You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పల్నాడు టూర్: జగన్ పర్యటనలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారంటూ వివాదం, ఎవరి వాదన ఏంటి?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు పదే పదే వివాదాస్పదం కావడం చర్చనీయాంశమవుతోంది.
సత్తెనపల్లిలో జగన్ పర్యటనపై పల్నాడు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు.
ఆంక్షలు విధించడంపై జిల్లా ఎస్పీ కె.శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.
ఈ పర్యటన గురించి తమకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.
‘‘జగన్ వెంట అసలు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాల్లో వస్తున్నారు అనే కనీస సమాచారం ఇవ్వలేదు. మాకున్న సమాచారం మేరకు 30వేలమందికి వంటలు చేయిస్తున్నారని తెలిసింది. ఆ ఇంటి ముందు ఉన్న రోడ్డు 10 అడుగులు మాత్రమే ఉంది. వాహనాలు తిరగలేవు. అందుకే మాజీ సీఎంగా సెక్యూరిటీ కాన్వాయ్‌తో పాటు మూడు వాహనాలు, వందమందికి మాత్రమే మేము సెక్యూరిటీ ఇవ్వగలం" అని ఎస్పీ శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.
గత ఏడాది చనిపోయిన వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడకు వెళుతున్నారు.
అయితే, తమ ఆంక్షలను ఉల్లంఘించి భారీ జనసందోహంతో వస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన ఘటన దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నారా అన్న వాదనలపై పోలీసులు స్పందించ లేదు.
పొదిలిలో ఏం జరిగింది?
ఏడాది కాలంగా వై.ఎస్. జగన్ పర్యటనల్లో తోపులాటలు, గలాటాలు, టీడీపీ శ్రేణుల నిరసనలు వంటి ఘటనలు చోటుచేసుకోగా ఈనెల 11న పొదిలి పర్యటనలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపాయి.
గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తోన్న పొగాకు రైతులకు సంఘీభావం తెలిపేందుకు జగన్ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లారు. ఇదే సందర్భంలో అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు నల్లబెలూన్లతో నిరసన చేపట్టారు.
దీంతో వైసీపీ శ్రేణులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ రాళ్ల వర్షం కురిపించారు. చెప్పులు విసిరేశారు.
ఈ దాడుల్లో పలువురు మహిళలతో పాటు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు కూడా గాయపడ్డారు.
‘‘ పలువురు పోలీసులకు గాయాలయ్యాయి'' అని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బీబీసీతో చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించి 15మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తెనాలి పర్యటనలోనూ వివాదం
పోలీసులపై దాడి చేశారంటూ ముగ్గురు యువకులను గత నెలాఖరులో తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీద కొట్టడం వివాదాస్పదమైంది.
ఆ ముగ్గురు యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ తెనాలి వెళ్లినప్పుడు టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రౌడీషీటర్లకు ఎలా మద్దతు తెలుపుతారంటూ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే అక్కడ పోలీసులు ముందుగానే నిరసనకారులను అడ్డుకుని జగన్ కాన్వాయ్‌కి రూట్ క్లియర్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోలేదు.
ఏడాది కాలంలో వై.ఎస్. జగన్ పర్యటించిన ప్రతి సందర్భంలోనూ వివాదం రేగింది.
2025 ఏప్రిల్‌లో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు హెలికాప్టర్‌లో శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడుకు వెళ్లిన వై.ఎస్. జగన్ పర్యటన ముగించుకుని తిరిగి అదే హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లాలని భావించారు.
అయితే ఒక్కసారిగా హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన జనం తాకిడికి హెలికాప్టర్ అద్దాలు (విండ్ షీల్డ్‌లు) ధ్వంసం అయ్యాయి.
దీంతో హెలికాప్టర్‌ను ప్రయాణానికి వినియోగించలేమని పైలట్లు స్పష్టం చేయడంతో ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.
హెలికాప్టర్‌పై దాడి ఘటన సంచలనం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కేసు విచారణ కొనసాగుతోంది.
2025 ఫిబ్రవరిలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వై.ఎస్. జగన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన భద్రతకు సంబంధించి వివాదం రేగింది. ఆ సమయంలో జనం జగన్‌ను చుట్టుముట్టారు. తొక్కిసలాట జరిగింది.
పోలీసులు వైఫల్యం వల్లనే తొక్కిసలాట జరిగిందని, జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు.
2024 జూలై 19న వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన వెళ్లారు. అయితే ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరిన ఆయన సాయంత్రం నాలుగున్నరకి వినుకొండకు చేరుకున్నారు.
పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే వై.ఎస్. జగన్ పర్యటన ఆలస్యమైందని వైసీపీ ఆరోపించింది.
అయితే, ఈ రెండు ఘటనలలో తమపై వచ్చిన ఆరోపణలను అప్పట్లో పోలీసులు ఖండించారు.
‘జనాదరణ తగ్గలేదని చెప్పడానికే ఇలా చేస్తున్నారా?’
ఎన్నికల్లో ఓడిపోయినా, వై.ఎస్. జగన్‌కు ప్రజాదరణ తగ్గలేదని చూపించుకునేందుకు కావాలనే వైసీపీనేతలు జగన్ పర్యటనలకు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
హోంమంత్రి అనిత కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.
‘‘తెనాలిలో రౌడీషీటర్లను పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్లారంటే పరిస్థితి అర్ధం చేసుకోండి. పొదిలిలో ధర్నా చేస్తున్న మహిళా ఆందోళనకారులపై తన మనషులతోనే రాళ్లు వేయించి, అసభ్య పదజాలంతో దూషించి, అక్కడ అలజడి చెలరేగేలా చేయించింది జగన్ మోహన్ రెడ్డే’’ అని హోంమంత్రి అనిత విమర్శించారు.
అయితే దీనిని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.
"జగన్‌కు సరైన భద్రత కల్పించకుండా ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెడుతోంది. ఆయన పర్యటనలకు జనాదరణ ఉంటుందని తెలిసి కూడా టీడీపీ మూకలను పంపించి గొడవలు చేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యమే" అని వైసీపీ నేత, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ బీబీసీతో ఆన్నారు.
ఇప్పుడు పల్నాడు జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టడం దారుణమని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మీడియాతో అన్నారు.
ప్రజలు జగన్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా వస్తుంటే తామెలా అడ్డుకోగలమని ఆయన ప్రశ్నించారు.
పొదిలిలో 950మంది పోలీసులతో సెక్యూరిటీ: ఎస్పీ
జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే నిబంధనల మేరకు కేటాయించాల్సిన సిబ్బంంది కంటే ఎక్కువ మందితో జగన్‌కు భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
"పొదిలి పర్యటనకు 950మంది పోలీసులతో మేం భద్రత కల్పించాం. ఆ పర్యటనలో పోలీసులు, టీడీపీ మహిళలు, సాధారణ ప్రజలు దాడుల్లో గాయపడినా వైఎస్ జగన్‌కు భద్రతపరంగా చిన్నపాటి సమస్య కూడా రాకుండా చేశాం’’ అని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బీబీసీతో అన్నారు.
మాజీ సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమంలో రౌడీమూకలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.
"ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరినట్లుంది. ప్రతిపక్ష నేతలు కూడా రెచ్చగొట్టే ధోరణి కాకుండా ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి ప్రజల ఆదరణ చూరగొనాలి. అధికార పార్టీ నేతలు కూడా విపక్ష నేతల ప్రజాస్వామి ఆందోళనలను స్వాగతించాలి. అడ్డుకోవాలని చూడటం మంచి సంప్రదాయం కాదు’’ అని సీనియర్ జర్నలిస్టు గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)