You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైఎస్ జగన్: మాజీ సీఎం వ్యాఖ్యలతో ముసిరిన వివాదం, పోలీసుల నుంచి కౌంటర్లు, కానీ రూల్స్ ఏం చెబుతున్నాయి?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
తప్పు చేసిన పోలీసుల బట్టలూడదీయిస్తామంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను అధికార టీడీపీ నేతలతో పాటు రామగిరి ఎస్‌ఐ తీవ్రంగా ఖండించారు. అయితే, తప్పు చేసిన పోలీసులను ఉద్దేశించే వైఎస్ జగన్ ఆ కామెంట్లు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు సమర్ధిస్తున్నారు.
ఇది ఒక్క జగన్‌కు మాత్రమే పరిమితం కాదు. గతంలో టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు కూడా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు పోలీసులను దుర్భాషలాడిన ఘటనలు గతంలోనూ జరిగాయి.
అసలు పోలీసులపై రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? పోలీసులు బహిరంగంగా కౌంటర్ ఇవ్వొచ్చా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగన్ ఏమన్నారంటే..
''తప్పు చేసిన ఖాకీల యూనిఫాంలు తీయిస్తాం. అలాంటి పోలీసు అధికారుల బట్టలూడదీయిస్తాం. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని వదలిపెట్టం. మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతాం. మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం. మీరు చేసిన ప్రతీ పనికి వడ్డీతో సహా లెక్కేసి మరీ దోషులుగా నిలబెట్టి మీతో మీరు చేసినవన్నీ కక్కిస్తాం'' అని మంగళవారం పోలీసులను ఉద్దేశిస్తూ జగన్ వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
''రామగిరిలో ఇటీవల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైసీపీ ఎంపీటీసీలను ఎస్‌ఐ సుధాకర్ అడ్డుకుని భయపెట్టారు. అదే సమయంలో వైసీపీ నేత లింగమయ్యను ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారు. హతుడి భార్యకి చదువు రాకపోవడంతో పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదు రాసి దానిపై సంతకం తీసుకున్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా కేసు నీరు గారుస్తున్నారు'' అని రామగిరి పర్యటనలో వైఎస్ జగన్ ఆరోపించారు.
గతంలో విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జైలు బయట మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన పోలీసుల బట్టలూడదీయిస్తామని అన్నారు.
వైఎస్ జగన్ ఇటీవల వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయనను కలిసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పవన్‌కుమార్, తనను ఓ కేసులో డీఎస్పీ వేధిస్తున్నారని చెప్పుకున్నారు. ''ఏం బాధపడకు. మన ప్రభుత్వం రాగానే ఆ డీఎస్పీతో సెల్యూట్ చేయిస్తానంటూ'' వైఎస్ జగన్ స్పందించారు.
స్పందించిన రామగిరి ఎస్‌ఐ సుధాకర్
పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఖండించారు.
''ఊడదీయడానికి పోలీసు యూనిఫాం అరటి తొక్కకాదు. జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి'' అని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
మాజీ సీఎం అయినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడతారా? అలా మాట్లాడితే మేం ఊరుకోవాలా? అందుకే గట్టిగా ఖండించాల్సి వచ్చిందని సుధాకర్ యాదవ్ బీబీసీతో అన్నారు.
ఎస్‌ఐ ఇలా బహిరంగంగా మాట్లాడొచ్చా అని ప్రశ్నించగా, ఎందుకు మాట్లాడకూడదంటూ ఆయన బదులిచ్చారు.
''రాజ్యాంగం మాకు కూడా వాక్ స్వాతంత్య్రపు హక్కు ఇచ్చింది. అకారణంగా నిందలు వేస్తే సహించాలా? ఎంపీపీ ఎన్నిక సమయంలో పోలీసులను ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దారుణంగా నీచమైన భాషలో తిట్టిన వీడియో ఉంది. అలాంటి మాటలు విని కూడా మేం గమ్మునుండాలా? మేం కూడా మనుషులమే కదా'' అని సుధాకర్ ప్రశ్నించారు.
ఇటీవల తాను లోకేష్ సహా ఇతర మంత్రులను కలిసిన ఫోటోలను చూపిస్తూ, తనను టీడీపీ సానుభూతిపరుడని ముద్రవేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ తన గురించి పోస్టులు చేస్తోందని ఆయన చెప్పారు.
''నాతో పాటు మరో 60 మంది 16 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నాం. ఆ సమస్యపై ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మంత్రులతో పాటు, గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా అప్పటి నేతలను కలిశాం. రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్న మాకు రాజకీయాలు అంటగట్టకూడదు'' అని సుధాకర్ అన్నారు.
టీడీపీ నేతలు ఎన్నోసార్లు నోరుపారేసుకున్నారు : కేతిరెడ్డి
టీడీపీ కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ అధికార పార్టీ నేతలకు ఊడిగం చేసే పోలీసులను ఉద్దేశించే వైఎస్ జగన్ అలాంటి విమర్శలు చేస్తున్నారని బీబీసీతో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఇందులో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
''పోలీసు వ్యవస్థపై జగన్ ఎప్పుడూ కామెంట్ చేయరు. పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఎప్పుడూ విమర్శించరు. కానీ, అడ్డగోలుగా వ్యవహరించే పోలీసులను జగన్ ఉపేక్షించరు'' అని కేతిరెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఎన్నోసార్లు పోలీసులపై నోరుపారేసుకున్నారని కేతిరెడ్డి ఆరోపించారు.
మా నేతలు ఎప్పుడూ అదుపు తప్పలేదు : సోమిరెడ్డి
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ అదుపు తప్పి మాట్లాడలేదని బీబీసీతో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
''టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించేవారు. అయినా ఇలాంటి తప్పుడు మాటలను మా నేతలు ఎప్పుడూ అనలేదు. అధికారంలోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే అనేవాళ్లు. అంతేగానీ ఇలా బట్టలూడదీస్తామంటూ ఎప్పుడూ మాట్లాడలేదు'' అన్నారాయన.
ఎస్‌ఐ సుధాకర్ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని బీబీసీతో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న చెప్పారు.
'సుధాకర్ వ్యాఖ్యల్లో తప్పు లేదు'
సుధాకర్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పోలీసు అధికారుల సంఘం నేతలు సమర్థించారు. ఈ అంశం గురించి బీబీసీతో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేన్, అసోసియేట్ ప్రెసిడెంట్ హరి మాట్లాడారు.
''నిజానికి రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వమైనా మాకు ఒక్కటే. కానీ వైఎస్ జగన్, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులపై నోరు పారేసుకుంటున్నారు. ఇది సరికాదు. ఎన్నాళ్లు ఊరుకుంటాం. మేమూ మనుషులమే కదా. సుధాకర్ అందుకే గట్టిగా మాట్లాడారు. ఇప్పటికైనా పోలీసుల జోలికి రావొద్దు'' అని వారు సూచించారు.
ఈ వ్యాఖ్యల్ని జగన్ తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపోరాటం చేస్తామని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు.
పోలీసులు అలా మాట్లాడొచ్చా..
రాజకీయ నేతల విమర్శలను ఒక ఎస్‌ఐ ఇలా బహిరంగంగా ఖండించవచ్చా? ఇందుకు పోలీసు ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేదా అనే అంశంపై గతంలో ఐజీగా పనిచేసిన ఇక్బాల్ బీబీసీకి వివరించారు.
''పోలీసు మ్యాన్యువల్‌లో దీనిపై స్పష్టత లేదు. కానీ పోలీసులు కూడా ఏం చేస్తారు? రాజకీయ నేతలు మితిమీరి పోలీసులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే వాళ్లు కూడా ఎంతవరకు ఓపిక పట్టగలరు. అందుకే, ఆ ఎస్‌ఐ అలా ఖండించి ఉంటారు'' అని ఇక్బాల్ అన్నారు.
ఇక్బాల్ గతంలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు.
'రాజకీయ నేతల వ్యాఖ్యలు శ్రుతిమించకూడదు'
పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును విమర్శించొచ్చు, కానీ మరీ శ్రుతిమించి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీబీసీతో రాజకీయ విశ్లేషకులు డానీ అన్నారు. ఏపీ రాజకీయాల్లో శ్రుతిమించిన తీరు సాధారణమైపోయిందని చెప్పారు.
''అధికారం పోయినప్పటి నుంచి వైఎస్ జగన్ అసహనంతో ఉన్నారు. అలాగని పాలకపక్షంలో ఉన్న వాళ్లేమీ శుద్ధులేం కాదు. గతంలో పవన్ కల్యాణ్ కూడా పోలీసులను ఉద్దేశించి ఇలానే మాట్లాడేవారు.
అయితే, ఇప్పుడు విమర్శల్లో జగన్ మరింత డోస్ పెంచారు. ఇలానే రాజకీయాలు కొనసాగితే ఏపీలో వ్యవస్థలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది'' అని ఆయన చెప్పారు.
పోలీసు మ్యాన్యువల్‌లో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ మ్యాన్యువల్‌లో నేరుగా రాజకీయ నేతల విమర్శలకు స్పందించాలా, లేదా అనే ప్రస్తావన లేదు.
కానీ, ఎవరితోనైనా ఎలా వ్యవహరించాలనే దానిపై కొన్ని సూచనలు ఉన్నాయి.
మొత్తం 367 పేజీల మ్యాన్యువల్‌లో 87వ పేజీలో పాజిటివ్ దృక్పథాన్ని ఎలా అమలు చేసుకోవాలనే విషయమై 33వ పాయింట్‌గా ''మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. వాదనకు పోవద్దు'' అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)