You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'మేం అలసిపోయాం, మా అసలు భయం అది కాదు', ఇరాన్ ప్రజల్లో ఆందోళన
- రచయిత, తరనెహ్ ఫతాలియాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోయారు'' అని ఇరాన్‌కు చెందిన సిరౌస్ అన్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరును మార్చాం.
తన స్వస్థలం తెహ్రాన్ నుంచి ఆయన బీబీసీతో మాట్లాడారు.
'' ఈ యుద్ధమంతా ప్లాన్ చేసుకుని కావాలని చేసినట్లు అనిపించింది'' అని సిరౌస్ అన్నారు.
''ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు వచ్చి సైనిక, అణు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరాన్ వెళ్లి అమెరికా స్థావరాలపై కొన్ని మిసైళ్లతో దాడి చేసింది. ఇక, ఇప్పుడు రెండు వర్గాలు సంతృప్తి చెందాయి. కానీ, ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది, బాధపడింది ఎవరంటే ఇరాన్ ప్రజలే.''
ఇరాన్ - ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత, భావోద్వేగాల సంఘర్షణకు గురైన లక్షలాది మంది ఇరానియన్లలో సిరౌస్ ఒకరు.
రెండు దేశాలు 12 రోజుల పాటు దాడులు చేసుకున్న తర్వాత కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది.
ఈ దాడుల్లో 606 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు. అయితే, మరణాల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని స్వతంత్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ యుద్ధం ఇరాన్ ప్రజల్లో భయాన్ని, ఆందోళనను, మరికొందరిలో ఆశను రేకెత్తించింది.
కొందరు తమ భద్రత, దేశ భవిష్యత్ విషయంలో ఆందోళన చెందితే.. మరికొందరు ఈ సంక్షోభం నిజమైన రాజకీయ మార్పుకు దారితీయనుందా? అని యోచిస్తున్నారు.
సిరౌస్ మాదిరిగానే మినూ కూడా ఇరాన్ ప్రజలపై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
మినూ పేరును కూడా భద్రతా కారణాల రీత్యా మార్చాం.
'' నన్ను నిజంగా ఏం భయపెడుతోందంటే.. యుద్ధం సృష్టించే విధ్వంసం, ఆంక్షలు, చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ.. ఇదంతా ప్రభుత్వాల దురాశ వల్లే'' అని ఆమె అన్నారు.
''మేం మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మా జీవితాలు, మా డబ్బుతో. మేం ఇంకా మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం.
మేం, ఇరాన్ ప్రజలం అలసిపోయాం. మాకు యుద్ధం వద్దు. మాకు ఈ ఆంక్షలు వద్దు. మాకు ఈ కాల్పుల విరమణ కూడా వద్దు. మేం కోరుకునేదల్లా.. మేం ఎంతో ప్రేమించే ఈ దేశంలో మనశ్శాంతితో జీవించడం'' అని మినూ చెప్పారు.
'' యుద్ధం, కాల్పుల విరమణ కంటే నన్ను ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే.. గాయపడిన, అవమానపడిన ఇస్లామిక్ రిపబ్లిక్. అమెరికాపై గెలవలేకపోయారు. ఇక ఇప్పుడు ఇరాన్ ప్రజలపై పడతారు. ఉరిశిక్షలు, వేధింపులను రెట్టింపు చేస్తారు'' అని ఆమె అన్నారు.
2022లో విస్తృతంగా వ్యాపించిన ఆందోళనలను అణచివేసేందుకు, అసమ్మతిని అరికట్టేందుకు ఇరాన్ అధికారులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
గత ఏడాది ఇరాన్‌లో సుమారు 901 మందికి ఉరిశిక్ష వేసినట్లు యూఎన్ మానవ హక్కుల విభాగం చీఫ్ చెప్పారు.
రిపోర్టింగ్ విషయంలో, ఆ దేశ ప్రభుత్వ ఆంక్షలతో ఇరాన్ నుంచి బీబీసీ జర్నలిస్టులు రిపోర్ట్ చేయలేకపోయారు.
బీబీసీ పర్షియన్‌కు అక్కడ ఆఫీసు లేదు. వాట్సాప్, టెలిగ్రామ్ చానల్ ద్వారానే అక్కడి ప్రజలతో బీబీసీ మాట్లాడింది.
యుద్ధం వల్ల ఏర్పడిన నష్టాన్ని కూడా ప్రజలే భరించాల్సి ఉంటుందని, ప్రభుత్వాలు కావని మెహ్దీ బీబీసీతో అన్నారు.
'' ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై కాకుండా.. మిలిటరీ, అణు సామర్థ్యాలను తిరిగి అభివృద్ధి చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.''
'' ప్రజలకు తాత్కాలికంగా స్వేచ్ఛను ఆఫర్ చేయొచ్చు. కానీ, అదెంతో కాలం ఉండదు.'' అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇరుదేశాలు ఆరోపణలు చేసుకున్నాయి.
ఇరాన్‌లో ఉత్తరంగా ఉన్న మజాందరన్ ప్రావిన్స్‌లో పేలుడు శబ్దాలు వినిపించాయి.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, తాను యాంగ్జైటీ, గందరగోళానికి గురైనట్లు సారా (అసలు పేరు కాదు) చెప్పారు.
''కాల్పుల విరమణను నేను నమ్మలేదు, వారి వల్ల అలాంటివి జరగవు'' అని అన్నారు.
బీబీసీతో మాట్లాడిన ఇతరులు కూడా కాల్పుల విరమణ సాధ్యాసాధ్యాలపై ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
'' ఈ ఒప్పందం కచ్చితంగా ముగిసిపోతుంది'' అని అర్మాన్ అన్నారు. ఇది ఆయన అసలు పేరు కాదు.
''ఇజ్రాయెల్ తన లక్ష్యాలను ఇంకా సాధించలేదు.. ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది'' అని అభిప్రాయపడ్డారు.
'' ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ బంకర్ నుంచి బయటికి వచ్చేందుకు ఈ కాల్పుల విరమణ ఒక ఉచ్చు'' అని కియాన్ చెప్పారు.
ఏ ఉద్దేశం లేకుండా ఇజ్రాయెల్, అమెరికాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవని ఆయన అన్నారు.
ఈ సంధి ఎక్కువ కాలం ఉంటుందని తాను అనుకోవడం లేదని, త్వరలోనే ఇది ముగిసిపోతుందని చెప్పారు.
'' కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగియదు. ప్రభుత్వ పతనంతో అది ముగుస్తుంది'' అని అన్నారు.
ఈ సంధి అనిశ్చితంగా ఉండటంతో.. కాల్పుల మోత వినిపించకుండా ఆకాశంలో ఈ నిశ్శబ్ద వాతావరణం ఎంతకాలం ఉంటుందా? అని ప్రజలు చూస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)