హష్ మనీ కేసు: ఈనెల 10న ట్రంప్‌కు శిక్ష ఖరారు, న్యాయమూర్తి ఇచ్చిన సంకేతం ఏమిటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఆనా లామ్చే
- హోదా, బీబీసీ ప్రతినిధి
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ముందే హష్‌మనీ కేసులో ఆయనకు జనవరి 10న శిక్ష ఖరారు చేయనున్నట్టు న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
అయితే శిక్షలో భాగంగా ఆయనను జైలుకు పంపడం, ప్రొబేషన్ లేదా జరిమానా వంటివేమీ ఉండవని జస్టిస్ జువన్ మెర్చన్ సంకేతాలు ఇచ్చారు. శిక్ష ఖరారుచేసే రోజున ట్రంప్ కోర్టుకు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా హాజరు కావచ్చని సూచించారు.
హష్‌మనీ కేసును కొట్టివేసేందుకు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపును కోర్టులో ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు.
న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ న్యాయవాదుల బృందం విమర్శించింది. ట్రంప్‌కు శిక్ష ఖరారు చేయాలనే నిర్ణయం "అన్యాయమని", కేసును తక్షణం కొట్టి వేయాలని కోరింది.
శృంగార చిత్రాల తార స్టోర్మీ డేనియల్స్‌కు చెల్లించిన లక్షా 30వేల డాలర్లకు సంబంధించి రికార్డులను తారుమారు చేసిన కేసులో డోనల్డ్ ట్రంప్‌ను కోర్టు 2023 మేలో దోషిగా తేల్చింది.
స్టోర్మీ డేనియల్స్‌తో సెక్స్‌లో పాల్గొన్న కేసులో, ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు తన మాజీ లాయర్ మైకేల్ కొహెన్ ద్వారా డబ్బు చెల్లించేందుకు ప్రయత్నించారని ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ సంఘటన 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగింది.
తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని, తనను దోషిగా ప్రకటించవద్దని ట్రంప్ కోరారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనకు హాని చేసేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి మెర్చన్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ అధికార ప్రతినిధి విమర్శించారు. ఇది ప్రతీకారేచ్ఛలో భాగమమన్నారు.
"డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు ముందు అధ్యక్షుడిగా తన బాధ్యతల నిర్వహణకు అవసరమైన మార్పు ప్రక్రియలో పాల్గొంటున్నారు. కోర్టు కేసులు, ప్రతీకార చర్యలు ఆయనను ఆపలేవు" అని స్టీవెన్ చెంగ్ చెప్పారు.
"ట్రంప్‌కు ఎలాంటి శిక్ష విధించకూడదు. ఈ తప్పుడు కేసులను కొట్టివేసేదాకా ఆయన పోరాడుతూనే ఉంటారు" అని అన్నారు
ఈ కేసు అధ్యక్షుడిగా తన పాలనాసామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ట్రంప్ తన తాజా పిటిషన్‌లో ఆందోళన చెందారు.
అయితే తాను ట్రంప్ ఆందోళన తగ్గించేందుకు తగిన పరిష్కారాన్ని కనుగొనాలని భావిస్తున్నాని, తీర్పును తిరగదోడాల్సిన అవసరం లేదని మెర్చన్ అభిప్రాయపడ్డారు.
ఇందుకోసం ట్రంప్ పరిపాలనా కాలం ముగిసేవరకు, అంటే 2029 వరకు తీర్పు ప్రకటించడాన్ని ఆలస్యం చెయ్యడం, లేదంటే జైలుశిక్ష లేకుండా తీర్పును వెల్లడించడం తనకున్న ప్రత్యామ్నాయాలని న్యాయమూర్తి తెలిపారు.


ఫొటో సోర్స్, Reuters
'అధ్యక్షుడి రక్షణ' కోసం సుప్రీంకోర్టుకు..
అమెరికా అధ్యక్షుడికి ఉండే ‘ప్రత్యేక రక్షణ’తో ఈ కేసు నుంచి తనను తప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు.
అధ్యక్షుడు పదవిలో ఉండగా తీసుకునే అధికారిక నిర్ణయాలకు మాత్రమే నేర విచారణ నుంచి మినహాయింపు ఉంటుందని జులైలో సుప్రీంకోర్టు తెలిపింది.
హష్‌మనీ కేసులో ట్రంప్‌కు శిక్ష విధించడం సరైనదేనని 2023 డిసెంబర్‌లో న్యాయమూర్తి మెర్చెన్ స్పష్టం చేశారు.
న్యూయార్క్ కోర్టు శిక్ష ప్రకటిస్తే, క్రిమినల్ కేసులో శిక్ష పడిన అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌస్‌లోకి అడుగు పెడతారు.
న్యూయార్క్ కోర్టు విధించే శిక్షపై ఆయన పై కోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది.
అమెరికాలో నగదు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తారు మారు చేసిన నేరం రుజువైతే నాలుగేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. జైలుకు పంపించకుండా శిక్షించే అవకాశం కూడా ఉంది.
ఎన్నికల్లో విజయానికి ముందు కూడా, న్యాయపరంగా ట్రంప్‌కున్న రికార్డు, వయసును దృష్టిలో పెట్టుకుని ఆయనను జైలుకు పంపించే అవకాశం లేదని న్యాయనిపుణులు భావించారు.
ట్రంప్ ఒక ఫెడరల్ క్రిమినల్ కేసు, మరో మూడు రాష్ట్రాల్లో కేసులను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి రహస్య పత్రాలకు సంబంధించింది. 2020 అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రెండు కేసులను ఎదుర్కొంటున్నారు.
హష్‌మనీ కేసులో ట్రంప్ మీద 2023 నవంబర్ 26న తీర్పు రావల్సి ఉంది. అయితే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడంతో జస్టిస్ మెర్చెన్ తీర్పును వాయిదా వేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














