You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్ రైలు, 9 మంది మృతి...
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారని, మరో 25 మంది గాయపడ్డారని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ సీపీఆర్వో సబ్యసాచి తెలిపారు. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారిలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారు.
మృతుల కుటుంబాలకు రైల్వై మంత్రి ఎక్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి 50,00 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.
ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తెలుస్తోందని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయ వర్మ సిన్హా చెప్పారు. సిగ్నల్‌ను గమనించకుండా నిర్లక్ష్యంగా రైలును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అర్థం అవుతోందన్నారు.
అంతకుముందు ఘటనా స్థలంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జిల్లా అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ చెప్పారు.
‘‘కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. దానిని వెనుకవైపు నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు’’ అని ఆయన తెలిపారు.
స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని
ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులతో మాట్లాడానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నారని ప్రధాని చెప్పారు.
సహాయక చర్యలు జరుగుతున్నాయని, రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారని చెప్పారు.
డార్జిలింగ్ జిల్లా ఫన్సిదేవా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్సులతో పాటు సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారని ఆమె చెప్పారు.
ప్రమాదానికి గురైన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని నార్త్ బెంగాల్ రాష్ట్రీయ పరిబామన్ నిగమ్ (నీబీఎస్‌టీసీ) చైర్మన్ పార్థా ప్రతిమ్ రాయ్ తెలిపారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
లుమ్డింగ్ స్టేషన్ హెల్ప్ లైన్
03674263958
03674263831
03674263120
03674263126
03674263858
గువాహటి స్టేషన్ హెల్ప్ లైన్
03612731621
03612731622
03612731623
కటిహార్ హెల్ప్ లైన్
09002041952
9771441956
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)