పాకిస్తాన్‌పై భారత్ మిసైల్ దాడుల తరువాత ఇప్పటివరకు ఏం జరిగింది?

భారత్, పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత వైమానిక దాడుల అనంతరం భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడుల తరువాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ప్రతిగా భారత్‌ కూడా కాల్పులు జరిపింది.

పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బుధవారం సాయంత్రం వరకు 15 మంది మరణించినట్లు భారత సైన్యం వెల్లడించింది.

భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తరువాత మంగళవారం అర్ధరాత్రి నుంచి అనేక పరిణామాలు సంభవించాయి.

భారత్ నేతలు, పాకిస్తాన్ నేతలు అనేక ప్రకటనలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగాయంటే..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, ANI

అమాయకులను చంపిన వాళ్లనే మట్టుబెట్టాం: రాజ్‌నాథ్ సింగ్

''అమాయకులైన మన ప్రజలను చంపిన వారినే మేం మట్టుబెట్టాం'' అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, భారత సైన్యం భారతీయులందరినీ గర్వపడేలా చేసింది" అన్నారు.

భారత సైన్యం కొత్త చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు.

"భారత సైన్యం కచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వంతో వ్యవహరించింది. నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితత్వంతో, ప్రణాళిక ప్రకారం నాశనం చేసింది. జనావాసాలు, లేదా సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా సున్నితంగా వ్యవహరించింది" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

భారత్, పాకిస్తాన్, వైమానిక దాడులు

ఫొటో సోర్స్, Pakistan's PM Office/Getty Images

ఐదు భారత విమానాలు కూల్చేశామన్న పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తమ దళాలు ఐదు భారత విమానాలను కూల్చివేశాయని చెప్పారు. ఈ మేరకు ఆయన పాక్ పార్లమెంట్‌కు చెప్పారని ఆ దేశ మీడియా రిపోర్ట్ చేసింది.

అందులో రెండు కశ్మీర్‌లో, మరొకటి భటిండాలో కూలిపోయాయని షాబాజ్ చెప్పారు.

అయితే, భారత్ ఇంతవరకు దానిపై స్పందించలేదు.

బీబీసీ ఈ వివరాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

మరోవైపు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఆ దేశ జాతీయ భద్రత కమిటీ (నేషనల్ సెక్యూరిటీ కమిటీ) సమావేశానంతరం పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో, తమ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటూ భారత్ చేస్తున్న వాదనలను తిరస్కరించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది.

''2025 ఏప్రిల్ 22 నాటి ఘటన తర్వాత, పాకిస్తాన్ చేసిన విశ్వసనీయమైన, పారదర్శకమైన, నిష్పాక్షిక దర్యాప్తు ప్రతిపాదనను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని, కానీ దురదృష్టవశాత్తూ ఆ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

''తమ వాదనలకు బలం చేకూర్చే ఎలాంటి ఆధారాలు అందజేయకుండా, తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం అమాయక పౌరులపై భారత్ దాడి చేసింది'' అని పాకిస్తాన్ అందులో పేర్కొంది.

15 మంది చనిపోయారు : భారత సైన్యం

పాకిస్తాన్ మంగళవారం రాత్రి నుంచి జరిపిన కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించారని, 43 మంది గాయపడ్డారని భారత సైన్యం తెలిపింది.

ఫిరంగి దాడులతో జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్, తంగ్ధార్‌లోని జనావాసాలు ప్రభావితమైనట్లు తెలిపింది.

26 మంది చనిపోయారు: పాకిస్తాన్

మేం ఇంతకుముందు రిపోర్ట్ చేసినట్లుగా.. వైమానిక దాడులు, సరిహద్దు కాల్పుల్లో 26 మంది మరణించినట్లు పాకిస్తాన్ తెలిపింది.

భారత్, పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్

ఎల్వోసీ వద్ద గ్రామాలను ఖాళీ చేస్తున్న ప్రజలు

జమ్మూకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో, నియంత్రణ రేఖకు కొద్దికిలోమీటర్ల దూరంలో ఉన్న సలామాబాద్‌కు బీబీసీ ప్రతినిధి ఆమిర్ పీర్జాదా వెళ్లారు.

ఈ గ్రామంపై బుధవారం ఉదయం ఫిరంగి గుండ్లు పడ్డాయి.

ఎంతోమంది గాయాలపాలయ్యారు, వారిని బారాముల్లా ఆస్పత్రికి తరలించారు.

‘‘సలామాబాద్ నిర్మానుష్యంగా మారిపోయింది. ఊళ్లో చాలా తక్కువ మంది కనిపించారు. బోర్డర్‌లో కాల్పుల సమయంలో ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

కొన్ని ఇళ్లు ఇప్పటికీ మంటల్లో కాలుతూ ఉన్నాయి. అక్కడ జరిగిన భయానక, విధ్వంసం గురించి చెప్పేందుకు అక్కడ ఎవరూ లేరు.

గ్రామంలోని ఒక మూలన, స్థానికుడు బషీర్ అహ్మద్‌ను మేం కలిశాం. ఆయన గ్రామం విడిచి వెళ్లిపోలేదు. ఊరి జనాభాలో దాదాపు 85 శాతం మంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయారని ఆయన చెప్పారు’’ అని ఆమిర్ పీర్జాదా అక్కడి పరిస్థితులను వివరించారు.

భారత్, పాకిస్తాన్, వైమానిక దాడులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్, పాక్‌లో 550 విమానాలు రద్దు

వైమానిక దాడుల తర్వాత భారత్, పాకిస్తాన్‌లలో దాదాపు 550 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

రియల్‌టైం ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ Flightradar24 డేటా ప్రకారం, వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్‌లో షెడ్యూల్ విమానాల్లో 16 శాతం, భారత్‌లో 3 శాతం రద్దయ్యాయి.

ట్రాకర్ ప్రకారం, పాకిస్తాన్‌లో 125 విమానాలు రద్దు కాగా, భారత్‌లో 417 షెడ్యూల్డ్ విమానాలను రద్దు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)