You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ తొలి సుప్రీం లీడర్ మూలాలు భారత్‌లో.. ఇస్లామిక్ రివల్యూషన్ సమయంలో ‘ఇండియన్ ఏజెంట్’గా ముద్ర
- రచయిత, రాకేశ్ భట్
- హోదా, బీబీసీ మానిటరింగ్
ఇరాన్ తొలి సుప్రీం లీడర్, ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ వ్యవస్థాపకుడు అయతుల్లా రూహుల్లా ఖుమేనీ పూర్వీకులు భారత్‌కు చెందినవారు.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్‌కు పితామహుడిగా పిలిచే అయతుల్లా రూహుల్లా ఖుమేనీ తాత ‘సయ్యద్ అహ్మద్ ముసావీ హిందీ’ భారత్‌లోని ఒక చిన్న గ్రామంలో 1790 ప్రాంతంలో జన్మించారు.
రూహుల్లా ఖుమేనీ తాతకు 40 ఏళ్ల వయసున్నప్పుడు అవధ్ నవాబుతో కలిసి ఆయన ఇరాక్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు.
అక్కడి నుంచి ఇరాన్‌లో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి, ఇరాన్‌లోని ఖొమైన్ అనే గ్రామంలో స్థిరపడ్డారు.
కానీ, తన భారతీయ మూలాలు గుర్తు చేసుకునేలా ఇంటి పేరులో 'హిందీ'ని కొనసాగించారు. ఆయన కొడుకు ‘అయతుల్లా ముస్తాఫా హిందీ’ ఇస్లాంకు సంబంధించి గొప్ప పండితుల్లో ఒకరిగా మారారు.
‘ముస్తాఫా హిందీ’ చిన్న కొడుకు రూహుల్లా అయతుల్లా 1902లో జన్మించారు. ఆ తర్వాత ఆయన అయతుల్లా ఖుమేనీగా ఇమామ్ ఖుమేనీగా ప్రాచుర్యం పొందారు.
ఇస్లామిక్ రిపబ్లిక్
రూహుల్లా జన్మించిన ఐదు నెలలకు ఆయన తండ్రి సయ్యద్ ముస్తాఫా హిందీ హత్యకు గురయ్యారు.
ముస్తాఫా హిందీ మరణించడంతో రూహుల్లాను ఆమె తల్లి, అత్తయ్య పెంచారు. ఆయన తన పెద్దన్న ముర్తాజా పర్యవేక్షణలో ఇస్లామిక్ విద్య నేర్చుకున్నారు.
రూహుల్లా ఖుమేనీకి ఇస్లామిక్ న్యాయశాస్త్రం, షరియాపై ప్రత్యేక ఆసక్తి ఉంది. దీంతో పాటు ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు.
ఇరాన్ నగరాలు అరాక్, ఖోమ్‌లలో ఇస్లామిక్ విద్యా సంస్థలలో చదువుకోవడమే కాకుండా అక్కడ బోధించారు కూడా. ఆ సమయంలో ఆయన రాచరిక వ్యవస్థను వ్యతిరేకించడం ప్రారంభించారు.
దానిస్థానంలో విలాయత్-ఎ-ఫకీహ్ (మతనాయకుడి సార్వభౌమాధికారం)గా పిలిచే వ్యవస్థను సమర్థించడం మొదలుపెట్టారు.
పహ్లావి సుల్తాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఆయన్నుఇరాన్ నుంచి బహిష్కరించారు.
మరోవైపు ఇరాన్ ప్రజలు రూహుల్లా ఖుమేనీని తమ నేతగా అంగీకరించారు.
ఖుమేనీ నాయకత్వంలో ప్రజలు, ఇతర ప్రతిపక్ష రాజకీయ గ్రూప్‌లు ఏకమయ్యాయని పహ్లావి పాలన గుర్తించింది.
దీంతో ఖుమేనీని భారతీయ, బ్రిటిష్ ఏజెంట్‌గా చూపించేందుకు 1978 జనవరి 7న ఇత్తెలాత్ వార్తా పత్రిక.. ఖుమేనీని భారతీయ సంతతికి చెందిన ' ముల్లా' గా పేర్కొంది.
బ్రిటిష్-ఇండియన్ కాలనీకి చెందిన బంటుగా ఖుమేనీని పేర్కొంది.
ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఇరాన్ రివల్యూషన్ మరింత తీవ్రమైంది. ఎంత అణచివేయాలని చూసినా, ప్రజలు వీధుల్నే తమ ఇళ్లగా మార్చుకున్నారు.
ఈ విప్లవం ముగిసేలా లేదని గుర్తించిన తర్వాత పహ్లావి రాజ్యానికి చెందిన రెండో రాజు ఆర్యమెహర్ మొహమ్మద్ రెజా పహ్లావి 1979 జనవరి 16న దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత 15 రోజులకు ఖుమేనీ సుమారు 14 ఏళ్ల తర్వాత 1979 ఫిబ్రవరి 1న ఇరాన్‌కు తిరిగి వచ్చారు.
ఖుమేనీ ఇరాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత రాచరిక వ్యవస్థ స్థానంలో ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించారు.
ఖుమేనీ సూఫీ దృక్ఫథం
తన రాజకీయ జీవితంలో ఖుమేనీ ప్రత్యేక గుర్తింపు పొందారు. 'తూర్పు దేశాలతో, పశ్చిమ దేశాలతో సంబంధం లేదు, ఇస్లామిక్ రిపబ్లిక్‌తో మాత్రమే మాకు సంబంధం', ' అమెరికాకు కూడా ఎలాంటి అధికారం లేదు' వంటి కీలకమైన వ్యాఖ్యలను చేసేవారు.
రూహుల్లా హిందీ పేరుతో ఇర్ఫానా గజల్స్‌ను ఆయన రాసేవారు.
తన గజల్స్‌లో సాకి, వైన్, మద్యం, విగ్రహం ఆయన ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా పరిగణించే వారు.
1980 జులై 27న ఇరాన్ చక్రవర్తి ఆర్యమెహర్ మొహమ్మద్ రెజా పహ్లావి దేశానికి దూరంగా తన చివరి శ్వాసను విడిచారు.
ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 1989 జూన్ 4న అయతుల్లా రూహుల్లా ఖుమేనీ కూడా మృతి చెందారు.
రుహోల్లా మరణం తర్వాత సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ
86 ఏళ్ల వయసులో సుప్రీం లీడర్ రుహోల్లా ముసావి ఖమేనీ మరణం తర్వాత, 1989లో ఆయన వారసుడిగా అయతొల్లా అలీ ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు.
అయతొల్లా అలీ ఖమేనీ 1939లో ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో పుట్టారు.
షా మొహమ్మద్ రెజా పహ్లావికి వ్యతిరేకంగా రుహోల్లా అయతొల్లా ఖమీని ప్రారంభించిన మత పోరాటంలో 1962లో అయతొల్లా అలీ ఖమేనీ కూడా చేరారు.
రుహోల్లాకు అయతొల్లా అలీ ఖమేనీ శిష్యుడయ్యారు. ఈరోజు తాను చేసే, నమ్మే ప్రతీది కూడా ఇస్లాంకు చెందిన ఖమేనీ దార్శనికత నుంచే వచ్చిందని అయతొల్లా అలీ ఖమేనీ చెబుతుంటారు.
షాకు వ్యతిరేకంగా ఆయన చురుకుగా పోరాటం చేశారు. పలుసార్లు జైలు పాలయ్యారు.
1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత, రాజధాని తెహ్రాన్‌లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నిమమితులయ్యారు. మధ్యంతర ప్రభుత్వంతో పాటు పాలనను సాగించే రివల్యూషనరీ కౌన్సిల్‌కు కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉప రక్షణ మంత్రి అయ్యారు. ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)ని నిర్వహించేందుకు ఈ పదవి సాయపడింది. ఇది ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థలలో ఒకటిగా మారింది.
అనంతరం 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
(ఆధారం: 2014 జూన్‌లో ‘బీబీసీ హిందీ’ ప్రచురించిన కథనం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)