కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: ఆ మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయంటే...

    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శుక్రవారం, 2023 జూన్ 2 సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో మూడు ట్రెయిన్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బాహానగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది.

ప్రమాదంలో షాలీమార్- చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఒక గూడ్స్ రైలు కూడా ఈ ప్రమాదం బారిన పడింది.

ప్రమాదంలో ఇప్పటికి 275 మంది మరణించారు. గాయపడ్డ వారి సంఖ్య వెయ్యి దాటింది.

ప్రమాదం కారణంగా 48 ట్రెయిన్లు రద్దు చేశారు. మరో 39 ట్రెయిన్లను దారి మళ్లించారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ఒక గూడ్స్ రైలును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

రైల్వే పరిభాషలో దీన్ని హెడ్ ఆన్ కొలీజన్ అంటారు. ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి.

ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో కొన్ని పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌ మీద యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది.

పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్ మీదికి దొర్లిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పెట్టెలు... అప్పుడే దానిపై వెళ్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాదం మరింత భయంకరంగా మారింది.

ఈ ప్రమాదం సౌత్ ఈస్ట్రన్ జోన్‌లోని ఖరగ్‌పూర్ డివిజన్ బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌పైన జరిగింది.

ఈ ప్రమాదం ఎలా జరిగిందో మరింత వివరంగా చూద్దాం.

ప్రమాదం ఎలా జరిగింది?

శుక్రవారం, జూన్ 2న హౌరాకు దగ్గరలోని షాలీమార్ స్టేషన్ నుంచి ట్రెయిన్ నంబర్ 12841 షాలీమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయానికే బయలుదేరింది.

23 బోగీలు ఉండే ఈ ట్రెయిన్ అప్‌లైన్‌లో బాలాసోర్, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడల మీదుగా చెన్నై చేరుకోవాలి.

మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఈ ట్రెయిన్ బయలుదేరింది. ముందుగా అది సంత్రాగాఛీ రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఆ తర్వాత, కేవలం 3 నిమిషాల ఆలస్యంతో ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.

సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఈ ట్రెయిన్ ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ దగ్గరుండే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌ను సమీపించింది.

బాహానగాలో ఈ ట్రెయిన్ ఆగదు. అయితే, అది ఈ స్టేషన్‌లో మెయిన్ లైన్ మీదుగా వెళ్లకుండా లూప్ లైన్ వైపు మళ్లింది. ఈ స్టేషన్‌లో లూప్ లైన్‌లో ఒక గూడ్స్ ట్రెయిన్ ఆగి ఉంది. చాలా వేగంగా వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ ట్రెయిన్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.

ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా దీని గురించి బీబీసీతో మాట్లాడారు. “సాంకేతిక లోపం కారణంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ట్రెయిన్ మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ మీదికి మళ్లి ఉంటుంది. అదే ఈ ప్రమాదానికి కారణం” అని ఆయనన్నారు.

గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులోని కొన్ని బోగీలు డౌన్ లైన్ మీదికి పడిపోయాయి. అదే సమయంలో అటు నుంచి వస్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను అవి ఢీకొట్టాయి.

అటు నుంచి వస్తున్న ట్రెయిన్‌తో ఢీ...

సరిగ్గా అదే సమయంలో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ఈ ప్రమాద స్థలాన్ని దాటుతోంది. 22 బోగీలు ఉన్న ఆ ట్రెయిన్ దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ ట్రెయిన్‌లోని చాలా భాగం ప్రమాద స్థలాన్ని దాటేసి ముందుకు వెళ్లింది.

అప్పుడే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. దాని బోగీలు కొన్ని పక్కకు దొర్లి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెనుక భాగాన్ని ఢీకొట్టాయి. దాంతో ఆ ట్రెయిన్‌లో కూడా 3 బోగీలు పట్టాలు తప్పాయి.

రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో, ప్రమాదం సాయంత్రం దాదాపు 7 గంటలకు జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో రెండు ట్రెయిన్లకు చెందిన దాదాపు 15 బోగీలు పట్టాలు తప్పాయన్నారు.

రైల్వే నిపుణుడు, రైల్వే బోర్డ్ మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్‌తో బీబీసీ మాట్లాడింది. ఈ ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే, ఇదో భారీ మానవ తప్పిదం అయి ఉంటుందని ఆయనన్నారు.

“ఏదైనా ట్రెయిన్ ఒక ట్రాక్ మీద ఆగిపోతే, ఆ ట్రాక్ మీదికి మరో ట్రెయిన్ ఏదీ రాకుండా నిరోధించడానికి పాయింట్ రివర్స్ ఇస్తారు. అలా చేసినప్పుడు ఆ ట్రాక్ మీదికి మరేదీ వెళ్లదు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల అలా జరగకపోతే, వెంటనే రెడ్ లైట్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు అటు నుంచి వచ్చే ట్రెయిన్ ఆగిపోతుంది.”

ట్రెయిన్‌ల వేగం

ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని దాదాపు 15 రోజుల కిందే పెంచారని, గరిష్ఠ వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లుగా నిర్ధరించారని శివ్ గోపాల్ మిశ్రా అన్నారు.

ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు దాదాపు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, యశ్వంత్‌పూర్ ట్రెయిన్ దాదాపు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని ఆయన తెలిపారు.

ఈ వేగం కారణంగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు భారీగా నష్టం జరిగింది. ఆ వేగం వల్లనే యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌కు చెందిన చాలా భాగం ప్రమాద స్థలాన్ని దాటి ముందుకు వెళ్లింది. దాని వెనుక భాగం మాత్రమే ప్రమాదానికి గురైంది.

ముఖ్య విషయం ఏంటంటే, ప్రమాదానికి లోనైన రెండు ట్రెయిన్‌లలోనూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్నాయి. జర్మనీలో డిజైన్ అయిన ‘లింకే హాఫ్‌మెన్ బుష్’ కోచ్‌లు ప్రమాదాలను తట్టుకునేలా సురక్షితంగా ఉంటాయని చెబుతారు.

రైల్వేకు చెందిన పాత ఐసీఎఫ్ డిజైన్‌తో పోలిస్తే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రమాదం జరిగినా ఒక దాని పైకి మరొకటి ఎక్కవు. కాబట్టి బోగీలు నుజ్జు నుజ్జయ్యే ప్రమాదం ఉండదు. దాంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుండదు.

కానీ ఒడిషా ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని చూసినప్పుడు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ గూడ్స్ రైలు మీదికి ఎక్కినట్టు కనిపిస్తోంది. ఇంజిన్ వెనుకున్న చాలా బోగీలు ఒకదానితో ఒకటి ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం కోసం రైల్వే అధికారులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ ఏ అధికారితోనూ మాట్లాడలేకపోయాం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)