ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్: విమాన ప్రమాద బాధితులకు కోట్లలో, రైలు - రోడ్డు ప్రమాద బాధితులకు లక్షల్లో పరిహారం, ఎందుకింత వ్యత్యాసం?

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనిషి ప్రాణం విలువ వారు ప్రయాణించే వాహనం, వారి ఆదాయాన్ని బట్టి ఉంటుందా?

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న మీద చర్చ జరుగుతోంది.

విమాన ప్రమాదం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందిస్తామని టాటా గ్రూపు ప్రకటించిన తరువాత సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ మొదలైంది.

రోడ్డు, రైలు ప్రమాద బాధితులకు అందే పరిహారానికి, విమాన ప్రమాద బాధితులకు అందే పరిహారానికి ఎందుకింత తేడా?

దేశంలో సాధారణంగా రోడ్డు, రైలు ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారం లక్షల్లోనే ఉంటుంది.

ఈ క్రమంలో మనిషి ప్రాణం విలువపై చర్చ పెరిగింది. అసలింతకీ, ఈ పరిహారాలు ఎవరు ఇస్తారు? ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకు అంత వ్యత్యాసం ఉంది?

ఈ తేడాల గురించి తెలుసుకోవడానికి మూడు అంశాలు చూడాలి.

అంతర్జాతీయ ఒప్పందాలు, ఇన్సూరెన్స్ నిబంధనలు, చట్టాలు, ప్రభుత్వ ఔదార్యం.

విమాన ప్రమాదాల్లో పరిహారం 1999 నాటి మోనిట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఇస్తారు.

ఐసీఏవో.. అంటే, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.

అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ప్రమాదాలకు సంబంధించిన పరిహారాలపై జరిగిన ఒప్పందం ఇది.

2009 నుంచి భారతదేశం కూడా ఈ ఒప్పందాన్ని అమలు చేస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం, ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వాల్సిన పరిహారం అంతర్జాతీయంగా నిర్ణయం అవుతుంది.

ప్రస్తుతం ఆ పరిహారం 1లక్షా 51 వేల 880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద ఉంది.

ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది కూడా ఒక రకంగా కరెన్సీయే.

కాకుంటే ఈ కరెన్సీ ఏ దేశానికీ చెందినది కాదు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి దీన్ని ఏర్పాటు చేసింది.

2025 జూన్ 24 నాటికి ఒక ఎస్డీఆర్ సుమారు 122 భారత రూపాయలతో సమానం.

ఆ ప్రకారం 1,51,880 ఎస్డీఆర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఒక కోటీ 85 లక్షల పైనే. విమాన ప్రమాదానికి కారణాలు, లోపాలు అనే దాంతో సంబంధం లేకుండా చనిపోయిన వారి కుటుంబాలకు విమానయాన సంస్థలు ఈ పరిహారం చెల్లించాలి.

అది కాక, ప్రమాదం వెనుక సంస్థ నిర్లక్ష్యం ఉందని తేలితే అప్పుడు ఇంకా ఎక్కువ పరిహారం కూడా అడగవచ్చు.

సాధారణంగా ఈ పరిహారం విమానయాన సంస్థ, బీమా సంస్థలు కలిపి ఇస్తాయి.

ఆ మేరకు ఆయా సంస్థల మధ్య పరస్పర ఒప్పందాలు జరుగుతాయి.

ఇది కాకుండా ఆయా బాధితులు తాము సొంతంగా ఏదైనా బీమా తీసుకుని ఉండుంటే, ఆ సొమ్ము కూడా అందుతుంది. ఇది అన్ని ప్రమాదాలకూ వర్తిస్తుంది.

రోడ్డు, రైలు ప్రమాదాల విషయంలో భారతదేశంలో భారత చట్టాలు వర్తిస్తాయి.

భారత ప్రభుత్వం ఈ చట్టాలను సవరిస్తూ, అందులో బీమా పాత్ర పెంచుతూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

రైలు ప్రమాదాల్లో కాస్త ఫర్వాలేదు కానీ, రోడ్డు ప్రమాదాల విషయంలో మాత్రం పరిహారం కాస్త క్లిష్టమైనది.

రైలు ప్రమాదాల్లో..

రైలు ప్రమాద బాధితులకు మూడు రకాల పరిహారాలు అందుతాయి.

ఒకటి రైల్వే చట్టం ప్రకారం ఇచ్చే పరిహారం.

రెండోది ఐఆర్‌సీటీసీ ఇన్సూరెన్స్.

మూడోది ప్రభుత్వాలు ఔదార్యంతో ఇచ్చేవి.

భారత ప్రభుత్వ రైల్వే చట్టం ప్రకారం.. ప్రమాదాల్లో మరణించిన వారికి రైల్వే శాఖ పరిహారం చెల్లిస్తుంది.

2023 సెప్టెంబరు నాటి భారత ప్రభుత్వ ప్రకటన ప్రకారం, రైల్వే ప్రమాదంలో మరణించిన వారికి రైల్వే శాఖ 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తోంది.

తిరిగి 2024 ఆగస్టులో రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన ప్రకారం, రైలు ప్రమాదంలో మరణించిన వారికి గరిష్టంగా 8 లక్షల పరిహారం ఇవ్వవచ్చని రైల్వే చట్టం చెబుతున్నట్టు ప్రకటించారు.

బాధితులు రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చని ఆయన తెలిపారు.

అది కాకుండా రైల్వే విభాగం అదనంగా ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వవచ్చని చెప్పారు. దీనికి అదనంగా ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ టిక్ పెట్టి అర్థ రూపాయి ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాదాలకు 10 లక్షల వరకూ అదనపు ఇన్సూరెన్స్ పొందవచ్చని ఆయన అన్నారు.

సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే శాఖ కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కూడా పరిహారం ప్రకటిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు, 2023 జూన్‌లో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారికి రైల్వేలు 10 లక్షల పరిహారం ప్రకటించగా, దానికి అదనంగా ప్రధాన మంత్రి నిధి నుంచి 2 లక్షలు ప్రకటించారు.

బెంగాల్ ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది.

మొత్తంగా రైలు ప్రమాద పరిహారాలు చట్టాల ప్రకారం కొద్ది మొత్తం, మిగతాది ప్రభుత్వాల దయ మీద, బాధితులు తీసుకున్న బీమా పాలసీల మీద ఆధారపడి ఉంటుంది.

రోడ్డు ప్రమాదాల్లో పరిహారం తక్కువా?

రోడ్డు ప్రమాదాల పరిహార ప్రక్రియ కాస్త క్లిష్టమైనది.

మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారాలు అందుతూ ఉంటాయి.

ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు కలసి 2 లక్షల వరకూ పరిహారం అందిస్తున్నాయి.

ఇది కాకుండా ప్రమాదం జరిగిన వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే కనుక అప్పుడు బాధితులకు కూడా బీమా వస్తుంది.

ఈ ఇన్సూరెన్సుల, పరిహారాల క్లెయిముకు ప్రత్యేక ట్రిబ్యునళ్లు కూడా ఉంటాయి.

ఇక ఏ ఇన్సూరెన్సూ లేకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సాధారణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడు పరిహారాలు ప్రకటిస్తూ ఉంటాయి.

అవి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంటాయి.

దానిపై గరిష్ట పరిమితి ఏమీ లేదు.

రాష్ట్రాలను బట్టి, ప్రమాద తీవ్రతను బట్టి అది మారుతూ ఉంటుంది.

వాహనానికి ఉండే బీమా ద్వారా అందే పరిహారం బాధితుల వయసు, ఆదాయం, వారిపై ఆధారపడి ఉన్న వారి సంఖ్య, వాహనం నడపడంలో నిర్లక్ష్యం పాత్ర, నిర్లక్ష్యం తీవ్రత, వైద్య, పునరావాస అవసరాల వంటి ఆధారంగా నిర్ణయిస్తారు.

''ప్రాణాలకు ఇచ్చే పరిహారంలో వ్యత్యాసం ఉండడం బాధాకరమే అయినా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాకపోతే విమాన ప్రమాదాలకు ఆయా ప్రైవేటు కంపెనీలు పరిహారం ఇస్తుంటాయి. రోడ్డు, రైలు ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం ఇస్తాయి. ఒకటి ముఖ్యం. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ప్రమాద బీమా తీసుకోవడం శ్రేయస్కరం" అని ఫైనాన్షియల్ అడ్వైజర్ కుందవరం సాయి బీబీసీతో చెప్పారు.

"విదేశాలకు వెళ్లాలంటే వీసా, రిటర్న్ టికెట్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని షరతులు పెడుతున్నారు. ఎందుకంటే, మనం అక్కడకు వెళ్లాక ఏమైనా జరిగితే ఆ భారం ఆ దేశంపై పడకూడదని. మన ట్రావెల్ ఇన్సూరెన్స్ మనమే చేయించుకోవడం మంచిది'' అని ఆయన సూచించారు.

విమాన ప్రమాదాల శాతం తక్కువ

అయితే రోడ్డు, రైలు ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రమాదాల శాతం తక్కువ.

పైగా విమాన ప్రమాదాల పరిహారాలకు అంతర్జాతీయ ఒప్పందాలు ఉండడం, పెద్దయెత్తున ఇన్సూరెన్సులు ఉండడం వల్ల ఆయా బాధితులకు అందే పరిహారం పెద్దగా ఉంటోంది. ఇక్కడ ప్రభుత్వ పాత్ర దాదాపు శూన్యం అనే చెప్పాలి.

కానీ రైలు, రోడ్డు ప్రమాదాల విషయంలో పరిహారం నిర్ణయించే చట్టాల్లో లక్షల రూపాయలే ఉన్నాయి.

ఒకవేళ విమాన ప్రమాద స్థాయి పరిహారం రోడ్డు, రైలు ప్రమాద బాధితులకు అందాలంటే పార్లమెంటు చట్టాలు మార్చాలి.

అప్పటి వరకూ ఇన్సూరెన్సే ఆధారం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)