You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుణె యాక్సిడెంట్: ఏపీకి చెందిన లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో భారీ ప్రమాదం, నలభైకి పైగా వాహనాలు నుజ్జునుజ్జు
- రచయిత, మానసి దేశ్‌పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుణె-బెంగళూరు హైవేపై నవాలే బ్రిడ్జి దగ్గర ఆదివారం రాత్రి అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన లారి ముందున్న కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 30కి పైగా కార్లు దెబ్బతిన్నాయి. 10మంది గాయపడ్డారు.
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రమాదం జరిగింది.
అయితే, ఈ ప్రమాదంలో 48 కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయని, 30 మంది వరకు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
స్థానికుల సహకారంతో పీఎంఆర్‌డీఏ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు.
నావల్ బ్రిడ్జి ప్రాంతాన్ని ప్రమాదాలు జరిగే ప్రాంతంగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షులు కొందరు పంపిన వీడియోలు, ఫొటోలను చూస్తే అక్కడ ప్రమాద తీవ్రత అర్ధమవుతుంది.
ఆదివారం రాత్రి ఏం జరిగింది?
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నావేల్ వంతెనపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కార్లను ఢీకొట్టింది.
ముంబయి నుండి కత్రాజ్‌కి తన ప్యాసింజర్ కారుతో ప్రయాణిస్తున్న డ్రైవర్ పాండురంగ్ ప్రమాదం జరిగిన తీరును బీబీసీకి వివరించారు.
"అరగంట నుంచి అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. నేను నా కారును ఆపానో లేదో, కార్లు ఢీకొనడం కనిపించింది. వెనక నుంచి వచ్చిన లారీ కార్లను ఢీకొడుతూ వెళ్లింది. అలా 15-20 కార్లను ఢీకొట్టడం నేను చూశా" అని ఆయన వివరించారు.
"నా కారులో ప్రయాణికులు ఉన్నారు, మమ్మల్ని మేం రక్షించుకోవడానికి కారును పక్కకు తీసుకెళ్లాను. నా కారులో ఉన్న వారెవరూ గాయపడలేదు. కార్లన్నీ పోగుపడ్డాయి" అని పాండురంగ్ చెప్పారు.
పుణె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ ఇచ్చిన సమాచారం మేరకు ఓ లారీ అతివేగంతో వచ్చి కార్లను ఢీకొట్టింది.
"బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా లారీ వేగంగా దూసుకువచ్చింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనిపై విచారణ చేస్తున్నాం”అని సుహైల్ శర్మ చెప్పారు.
ఈ ప్రమాదానికి కారణమైన లారీకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేట్ ఉంది.
నావేల్ బ్రిడ్జి ప్రాంతంలో రోడ్డు చాలా వంపులో ఉందని, వాహనాలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది.
పుణె అగ్నిమాపక దళం అందించిన సమాచారం ప్రకారం, ఈ లారీ ఢీకొనడంతో మొత్తం 48 వాహనాలు దెబ్బతిన్నాయి.
అందులో 24 కార్లు ఉన్నాయని సుహైల్ శర్మ తెలిపారు. ఢీకొన్న కార్లు చాలా వరకు నుజ్జునుజ్జుయ్యాయి. స్థానికుల సహాయంతో అధికారులు కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
"ట్రక్కు ఢీకొన్న తర్వాత, 5 నిమిషాల్లో నేను సంఘటనా స్థలానికి చేరుకున్నాను. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడం ప్రారంభించాను. చాలామంది ప్రజలు గందరగోళ స్థితిలో ఉన్నారు. అంతా హఠాత్తుగా జరిగిపోయింది. నేను దెబ్బతిన్న కార్లు ఎన్నో లెక్కించాను. 40 కంటే ఎక్కువే ఉన్నాయి" అని ప్రమాద స్థలంలో ఉన్న ఒక స్థానికుడు శశికాంత్ బీబీసీతో అన్నారు.
ఈ ప్రాంతంలో ఇంతకు ముందు 4, 5 భారీ ప్రమాదాలు జరిగాయని శశికాంత్ వెల్లడించారు. సతారా నుండి ముంబైకి వెళ్లే మార్గంలో, కొత్తగా నిర్మించిన కత్రాజ్ సొరంగం దాటిన తర్వాత ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
నవాలే బ్రిడ్జి చౌక్, భూమ్‌కర్ నగర్ ఏరియాలను ప్రమాద ప్రాంతాలని స్థానికులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఫిపా వరల్డ్ కప్ 2022: ఖతార్ అత్యంత ధనిక దేశాల జాబితాలో ఎలా చేరింది? ఇవీ 3 కారణాలు...
- టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎవరు? చంద్రబాబు నాయుడు ‘చివరి ఎన్నికలు’ అస్త్రం ఆయనదేనా?
- సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
- హైదరాబాద్లో కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
- పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)