You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ బిహార్ అమ్మాయి జీతం కోటి రూపాయలు
- రచయిత, మనిష్ శాండిల్య
- హోదా, పట్నా, బీబీసీ
ఈమె వయసు 25 ఏళ్లు. నెల జీతం రూ. 9 లక్షలు. అంటే ఏడాదికి కోటికి పైమాటే. నమ్మలేకపోయినా ఇది నిజం.
బిహార్‌కు చెందిన మధుమిత కుమార్ రూ.కోటికి పైగా వేతన ప్యాకేజీతో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం దక్కించుకున్నారు.
ఈమె సోమవారమే.. గూగుల్‌లో టెక్నికల్ సొల్యూషన్ ఇంజినీర్‌గా చేరారు.
ఈ ఉద్యోగానికంటే ముందు ఆమె బెంగళూరులోని ఏపీజీ కంపెనీలో పనిచేశారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ కంపెనీలు కూడా మధుమితకు జాబ్ ఆఫర్ చేశాయని ఆమె తండ్రి సురేంద్ర శర్మ తెలిపారు.
పుత్రికోత్సాహం
అగ్రశ్రేణి కంపెనీలో భారీ వేతనంతో మధుమిత ఉద్యోగం దక్కించుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మధుమితను ఇంజినీరింగ్‌లో చేర్పించడానికి ఆమె తండ్రి మొదట ఇష్టపడలేదు.
'ఇంజినీరింగ్ అమ్మాయిలకు పెద్దగా నప్పదని అనుకున్నా. అయితే, అమ్మాయిలు కూడా ఈ రంగంలోకి రావడంతో నా అభిప్రాయం మార్చుకున్నా. మా అమ్మాయిని కూడా ఇంజినీరింగ్‌లో చేర్పించా.' అని మధుమిత తండ్రి సురేంద్ర శర్మ తెలిపారు.
ఈయన సోన్‌పూర్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
వీరి కుటుంబం పట్నాకు సమీపంలోని కహుగల్‌లో ఉంటోంది.
కలాం స్ఫూర్తితో...
జైపూర్‌లోని ఆర్యా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి 2014లో మధుమిత కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ప్లస్ టూ వరకు పట్నాలో వాల్మీలోని డీఏవీ స్కూల్లో చదువుకున్నారు.
'మా కుటుంబంలో, చెప్పాలంటే మా వంశంలోనే విదేశాలకు వెళ్లిన మొదటి వ్యక్తి మధుమితే. తను ఇదే ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి అమెరికా వెళ్లింది'.. అంటూ మధుమిత మొదటి ప్రయాణం గురించి ఆమె తండ్రి గుర్తు చేసుకున్నారు.
'మిగతా ఇళ్లల్లోలాగే మా ఇంటి నుంచి కూడా విదేశానికి వెళ్లడం చాలా పెద్ద విషయమే. తను వెళ్లినప్పుడు మాలో అందరికీ ఎవరో ఒకరు విదేశాలు చుట్టొచ్చారన్న ఆనందం కలిగింది.' అని తెలిపారు.
కానీ వేల కిలోమీటర్ల దూరంలో తన కూతురు ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే దిగులు ఇప్పుడు వారిని వెంటాడుతోంది.
భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అంటే మధుమితకు చాలా ఇష్టమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మధుమిత ఇంజినీరింగ్ వైపు వెళ్లిందని సురేంద్ర తెలిపారు.
'అబ్దుల్ కలాంను మధుమిత స్ఫూర్తిగా తీసుకుంన్నారు. కలాం పుస్తకాలు, ఆయన జీవితచరిత్రను చాలా ఇష్టంగా చదివేవారు' అని సురేంద్ర అన్నారు.
కలెక్టర్ కావాలనుకున్నారు..
లెక్కలు, భౌతిక శాస్త్రం అంటే ఇష్టపడే మధుమిత స్కూల్ రోజుల్లో డిబేట్ కాంపిటీషన్లలోనూ పాల్గొనేవారు. చిన్నప్పుడు ఐఏఎస్ కావాలనుకున్నారు.
అయితే, 2010లో ప్లస్ 2 పూర్తి చేశాక ఇంజినీరింగ్‌లో చేరారు.
'మధుమితకు పన్నెండో తరగతిలో 86 శాతం మార్కులొచ్చాయి. దేశంలోని మంచి కాలేజీల్లో చేర్పించడానికి ఇన్ని మార్కులను యావరేజిగానే భావిస్తారు. అయినా బోర్డ్ పరీక్షల్లో మంచి మార్కులు రాకపోయినా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని ఆమె విజయం మరోసారి నిరూపించింది' అని ఆమె తండ్రి సంతోషంగా చెప్పారు.
సురేంద్ర శర్మ పెద్ద కూతురు ప్రస్తుతం ఎంబీబీఎస్ చేస్తున్నారు. కొడుకు హిమాంశు శేఖర్ బెంగళూరులో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
మధుమిత కంటే ముందు బిహార్‌కు చెందిన వాత్సల్య సింగ్.. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏడాదికి రూ.కోటి 20 లక్షల వేతనంతో చేరారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమెకు ఈ ఉద్యోగం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)