వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి: బంధువులైన వీరి మధ్య అసలు గొడవేంటి, రాజకీయాలా, అంతకుమించా?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

ఇటీవల కోవూరు టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆ తర్వాత ఆయన ఇంటిపై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ప్రశాంతి వల్ల ఆమె భర్త ప్రభాకర్‌కు ప్రాణహాని ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.

"ప్రశాంతమ్మకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు. అవినీతిలో నేను పీహెచ్‌డీ చేశానని ప్రశాంతమ్మ అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతమ్మ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండు ప్రభాకరన్నా" అన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.

వైసీపీ కోవూరు నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశంలో జూలై 7న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తర్వాత అదే రోజు రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లోని ఫర్నీచర్, వస్తువులతో పాటు కారు కూడా ఈ దాడిలో ధ్వంసమైంది.

ఆ సమయంలో ఇంట్లో లేని ప్రసన్నకుమార్ రెడ్డి తర్వాత దాడి గురించి మాట్లాడారు.

"నెల్లూరు జిల్లా చరిత్రలో మొదటిసారి ఇలాంటి దాడి జగింది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను కూడా చంపేసి ఉండేవారు" అని మీడియాతో అన్నారు. పర్సంటేజీల ప్రసన్న అని తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో కౌంటర్ ఇచ్చానని, తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఈ వివాదం నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు ఇవీ.

1. అసలు ఈ వివాదానికి కారణమేంటి ?

‘‘అవినీతికి, నీతి-నిజాయితీలకు మధ్య జరుగుతున్న పోరు ఇది. గత ఐదేళ్లలో చేసిన అవినీతిపై ప్రశ్నించినప్పుడల్లా మా నోళ్లు నొక్కడానికి, మమ్మల్ని భయపెట్టడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. మేము సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. మా గురించి నీచంగా మాట్లాడితే, రాజకీయాల నుంచి వెనక్కి వెళ్లిపోతాను అని వారి ఆలోచన. ఇది ఇప్పుడు కాదు...ఎన్నికల ముందు నుంచే జరుగుతోంది. 'ఆమె టికెట్ తీసుకుంటే నేను ఇలా మాట్లాడతాను' అని చెప్పి మరీ చేస్తున్నారు. ఎలక్షన్ అయిపోయి సంవత్సరం దాటింది. మేము చేసే పనులు, మేము జనంలోకి వెళ్తున్న తీరు చూసి జీర్ణించుకోలేక, ఆయన అవినీతి గురించి మేము అడుగుతుంటే ఇలా నీచంగా మాట్లాడుతున్నారు’’ అని ఆమె చెప్పారు.

2. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి మీరే చేయించారా?

‘‘ఆయన బుద్ధే అలాంటిది. ఆయన మాటతీరే దాడికి కారణం. ఆయన నీచమైన మాటలే ఈ దాడికి దారితీశాయి. వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) గారికి ఎంతోమంది అభిమానులున్నారు. మమ్మల్ని వాళ్ల కుటుంబ సభ్యుల్లాగా చూస్తారు. మా కుటుంబాన్ని అనడంతో కడుపు మండి ఎవరో ఈ పని చేసి ఉండొచ్చు. ఎవరో నాకు తెలియదు. పోలీసులకు ఎంపీ గారు కాల్ చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. కానీ ఇప్పుడు మేమే దాడి చేయించాం అని వాళ్లు మాట్లాడుతున్నారు. వీళ్లు మాట్లాడిన నీచమైన భాష గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని కూడా నాకు లేదు. కానీ ప్రజలకు వీళ్లు చేసిన చెడ్డ పనులు తెలియాలి’’ అని ప్రశాంతిరెడ్డి బదులిచ్చారు.

3. ప్రసన్నకుమార్ రెడ్డి, మీరూ బంధువులే కదా, వైరం ఎందుకు?

‘‘ఆయనతో నాకేం వైరం ఉంటుంది? నేను వైసీపీలో ఉన్నన్ని రోజులూ మా దగ్గరకు వచ్చి, డబ్బులు తీసుకెళ్లేవారు. ఆయనతో నాకేం వైరం ఉంటుంది? చిన్న దాన్నైనా నా కాళ్లకు దండం పెట్టి, తండ్రీకొడుకులిద్దరూ వచ్చి గంటలు గంటలు ఇక్కడ వెయిట్ చేసేవారు. నేను టీడీపీలో చేరే ముందు రోజు దాకా ఆయన ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని గెలిపించండి అని మా ఇంటి చుట్టూ తిరిగిన వ్యక్తి. ఈరోజు ఆయనకు నిలబడడానికి కూడా స్థానం లేదు. తిరిగి గెలిచే చరిత్ర ఆయనకు లేదు. ఆ కడుపు మంటతో ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలోనే కాదు...రాష్ట్రంలో, దేశంలో ఓ మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన మాటలు ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడలేదు. మాట్లాడిన దానికి పర్యవసానం ఎలా ఉంటుందో అభిమానులు చూపించారు.

నాకేమీ వైరం లేదు. ఆయన అవినీతిపై విమర్శలు చేశాను. దానికి బదులుగా అవినీతి చేయలేదు అని చెప్పే ధైర్యం లేకుండా, సమాధానం చెప్పలేక ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రసన్న మాటలను సమర్థించే కొంతమంది వైసీపీ వారికి చెబుతున్నా... ఈ మాటల వీడియో తీసుకెళ్లి మీ కుటుంబ సభ్యులకు చూపించే ధైర్యం మీకు ఉందా, చూపిస్తారా? అవినీతి చేసుంటే చెప్పండి. అది రాజకీయం..ఇది కాదు. ఇది పార్టీ ఓడిందని, పదవి పోయిందని ఫ్రస్ట్రేషన్'' అని ప్రశాంతిరెడ్డి జవాబిచ్చారు.

4. మరి ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి చేసిందెవరు?

‘‘ఎవరో అభిమానులు కొంచెం పగలకొడితే మిగిలిన మొత్తం ఆయనే పగలగొట్టుకొని, షామియానాలు వేసుకొని, ఒక హుండీ పెట్టుకొని, దాన్ని చూపించుకుంటూ... ఫర్నిచర్ కొనుక్కోవాలి, నా దగ్గర రూపాయి కూడా డబ్బు లేదు, ఆ హుండీలో వేసిపోండి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన’’ అని ఆమె ఆరోపించారు.

5. ఇకముందు రాజకీయాలు ఎలా చేయబోతున్నారు?

‘‘ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడను. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ.. అందరూ నాకు అండగా ఉన్నారు. నా కోవూరు నియోజకవర్గ ప్రజలు తమ బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నారు. ఆల్రెడీ దీనిపైన కేసు పెట్టాం. పరువునష్టం దావా కూడా వేస్తున్నాం. లీగల్‌గా అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు.

ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై ఇంకా స్పందించని నల్లపురెడ్డి

అయితే ఈ ఘటనపైన, దాడికి సంబంధించి ప్రశాంతి రెడ్డి చేసిన ఆరోపణలపైన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

చేతికి సర్జరీ జరిగిందని, అబ్జర్వేషన్‌లో ఉండాలని డాక్టర్లు అన్నట్టు ఆయన కుమారుడు రంజిత్ రెడ్డి బీబీసీకి తెలిపారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బీబీసీతో చెప్పారు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)