భారత్: రైలు నుంచి అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం, 5 కీలక అంశాలు

ఫొటో సోర్స్, ANI
భారత్ తొలిసారిగా మధ్యశ్రేణి ఖండాంతర అగ్ని క్షిపణిని రైలు ఆధారిత సంచార లాంచర్ ద్వారా విజయవంతంగా పరీక్షించింది.
అంటే ప్రత్యేకంగా నిర్దేశించిన లాంచ్ ప్యాడ్ కాకుండా .. రైల్వే ట్రాక్‌లపై నడిచే రైలును లాంచ్‌ప్యాడ్‌గా మార్చుకుని ఈ క్షిపణిని ప్రయోగించారు.

రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా చేసిన క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ డీఆర్‌డీఓ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, సాయుధ దళాలను అభినందించారు.
ఈ ప్రయోగం వ్యూహాత్మక బలగాలకు పెద్ద బలాన్ని అందిస్తుందని డీఆర్‌డీఓ చెప్పింది.
అత్యాధునిక సామర్థ్యాలున్న ఈ అగ్ని క్షిపణి ప్రయోగించిన ప్రాంతం నుంచి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. పైగా ఇది నెక్స్ట్ జనరేషన్ మిసైల్ కూడా.

ఫొటో సోర్స్, ANI
1. ప్రత్యేకత ఏమిటి
ఈ ప్రయోగం ఇండియన్ ఆర్మీకి ఎలా ఉపయోగపడుతుందో 5 అంశాల్లో చూద్దాం.
భారత దేశ భద్రతకు ఈ ప్రయోగం చాలా కీలకం. దీని గురించి బీబీసీ ప్రతినిధి అభయ్ కుమార్ సింగ్ రక్షణ రంగ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవతో మాట్లాడారు.
"అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి. దీన్ని రైల్వే నెట్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది భారీ విజయం" అని ఆయన చెప్పారు.
ఈ క్షిపణిని రెండు దశల్లో ప్రయోగించవచ్చు. ఒకటి ఘన ఇంధనంతో ఉపరితలం నుంచి ఉపరితలానికి, క్యానిస్టర్ వ్యవస్థతో వేగంగా ప్రయోగించవచ్చని సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.
రైలు నుంచి ప్రయోగించే అవకాశం ఉండటంతో దీనిని దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని వివరించారు.
"రైల్వే నెట్‌వర్క్ ఉన్న చోట, దానిని సులభంగా మోహరించవచ్చు. అక్కడ నుంచి శత్రువుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు" అని సంజీవ్ శ్రీవాస్తవ వివరించారు.
ఎక్కడికైనా వేగంగా తరలించే అవకాశం కారణంగా దీనిని భారత వ్యూహాత్మక శక్తిలో కీలకంగా భావిస్తున్నారు.
2. ఈ ప్రయోగం ఏయే దేశాలు చేశాయి?
ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కొన్ని దేశాల సరసన భారత్‌కూడా చేరింది.
"ఈ విజయవంతమైన పరీక్ష భారత్‌ను రైల్వే నెట్‌వర్క్ నుంచి క్యానిస్టరైజ్డ్ లాంచ్ వ్యవస్థలను అభివృద్ధి చేసే సత్తా ఉన్న కొన్ని దేశాల సరసన చేర్చింది" అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ లాంచర్ రైలు పట్టాలపై పని చేస్తుందని, ముందస్తు ఏర్పాట్లేవీ అవసరం లేదని, దేశంలో ఏ మూలకైనా దీన్ని రవాణా చేయవచ్చని ఆయన వివరించారు.
ఈ రైల్వే లాంచర్ శత్రువులకు దూరంగా ఉంటూ తక్కువ సమయంలో క్షిపణుల్ని ప్రయోగించగలదు.
"ఈ ప్రయోగం తర్వాత భారతదేశం అమెరికా, చైనా, రష్యా సరసన చేరింది. ఉత్తరకొరియా కూడా తాము ఈ పరీక్ష చేశామని చెబుతోంది. అయితే దాన్ని ఎవరూ నిర్థరించలేదు" అని సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.
3. అగ్ని ప్రైమ్ క్షిపణి లక్షణాలు
అగ్ని ప్రైమ్ క్షిపణిని తదుపరి తరం సాంకేతికతతో అభివృద్ధి చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ఇది 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేస్తుంది. శత్రువులు దీన్ని గుర్తించలేరు. వేగంగా ప్రయోగించే అవకాశం ఉండటం దీన్నికున్న మరో ప్రత్యేకత.ఇది పూర్తిగాయ స్వీయ ఆధారిత వ్యవస్థ. ఇందులో కమ్యూనికేషన్, భద్రతకు సంబంధించిన అన్ని వ్యవస్థలను ఇప్పటికే అమర్చారు.
ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైందని,అన్ని లక్ష్యాలను సాధించిందని డీఆర్‌డీఓ పేర్కొంది.
ఈ క్షిపణిని ప్రయోగించిన తర్వాత దీని ప్రయాణాన్ని వివిధ గ్రౌండ్ స్టేషన్లు ట్రాక్ చేశాయి. ఇది చిరస్థాయిగా నిలిచిపోయే ప్రయోగం అని డీఆర్‌డీఓ అభివర్ణించింది.
ఈ విజయం భవిష్యత్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను సైనిక సేవల్లో చేర్చేందుకు బాటలు వేసిందని పీఐబీ తెలిపింది.
రోడ్డు మీద నుంచి ప్రయోగించిన అగ్ని ప్రైమ్ క్షిపణి ఇప్పటికే అనేక విజయవంతమైన పరీక్షల తర్వాత సైన్యంలో చేర్చిన విషయం తెలిసిందే.

4. రైలు నుంచి ప్రయోగం ఎందుకంత కీలకం
రైలు నుంచి క్షిపణుల్ని ప్రయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
రైలు లాంటి లాంచర్ ఉంటే క్షిపణిని ఎక్కడికైనా రవాణా చేయవచ్చు. ఎక్కడ నుంచైనా ప్రయోగించవచ్చు.
"రైల్వే నెట్ వర్క్ దేశవ్యాప్తంగా ఉంది. అంటే దీని ప్రయోగ వేదిక దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. క్షిపణిని ఎక్కడ నుంచి ప్రయోగించారో శత్రువు త్వరగా తెలుసుకోలేరు" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు శ్రీ ప్రకాష్ బీబీసీతో చెప్పారు.
ఈ వ్యవస్థ శత్రువులకు అవగాహన ఉన్న శాశ్వత ప్రయోగ వేదికల కంటే భిన్నమైందని ఆయన అన్నారు
"క్షిపణులను సొరంగంలో దాచి ఉంచవచ్చు. అవసరమైనప్పుడు బయటకు తీసి ప్రయోగించవచ్చు" అని శ్రీ ప్రకాష్ చెప్పారు.
అయితే ప్రయోగం పూర్తయ్యే వరకు ఆ ట్రాక్‌పై సాధారణ రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది.
మరి కరెంట్ సరఫరాకు సంబంధించిన సమస్యలు ఏర్పడితే పరిస్థితేంటన్న ప్రశ్నకు డీజిల్ ఇంజన్లను ఉపయోగించవచ్చని శ్రీ ప్రకాష్ చెప్పారు.
"రైల్వేలలో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. కరెంట్‌తో సంబంధం లేకుండా వాటిని ఎక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు" అని ఆయన అన్నారు.
5. డీఆర్‌డీఓకి పెద్ద విజయం
ఈ విజయం మేకిన్ ఇండియాలో కీలక అడుగు.
"డీఆర్‌డీఓ నిరంతరం పెద్ద విజయాలు సాధిస్తోంది. అందులో ఈ క్షిపణి ప్రయోగం విజయం సాధించడం పెద్ద మైలురాయి లాంటిది. ఇది భారతదేశానికి గర్వకారణం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ విజన్‌కు నిదర్శనంగా ఉంది" అని సంజీవ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
భారతదేశం ఇప్పుడు తన సాయుధ దళాలకు ఆయుధాలను తయారు చేయడమే కాకుండా రక్షణ ఎగుమతులను కూడా ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.
"క్షిపణులు, యుద్ధ విమానాల విషయంలో అనేక దేశాలు భారతీయ ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నాయి. సెక్యూరిటీ ప్రొవైడర్‌గా తన పాత్రను విస్తరించుకోవడానికి భారత్ ముందడుగు వేస్తోంది" అని శ్రీవాస్తవ చెప్పారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














