You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పండుగల సమయంలో రైల్వే స్టేషన్లలో తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి?
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో పండుగల సీజన్‌లో రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి సమయాల్లో రైల్వేస్టేషన్లలో, రైళ్లలో ఇసుక వేస్తే రాలనంత తరహాలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉంటారు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి సమయంలో రైళ్లలో కనిపించే రద్దీ మధ్య, ఉత్తర భారతంలో దీపావళి, ఛట్ పూజలాంటి పండుగల సమయంలో ఉంటుంది.
ఎప్పటిలాగే ఈసారి కూడా చాలా రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.
ముంబయిలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 9 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఈ తొక్కిసలాట జరిగింది.
ముంబయి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్లే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు (22921 నంబర్), ప్లాట్‌ఫాం మీదకు ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సమాచార, ప్రచార) దిలీప్ కుమార్ బీబీసీతో చెప్పారు.
‘‘రైలు ప్లాట్‌ఫాం మీదకు వస్తుండగానే.. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రజలు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది’’ అని ఆయన తెలిపారు.
రైళ్లు ఎక్కడానికి తగినంత సమయం ఉంటుందని, ప్రయాణికులు ఓపికతో వేచి చూసి రైళ్లు ఎక్కాలని పశ్చిమ రైల్వే విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పశ్చిమ రైల్వే ఈ సూచన చేసింది.
పండుగల సమయంలో రైళ్లు అవి బయలుదేరడానికి రెండు నుంచి మూడు గంటల ముందే ప్లాట్‌ఫాంల మీదకు వస్తాయని, రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులకు కావాల్సినంత సమయం ఉంటుందని పశ్చిమ రైల్వే ప్రతినిధి వినీత్ అభిషేక్ చెప్పారు.
పండుగల సీజన్‌లో విపరీతమైన రద్దీ
దేశంలో ప్రతిరోజూ దాదాపు 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ముంబయిలో నడుస్తున్న సబర్బన్ రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు.
కానీ, పండుగల సమయాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లల్లో సీట్ల, బెర్తుల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
"రద్దీని రైళ్లు తట్టుకోలేకపోతున్నాయని నేను అనడం లేదు. రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీని అంచనా వేయలేకపోయారు. అధికారులు అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ప్రయాణికుల రద్దీ ఉంది’’ అని రైల్వే యూనియన్ ఏఐఆర్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా చెప్పారు.
పండుగల సమయాల్లో చాలామంది ప్రయాణికులకు రైళ్లలో కూర్చోడానికి కూడా సీటు దొరకదు. రద్దీగా ఉన్న రైళ్ల ఫోటోలను ప్రజలు తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.
దిల్లీ, పంజాబ్, ముంబయి, గుజరాత్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, వాటి చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో ఈ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
పండుగల సీజన్ కావడంతో ప్రధాన రైల్వే స్టేషన్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కనిపిస్తున్నారు.
ఈ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపడం సహా అనేక చర్యలు తీసుకుంటున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
పరిష్కారాలేంటి?
ప్రస్తుతం సాధారణ రైళ్లలో రెండు నెలలు ముందే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్ల వ్యవధిని కొన్ని రోజుల కిందటే నాలుగు నెలల నుంచి రెండు నెలలకు తగ్గించారు.
సాధారణంగా రైల్వే శాఖ ప్రతి సంవత్సరం ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఆ రైళ్ల సంఖ్య కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ సమస్యేంటంటే ప్రజలు అలాంటి రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడరు.
ప్రత్యేక రైళ్లల్లో ఉన్న మరో సమస్య ఏంటంటే, ఏ రైళ్లు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని కొంచెం ఆలస్యంగా ప్రకటిస్తుంటారు.
పశ్చిమ రైల్వే వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం, ప్రత్యేక రైళ్ల సమాచారం సెప్టెంబరులో ఇచ్చారు.
ప్రత్యేక రైళ్ల గురించి ఆలస్యంగా తెలియడంతో టికెట్లు బుక్ చేసుకోలేకపోయామని ప్రయాణికులు చెబుతున్నారు. అదే సమయంలో రెగ్యులర్‌గా తిరిగే రైళ్లలో విపరీతమైన రద్దీ నెలకొంది.
‘‘ప్రత్యేక రైళ్లల్లో ప్రయాణించడానికి ప్రజలు ఇష్టపడకపోవడానికి కారణం చార్జీలు ఎక్కువగా ఉండటం. అంతేకాక, ఆ రైళ్లు ఎన్ని గంటలకు బయలుదేరతాయి? ఎన్ని గంటలకు గమ్యస్థానం చేరతాయి? అన్నది ప్రశ్నార్థకంగా ఉంటుంది. అందుకే ప్రత్యేక రైళ్ల కంటే సాధారణ రైళ్లలో ప్రయాణించడానికే చాలామంది మొగ్గు చూపుతారు’’ అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు(ట్రాఫిక్) శ్రీ ప్రకాశ్ చెప్పారు.
ఆదివారం ముంబయిలో సీట్ల కోసం తొక్కిసలాట జరిగిన రైలు కూడా రెగ్యులర్ ట్రైనే.
ఇది అంత్యోదయ ఎక్స్‌ప్రెస్. ఇది రిజర్వేషన్ లేని ట్రైన్. అంటే కూర్చోవడానికి మాత్రమే సాధారణ సీట్లు ఉంటాయి.
అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులు కొన్ని గంటలపాటు కూర్చుని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. ఈ రైలులో స్లీపర్ బెర్త్‌లు లేవు.
“ప్రజలు ప్రయాణించాలనుకున్న రైలుకు సంబంధించిన టికెట్లను షరతులతో ముందుగానే కన్ఫర్మ్ చేయాలి. అలాగే, రద్దీని నివారించేందుకు అసలు ట్రైన్ తర్వాత, అదే గమ్యస్థానానికి చేరేలా మరో రైలును నడపాల్సి ఉంటుంది’’ అని శ్రీ ప్రకాష్ సూచించారు.
ప్రత్యేక రైళ్లతో ప్రయోజనమెంత?
పండుగల సమయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
‘‘ఈ సీజన్‌లో కూడా పశ్చిమ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు 2,500కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ రైల్వే కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రెండు రైల్వే జోన్‌ల ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది’’ అని పశ్చిమ రైల్వే ప్రతినిధి చెప్పారు.
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 3,150 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది.
దీంతో పాటు సాధారణ రైళ్లలో దాదాపు 60 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏర్పాట్లతో ఈ పండుగ సీజన్‌లో దాదాపు 2 లక్షల మంది అదనంగా ప్రయాణించగలరని అధికారులు చెప్పారు.
గత పండుగ సీజన్‌లో తాము 1,086 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు ఉత్తర రైల్వే ప్రతినిధి కుల్తార్ సింగ్ బీబీసీతో చెప్పారు.
“రైల్వే శాఖ ఆదేశాలతో, ఈసారి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం. వీటితోపాటు, డిమాండ్‌కు తగ్గట్టుగా అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని కుల్తార్ సింగ్ చెప్పారు.
అయితే, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, రైళ్లలో సీట్ల కోసం జనం ఎగబడటం ఆగట్లేదు.
అదనపు ఏర్పాట్లు ఏమేం ఉన్నాయి?
పండుగల సమయాల్లో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించడానికి, ప్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించడానికి ప్లాట్‌ఫాం టిక్కెట్ల అమ్మకాలను కూడా చాలా స్టేషన్లలో నిలిపివేస్తారు.
అంతేకాకుండా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూసేందుకు వీలుగా స్టేషన్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
పండుగలు, ఇతర రద్దీ సమయాల్లో భద్రతను పెంచుతున్నామని కూడా రైల్వే శాఖ చెబుతోంది.
అయినప్పటికీ, రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట అన్నది సాధారణంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
పండుగల సమయాల్లో రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరగడం ముంబయిలోనే మొదటిసారి కాదు.
గతేడాది కూడా గుజరాత్‌లోని సూరత్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. అప్పటి ఘటనలో ఒకరు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు.
కొన్ని సంవత్సరాల కిందట దీపావళి సమయంలో, దేశ రాజధాని దిల్లీ రైల్వే స్టేషన్‌లో పెద్ద ప్రమాదం జరిగింది.
2013లో కుంభమేళా సందర్భంగా అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగరాజ్) రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)