You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'బనకచర్ల'పై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం ఎందుకంటోంది, తెలంగాణ వాదనేంటి?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించేలా ప్రతిపాదించిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు.
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ మళ్లీ ప్రతిపాదనలు పంపుతామని ఆయన బీబీసీతో చెప్పారు.
అయితే, వృథా జలాల పేరిట గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.
అసలేమిటీ వివాదం? బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలేంటి? కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఏం చెప్పింది?
చంద్రబాబు చెప్పిన వారం రోజుల్లోనే..
వాస్తవానికి పోలవరం– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం సాయం కోరాలని ఏపీ సీఎం చంద్రబాబు వారం కిందటే నిర్ణయించారు.
బనకచర్లను వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికి పోకుండా కేంద్రం జోక్యం కోరాలని వారం రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.
అయితే, ఈలోపే కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టుకు కీలకమైన పర్యావరణ అనుమతులపై అభ్యంతరం చెబుతూ ప్రకటన రావడం చర్చనీయమైంది.
కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.
కేంద్రం ఏమందంటే..
పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది.
ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.
''కేంద్ర జల సంఘం (సీడబ్లూసీ) అనుమతులు తీసుకోవాలి. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ బోర్డుకి విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం చెబుతోన్న వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది'' అని ఆ కమిటీ సూచనలు చేసింది.
ఆ తర్వాతే పర్యావరణ మదింపునకు అవసరమైన టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ప్రతిపాదనలతో రావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.
ఈ మేరకు జూన్ 17వ తేదీన నిర్వహించిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) సమావేశ వివరాలను రెండురోజుల కిందట కేంద్రం వెల్లడించింది.
కాగా, అటవీ శాఖ నిర్ణయంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బీబీసీతో మాట్లాడారు.
మళ్లీ ప్రతిపాదనలు పంపిస్తాం: మంత్రి
ప్రతి ఏటా సముద్రంలో వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.
కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన మాట వాస్తవమే కానీ, ఎక్కడా వ్యతిరేకించలేదని మంత్రి చెప్పారు.
కేవలం కొన్ని సందేహాలను లేవనెత్తిందనీ, వాటిని నివృత్తి చేస్తూ మళ్లీ ప్రతిపాదనలు పంపుతామన్నారు.
''ఈ సారి పక్కాగా ప్రతిపాదనలు పంపిస్తాం. అలాగే ముందుగా కేంద్రజల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులను కూడా తీసుకుంటాం. ఇప్పటికే సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు కూడా పంపించాం.''
కేవలం సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి వరద నీళ్లను మాత్రమే బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఏ మాత్రం నష్టం లేదని కేంద్రానికి స్పష్టం చేస్తామని నిమ్మల వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం, దేవాదుల, సమ్మక్కసాగర్, శ్రీరాం సాగర్ వంటి ఎన్నో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారని, వాటి గురించి ఎక్కడా ఏపీకి తెలియజేయలేదని నిమ్మల అన్నారు.
''ఇప్పుడు మేం ఒకే ఒక్క అనుసంధాన ప్రాజెక్టు కడుతున్నాం. అది కూడా కేవలం సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను వాడుకునేందుకే.. నిజానికి ఆ మిగులు నీళ్లపై ఎవరికీ హక్కు లేదు. ఆ జలాలతోనే రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు సంకల్పించి, బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు'' అని ఆయన అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం : ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించబోమని, ఆ విషయాన్ని కేంద్రానికి గట్టిగా చెప్పడంతోనే వారి ప్రతిపాదనలను వెనక్కి పంపిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
పోలవరం– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తూ, జూలై 1న హైదరాబాద్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రూ.81,500 కోట్లతో ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి కూడా విరుద్ధమని ఉత్తమ్ వివరించారు.
75 శాతం నీటి లభ్యత ఆధారంగా, ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం గోదావరి జలాల్లో 518 టీఎంసీలు ఏపీకి, 968 టీఎంసీలు తెలంగాణకు వచ్చాయన్నారు. ఈ వాటాల్లో మార్పు చేసేందుకు వీలు లేదన్నారు.
ఇప్పుడు వృథా జలాల పేరిట గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు కూడా వ్యతిరేకంగా ఏపీ వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.
అయితే, ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు అవగాహన లేకనే అలా మాట్లాడుతున్నారని, కేవలం వృథా జలాలు మాత్రమే వినియోగించుకుంటామనే విషయాన్ని వారితో పాటు కేంద్రానికి పక్కాగా వివరిస్తామని ఏపీ మంత్రి నిమ్మల బీబీసీతో అన్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
తెలంగాణతో విభేదాలు తెచ్చుకుని కేంద్రాన్ని బతిమాలి మరీ బనకచర్ల ప్రాజెక్టు తేవాల్సిన అవసరం ఏపీకి లేదని రాష్ట్రంలోని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే రూ.82 వేల కోట్లతో బనకచర్ల తలపెట్టడం అర్థరహితమని, కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ ఆ ప్రతిపాదనను వెనక్కి పంపిన తర్వాతనైనా ప్రాజెక్టుకు స్వస్తి పలకాలని ప్రముఖ పర్యావరణవేత్త కె. బయ్యపు రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆర్థిక, సాంకేతిక, సామాజిక, పర్యావరణ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, నీటిపారుదల నిపుణులను సంప్రదించకుండా హడావిడిగా కేంద్రానికి ప్రతిపాదనలను పంపడం సరికాదన్నారు.
బనకచర్ల పూర్తవడానికి ఏళ్లు పట్టవచ్చని, దానికి బదులు ఏపీ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని జన చైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సూచించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''అప్పుల పాలైన రాష్ట్రంలో మరో రూ.82 వేల కోట్లు ఒక్క భారీ ప్రాజెక్టుపై వెచ్చించడం, 48 వేల ఎకరాల భూమిని సేకరించడం, అందులో 17 వేల ఎకరాల అటవీ భూమిని వినియోగించడం, 27 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తవ్వడం, 400 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మించడం వంటి పనులు పూర్తి చేసేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది.
ప్రాజెక్టు పూర్తయ్యేసరికి బడ్జెట్ లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇన్ని వ్యయప్రయాసలతో ఇంత ఖర్చు చేసే కంటే, రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం మేలు'' అని అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)