క‌రోనావైర‌స్: ప్ర‌త్యేక రైళ్ల‌లో ఏం చేయొచ్చు? ఏం చేయ‌కూడ‌దు?

ఈ రోజు నుంచి కొన్ని ఎంపిక చేసిన‌ మార్గాల్లో ప్ర‌త్యేక రైళ్లు ప‌రుగులుతీయ‌బోతున్నాయి. ప్ర‌యాణికుల మ‌ధ్య‌ క‌రోనావైర‌స్ వ్యాప్తించ‌కుండా రైల్వే ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

తొలి రోజు 1.45 ల‌క్ష‌ల మంది ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌బోతున్న‌ట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 30 వ‌ర‌కు మొత్తంగా 25,82,671 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

వ‌ల‌స కూలీల కోసం మే 12 నుంచీ 30 ప్ర‌త్యేక‌ శ్రామిక్ రైళ్ల‌ను రైల్వే న‌డిపిస్తోంది. వాటికి అద‌నంగా ఈ 200 రైళ్లు ప‌రుగులు తీస్తాయి.

ప్ర‌త్యేక రైళ్ల‌లో ఏసీతోపాటు నాన్-ఏసీ కోచ్‌లు ఉంటాయి. జ‌న‌ర‌ల్ బోగీల్లోనూ కూర్చుని ప్ర‌యాణించేందుకు రిజ‌ర్వేష‌న్ చేయించుకోవాలి. అన్‌రిజ‌ర్వుడ్ బోగీలంటూ ఏమీ ఉండ‌వు.

మే 22 నుంచీ ఈ రైల్‌ టికెట్ల‌ బుకింగ్ మొద‌లైంది. అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ స‌మయాన్ని 30 రోజుల నుంచి 120 రోజుల‌కు పెంచారు.

ప్ర‌యాణికుల తొలిచార్ట్‌ను నాలుగు గంట‌ల ముందే సిద్ధంచేస్తారు. రెండో చార్ట్‌ను రెండు గంట‌ల ముందు సిద్ధంచేస్తారు. ఇదివ‌ర‌కు 30 నిమిషాల ముందే సిద్ధంచేసేవారు.

క‌రోనావైర‌స్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌త్యేక రైలు సేవ‌ల‌పై ఝార్ఖండ్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తంచేశాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల‌తో రైల్వే ప్ర‌తినిధులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు రైల్వే అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

ప్ర‌యాణ స‌మ‌యంలో ఏం చేయొచ్చు? ఏం చేయ‌కూడ‌దు?

  • ప్ర‌త్యేక‌ రైలు మొద‌ల‌య్యే స‌మ‌యానికి క‌నీసం 90 నిమిషాల ముందే ప్ర‌యాణికులు రైల్వే స్టేష‌న్‌కు చేరుకోవాలి.
  • కొంచెం త‌క్కువ ల‌గేజీని వెంట తెచ్చుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు రైల్వే సూచించింది. రైల్వే కూలీలు చాలా త‌క్కువ మంది మాత్ర‌మే అందుబాటులో ఉంటార‌ని, పైగా ల‌గేజీ త‌క్కువుంటే ప్ర‌యాణం సుల‌భంగా సాగుతుంద‌ని తెలిపింది.
  • ‌టికెట్ బుక్‌చేసుకున్నవారు మిన‌హా మ‌రెవ‌రూ ప్ర‌యాణించ‌కుండా చూసేందుకు ప్ర‌త్యేక త‌నిఖీ కేంద్రాలుంటాయి. అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా టికెట్ వెంట తెచ్చుకోవాలి. టికెట్ లేక‌పోతే స్టేష‌న్ లోప‌ల‌కు అనుమ‌తించ‌రు.
  • వీలైనంత‌వ‌ర‌కు ప్ర‌యాణికులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసేందుకు లోప‌ల‌కు వ‌చ్చే, బ‌య‌ట‌కు వెళ్లే మార్గాల‌ను విడివిడిగా ఏర్పాటుచేశారు. మార్గాల‌ను తేలిగ్గా గుర్తుప‌ట్టేందుకు ప్ర‌త్యేక గుర్తులు ఏర్పాటుచేశారు.
  • ప్ర‌యాణికులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను కొలిచే థెర్మల్ స్క్రీనింగ్ కేంద్రాల్లో త‌నిఖీలు చేయించుకోవాలి. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు లేన‌ట్లు తేలితేనే లోప‌ల‌కు పంపిస్తారు.
  • స్క్రీనింగ్‌లో క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. ప్ర‌యాణానికి అనుమ‌తించ‌రు. అంతేకాదు వారి టికెట్ డ‌బ్బుల‌ను తిరిగి ఇచ్చేస్తారు.
  • బీపీ, షుగ‌ర్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, రోగ నిరోధ‌క శ‌క్తి స‌మ‌స్య‌లుండేవారు, గ‌ర్భిణులు, ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుండేవారు, 65ఏళ్ల‌కు పైబ‌డిన‌వారు... త‌ప్ప‌ని‌స‌రి అయితేనే ప్ర‌యాణానికి రావాలి.
  • స్టేష‌న్‌లోకి వ‌చ్చేట‌ప్పుడు, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంటాయి. అంద‌రూ ప్ర‌యాణం మొత్తం ఫేస్‌మాస్క్ త‌ప్ప‌ని‌స‌రిగా వేసుకోవాలి.
  • ప్ర‌త్యేక రైళ్ల‌లో టికెట్ల‌ను త‌నిఖీలు చేసేవారితోపాటు ఇత‌ర సిబ్బంది కూడా ఉంటారు. ఏదైనా అవ‌స‌ర‌మైనా, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వారిని సంప్ర‌దించాలి.
  • మ‌రుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్ స‌హా ప్ర‌యాణికులు ఉప‌యోగించే అన్ని ప్రాంతాల‌నూ ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేస్తారు. ప్ర‌యాణికులు కూడా ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచాల‌ని రైల్వే అభ్య‌ర్థిస్తోంది.
  • ప్ర‌యాణికులకు ఎలాంటి లినెన్ లేదా దుప్ప‌ట్లు ఇవ్వ‌రు. ఎవ‌రివి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
  • రైల్వేలో కేట‌రింగ్‌, ఆహార విక్ర‌య కేంద్రాలు తెర‌చే ఉంటాయి. ఫుడ్‌ప్లాజాల్లో ఆహారాన్ని పార్సిల్ తీసుకొని వెళ్ల‌డానికి మాత్ర‌మే అనుమ‌తిస్తారు. అక్క‌డ తినే స‌దుపాయం ఉండ‌దు. అయితే ఎవ‌రి భోజ‌నం వారే తెచ్చుకుంటే మంచిద‌‌ని రైల్వే సూచిస్తోంది.
  • అంద‌రూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ప్ర‌త్యేక రైళ్ల‌కు సంబంధించి ఎలాంటి అన్‌రిజ‌ర్వుడ్ టికెట్లు విక్ర‌యించ‌రు.
  • క‌రోనావైర‌స్ వ్యాప్తి క‌ట్టడికి సంబంధిత‌ రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించిన నిబంధ‌న‌ల‌ను ప్ర‌యాణికులు అనుస‌రించాల్సి ఉంటుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)