తిర్హుత్ ప్రైవేటు రైల్వే: గాంధీ కోసం మూడో తరగతి బోగీలో టాయిలెట్, నెహ్రూ కోసం 'ప్యాలెస్ ఆన్ వీల్స్'

    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ కోసం

దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్' పట్టాలపై పరుగులు తీస్తోంది.

కానీ, భారత్‌లో స్వాతంత్ర్యం రాక ముందు నుంచే ఎన్నో ప్రైవేటు రైల్వే కంపెనీలు ఉండేవి.

తిర్హుత్ రైల్వే వాటిలో ఒకటి. దానిని దర్భంగా స్టేట్ నుంచి నడిపేవారు.

ఉత్తర బీహార్‌లో 1874లో భయంకరమైన కరవు వచ్చినప్పుడు దర్భంగా మహారాజు లక్ష్మీశ్వర్ సింగ్ తిర్హుత్ రైల్వే ప్రారంభించారు.

కరువు పీడితుల కోసం సరకులు తీసుకువచ్చిన ఆ మొదటి రైలు 1874 ఏప్రిల్ 17న వాజిత్‌పూర్ (సమస్తిపూర్) నుంచి దర్భంగా వరకూ నడిచింది.

దేశంలో మొదటి గూడ్స్ రైలు అదే. దానిలో ధాన్యం తీసుకొచ్చారు. తర్వాత వాజిత్‌పూర్ నుంచి దర్భంగా వరకూ ప్యాసింజర్ రైలు కూడా నడిపారు.

తిర్హుత్ రైల్వే ప్రారంభం

తిర్హుత్ రైల్వే భారత్‌లో రైలు ప్రయాణం మొదలైన రెండు దశాబ్దాల తర్వాత అంటే 1874లో ప్రారంభమైంది.

ఉత్తర బీహార్ అంతటా దీని మార్గాలు వ్యాపించి ఉండేవి.

దలసింగ్‌రాయ్-సమస్తిపూర్ లైనుతో 1875లో ప్రారంభమైన తిర్హుత్ రైల్వే 1912లో సమస్తిపూర్- ఖగడియా లైను వేసేవరకూ కొనసాగుతూ వచ్చింది.

బిహార్‌లోని సోన్‌పూర్ నుంచి అవధ్ (ఉత్తరప్రదేశ్‌ ప్రాంతం) బహ్రయిచ్ వరకూ రైల్వే లైను వేయడానికి 1882 అక్టోబర్ 23న బంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే ఏర్పాటు చేశారు.

ఈలోపు 1886లో అవధ్ నవాబు అక్రమ్ హుస్సేన్, దర్భంగా రాజు లక్ష్మీశ్వర్ సింగ్ ఇద్దరినీ రాజ వంశ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఆ తర్వాత 1886లో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు ఉండేలా అవధ్‌, తిర్హుత్ రైల్వేల మధ్య ఒప్పందం జరిగింది.

తర్వాత 1896లో ప్రభుత్వ రైల్వే, బెంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం తిర్హుత్ రైల్వే పనులను బెంగాల్, నార్త్ వెస్టర్న్ రైల్వే తమ చేతుల్లోకి తీసుకుంది.

యాత్రికుల కోసం స్టీమర్లు నడిచేవి

రైళ్లు నడపడం మొదలుపెట్టినపుడు గంగానదిపై వంతెన లేదు. దాంతో యాత్రికులను నదికి ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్లడానికి స్టీమర్ సేవలను కూడా ప్రారంభించారు.

తిర్హుత్ స్టేట్ రైల్వే దగ్గర 1881-82లో నాలుగు స్టీమర్లు ఉండేవి. అందులో రెండు పెడల్ స్టీమర్ రైళ్లు, రెండు క్రూ స్టీమర్లు.

దర్భంగా స్టేట్ దర్భంగాలో మూడు రైల్వే స్టేషన్లు నిర్మించింది.

ఒకటి ప్రజల కోసం హరాహీ(దర్భంగా), రెండోది ఆంగ్లేయుల కోసం లహెరియాసరాయ్‌, మూడోది రాజ భవనం నరగౌనా ప్యాలెస్ దగ్గర నిర్మించిన నరగౌనా టెర్మినల్.

అంటే నరగౌనా ప్యాలెస్ దగ్గరే రైల్వే స్టేషన్ ఉండేది. తర్వాత అది దర్భంగా లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం అధీనంలోకి వెళ్లింది.

తిర్హుత్ రైల్వే కంపెనీ సెలూన్

తిర్హుత్ రైల్వే యజమాని, దర్భంగా మహారాజు ఉపయోగించే సెలూన్‌ (ప్యాలెస్ ఆన్ వీల్స్)లో దేశంలోని ప్రముఖ నేతలందరూ ప్రయాణించారు.

ఆ సెలూన్‌లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మదన్ మోహన్ మాలవీయ్ నుంచి అందరూ వెళ్లారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సెలూన్ ఉపయోగించని ఒకే ఒక్క నేత గాంధీజీ మాత్రమే. ఆయన ఎప్పుడూ మూడో తరగతి బోగీలో ప్రయాణించేవారు.

తిర్హుత్ రైల్వే కంపెనీ దగ్గర పెద్ద లైన్, చిన్న లైన్ కోసం మొత్తం రెండు సెలూన్ లేదా ప్యాలెస్ ఆన్ వీల్ రైళ్లు ఉండేవి.

సెలూన్ అంటే నాలుగు బోగీలు ఉంటాయి. మొదటి బోగీలో డైనింగ్, బెడ్రూం, రెండో బోగీలో మహారాజు సిబ్బంది, మూడో పెట్టెలో పానిట్రీ, నాలుగో బోగీ అతిథుల కోసం ఉండేవి.

సెలూన్ రైలు ఫొటోల్లో నగిషీలు చెక్కిన ఒక బెడ్ కూడా కనిపిస్తుంది. దానికి వెండిపూత వేశారు. దానిపై దర్భంగా రాజ చిహ్నం చేప కూడా ఉంటుంది.

ఈ సెలూన్ పేరు నరగౌనా సూట్. ఇలాగే మహారాణికి కూడా రాంబాగ్ అనే సూట్ ఉండేది.

ఈ సెలూన్ల వాష్ రూంలో యూరోపియన్ కమోడ్, బాత్ టబ్‌లు కూడా ఉండేవి.

పెద్ద రైల్వే లైన్ సెలూన్ బరౌనీ(బెగుసరాయ్)లో ఉండేది. చిన్న లైన్ సెలూన్ నరగౌనా టెర్మినల్లో ఉండేది.

మహారాజు లేదా ఆయన అతిథులు ప్రయాణిస్తున్నప్పుడు ఈ సెలూన్ బోగీలను సాధారణ ప్రజలు వెళ్తున్న రైలు ఇంజనుకు జోడించేవారు.

గాంధీ కోసం మూడో తరగతిలో టాయిలెట్ ఏర్పాటు చేశారు.

"మూడో తరగతి బోగీల్లో టాయిలెట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రైల్వే తిర్హుత్ రైల్వే. నిజానికి గాంధీజీ తిర్హుత్ రైల్వే ప్యాసింజర్‌లో ఎక్కబోతున్నారనే విషయం తెలియగానే దర్భంగా మహారాజు రామేశ్వర్ సింగ్, ఆ రైల్లో టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని రైల్వేకు లేఖ రాశారు. ఆ తర్వాత మూడో తరగతిలో టాయిలెట్ ఏర్పాటు చేశారు. దానిని గాంధీజీతోపాటు ప్రజలు కూడా ఉపయోగించడం ప్రారంభించారు. తర్వాత మూడో తరగతి బోగీల్లో ఫ్యాన్లు కూడా వేశారు. అంటే, చాలా తక్కువ ధరకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించిన ఘనత తిర్హుత్ రైల్వేకు దక్కుతుంది" అని దర్భంగా రాజ కుటుంబానికి చెందిన కుముద్ సింగ్ చెప్పారు.

తిర్హుత్ రైల్వే అవశేషాలు ఇప్పుడు కనిపించవు

1950లో రైల్వేను జాతీయీకరణ చేశారు. కానీ, ఫొటోల్లో మనకు సంపన్నంగా కనిపించిన ఈ రైల్వే బోగీలు ఇప్పుడు కనుమరుగైపోయాయి.

"అవి మా కళ్ల ముందే పాడైపోయాయి. తిర్హుత్ రైల్వే వేసిన రైల్వే లైన్లను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. దర్భంగా సహర్సా లైన్ తిర్హుత్ రైల్వే వేసిందే. అది 1934లో భూకంపంలో ధ్వంసమైంది. మళ్లీ వేయలేదు. దాంతో రాకపోకలకు ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు" అని స్థానిక జర్నలిస్ట్ శశి మోహన్ చెప్పారు.

దీనిపై మాట్లాడిన కుముద్ సింగ్ "1973లో బరౌనీలో ప్యాలెస్ ఆన్ వీల్ ఆగినప్పుడు, దాన్ని దోచుకుని బోగీలకు నిప్పుపెట్టారు. 1982లో నరగౌనాలో ఉన్న 'ప్యాలెస్ ఆన్ వీల్‌'ను తుక్కు కింద అమ్మేశారు. దాన్నుంచి చాలా కిలోల వెండి దొరికిందని దాన్ని కొన్న కుటుంబం తర్వాత చెప్పింది. అలా మా చరిత్ర, వారసత్వాన్ని ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి. మేం ఒకప్పుడు ప్రజలకు అనువుగా రైల్వే మోడల్ తయారు చేస్తే, దాన్ని లాక్కున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజావ్యతిరేకంగా ఖరీదైన తేజస్ రైలు నడుపుతోంది. తేజస్‌ను చూస్తుంటే మాకు పుండుపై కారం చల్లినట్టుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)