ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫీసులో నేల మీద ఎందుకు కూర్చుంటున్నారు?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డెయిరీ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రవివర్మ, జూన్ 20న తన చాంబర్‌లో కింద కూర్చుని నిరసన తెలుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో దళిత లెక్చరర్‌కు అవమానం జరిగిందని ఆరోపిస్తూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి.

ఇంచార్జ్ రిజిస్ట్రార్ ముందు, ఆ విభాగం ప్రిన్స్‌పాల్ రవీంద్రా రెడ్డితో వాగ్వాదానికి దిగాయి.

దీంతో ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఎవరు ఏం చెబుతున్నారు? ఇందులో నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

అసలు ఏం జరిగింది?

యూనివర్శిటీలో ఏం జరిగిందో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ తనకు వివరించారని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళపాక దాము బీబీసీతో చెప్పారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని యూనివర్సిటీ ఉద్యోగులు కొందరు కూడా ఈ ఘటన గురించి బీబీసీకి వివరించారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం..

రవివర్మ జూన్ 19న సెలవు మీద సొంతూరికి వెళ్లారు.

ఆ సమయంలో ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి, డీన్‌ను రవివర్మ చాంబర్ తాళం తీసుకుని దానిని ఓపెన్ చేశారు. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ చైర్‌ను తీసుకెళ్లి పైన పెట్టించారు.

మరుసటి రోజు అక్కడికి వచ్చిన డీన్, రవివర్మ కుర్చీ లేకపోవడంతో తాత్కాలికంగా బయట ఉన్న విజిటర్స్ కుర్చీ ఒకటి తీసుకొచ్చి చాంబర్‌లో వేయించారు.

అదే రోజు అంటే జూన్ 20న కాలేజీకి తిరిగి వచ్చిన రవివర్మ, కుర్చీ లేకుంటే ఎలా పని చేయాలంటూ కింద నేలపై కూర్చుని నిరసన తెలిపారు.

తర్వాత రోజు అక్కడికి వచ్చిన వీసీ, ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి, రవివర్మతో మాట్లాడి వారి మధ్య సయోధ్య కుదిర్చారు.

తర్వాత ప్రిన్స్‌పాల్ రవీంద్రారెడ్డితో రవివర్మకు క్షమాపణ కూడా చెప్పించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి ఒకరు చెప్పారు.

ఈ వివరాలను బీబీసీ స్వయంగా ధృవీకరించలేదు.

రవివర్మ ఏం చెప్పారు..

ఈ ఘటనపై వివరణ తీసుకునేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మను సంప్రదించింది బీబీసీ. కానీ ఆయన ప్రస్తుతం యూనివర్సిటీలో జరిగిన అంశం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

''నేను కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉన్నాను. మీడియాతో మాట్లాడేందుకు ఉన్నతాధికారుల అనుమతి అడిగాను. వారు అనుమతించగానే మీతో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారు'' అని రవివర్మ బీబీసీతో అన్నారు.

‘‘అది మహిళలకు కేటాయించిన కుర్చీ. ఆ కుర్చీని ఈయన మధ్యలో వచ్చి తీసుకున్నారు. ఆ కుర్చీని తిరిగి అలాట్ చేసిన మహిళలకు ఇచ్చాం. అంతేతప్ప ఇక్కడ ఎటువంటి కుల వివక్ష లేదు’’ అని ప్రిన్స్‌పాల్ రవీంద్రారెడ్డి బీబీసీతో అన్నారు.

ఇంత వివాదం ఎందుకు?

ఈ వివాదం ఇంత దూరం రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని దళిత సంఘం నాయకులు, రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరర్ దుగ్గాని జయరాం అన్నారు.

"గత 20 ఏళ్ల నుంచి వర్సిటీలో కాంట్రాక్ట్‌ బేసిస్‌లో పని చేస్తున్న రవివర్మకు పే స్కేల్ ఇవ్వాలని 2014లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ దాన్ని అమలు చేయడం లేదు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిరణ్ బాబుపై కోర్టుకు కూడా వెళ్లారు వర్మ’’ అని జయరాం అన్నారు.

చాంబర్‌లో కుర్చీ లేకపోతే, రవివర్మ దానిపై గొడవ చేస్తే ఆయనపై వచ్చే కంప్లైంట్ ఆధారంగా ఆయనను తొలగించవచ్చని ప్రణాళిక వేశారని తాళ్లపాక దాము ఆరోపించారు.

అయితే, ఈ ఘటనకు, కిరణ్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘కిరణ్ బాబు ఈ ఆఫీసులో ఉన్నారా ? లేదు కదా. ఆయనకి ఈ సంఘటనకు ఎటువంటి సంబంధం లేదు’’ అని రవీంద్రారెడ్డి అన్నారు.

ఇంచార్జ్ రిజిస్ట్రార్ శ్రీలత కూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిరణ్ బాబుకు ఈ వివాదంతో సంబంధం లేదన్నారు.

వర్సిటీ అధికారులేమంటున్నారు?

ఈ అంశంపై యూనివర్సిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ శ్రీలతను బీబీసీ సంప్రదించింది.

ఈ ఘటనపై ఎంక్వైరీ కమిటీ వేశామని, నాలుగైదు రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో విచారణలో తేలుతుందని ఆమె చెప్పారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను వీసీ పరిష్కరించారని శ్రీలత చెప్పారు.

''అక్కడ జరిగే లోటు పాట్లు పరిశీలించాలి. నేను ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా ఉన్నాను. ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంక్వైరీ కమిషన్ వేశాం. అసలు మీ ఫిర్యాదు ఏంటో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వారిని అడిగాం. ఆ రోజే వీసీ వెళ్లి ఇద్దరితో మాట్లాడారు. వీసీ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఇద్దరికీ చెప్పాల్సింది చెప్పి కమ్యూనికేషన్‌లో వచ్చిన గ్యాప్‌ను వీసీ పరిష్కరించారు. మళ్లీ ఇది ఎందుకు బయటకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కచ్చితంగా దీనిపై దృష్టి సారిస్తాం'' అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)