లు ధ్వంసం కావడం, మురికి నీళ్లు తాగి బతకాల్సి రావడంతో అక్కడి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గాజా ప్రాంతంలో బాగా కలుషితమైన నీటినే తాగాల్సి వస్తోందని, అవి తీవ్రమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
కలుషిత నీటిని తాగడం వల్ల ఒక్క వారంలోనే చిన్నారుల్లో డయేరియా కేసులు పెరిగాయని గాజా ఆరోగ్య శాఖలో ప్రాథమిక వైద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ రమి అల్-అబద్లా చెప్పారు.
ఆశ్రయం కోల్పోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత లోపించి చికెన్‌పాక్స్ వంటి చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు.
గాజా స్ట్రిప్‌లోని దక్షిణ ప్రాంతానికి నీటి సరఫరాను పునఃప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించింది.
‘నీళ్లు ఏమాత్రం సరిపోవు’
ఖాన్ యూనిస్ పట్టణానికి తూర్పున ఉన్న బినెయ్ సాహిలా శరణార్థి శిబిరానికి సమీపంలో ఉన్న వాటర్ పాయింట్‌ను ఇజ్రాయెల్ తెరిచింది. అయితే, ఇప్పటి వరకూ నీళ్లు రాలేదని అక్కడి స్థానికులు కొందరు చెబుతున్నారు.
పది రోజులుగా నీళ్లు రాలేదని పాలస్తీనియన్ మహిళ మౌనా జకీ చెప్పారు. ఆమె తన కటుంబంతో కలిసి దక్షిణ ప్రాంత పట్టణమైన రఫాకి పారిపోయి వచ్చారు.
''కలుషిత నీటినే బ్యారెల్ 200 షెకెల్ (50 డాలర్లు)లకు కొంటున్నాం'' అని ఆమె చెప్పారు.
ఒకవేళ నీటిని విడుదల చేసినా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల నివాసిత భవనాలకు సరఫరా చేయడం సాధ్యం కాదని అక్కడి స్థానికులు కొందరు చెబుతున్నారు.
గాజా ప్రాంతంలో ఒకే ఒక్క నీటి పైప్‌లైన్ నుంచి నీటిని విడుదల చేశారని యూఎన్ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది.''అవి ఖాన్ యూనిస్ పట్టణంలోని సగం మందికి మాత్రమే పరిమితంగా నీరు లభించింది'' అని చెప్పింది.
గాజా ప్రాంతంలో కేవలం 14 శాతం మందికి, అంటే సుమారు 3,08,000 మందికి మాత్రమే నీటి సరఫరా జరిగిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే, ఇప్పటికే నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇజ్రాయెలీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
గాజా ప్రాంతానికి సుమారు 8 నుంచి 10 శాతం మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్లు వారు చెప్పారు.
గాజా ప్రాంతంలో అక్కడి బోర్ల నుంచి వచ్చే నీరే ఎక్కువని ఇజ్రాయెల్ అధికారి చెప్పారు.
''నీటిని పంప్ చేసేందుకు అక్కడ జనరేటర్లు ఉన్నప్పటికీ వాటికి అవసరమైన ఇంధనాన్ని హమాస్ సరఫరా చేయడం లేదు. కానీ, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మాత్రం వాడుకుంటోంది'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో గాజాపై దాడులు చేసిందా... ఈ స్మోక్ స్క్రీన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరం?
- ఫిల్లీస్ లాతోర్: ప్రమాదకరమైన ఆపరేషన్లు చేసిన లేడీ సీక్రెట్ ఏజెంట్
- నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్...ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....
- ఇజ్రాయెల్‌పై మెరుపుదాడిలో హమాస్ మాస్టర్ మైండ్స్ వీరే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)