‘బంగ్లాదేశ్‌లో మరో హిందువు బహిరంగంగా కాల్చివేత’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జన్నతుల్ తన్వి
- హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా
బంగ్లాదేశ్‌లో ఓ హిందువును బహిరంగంగా కాల్చి చంపారనే ఆరోపణలతో మరో కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడి పేరు రాణా ప్రతాప్ బైరాగి.
జెస్సోర్ జిల్లాలోని మోనిరామ్‌పుర్‌లో ఓ స్థానిక వార్తాపత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా రాణా ప్రతాప్ బైరాగి వ్యవహరించారని చెబుతున్నారు.
బైరాగిపై గతంలో వివిధ పోలీసు స్టేషన్లలో హత్య, అత్యాచారం, పేలుడు పదార్థాల చట్టం కింద మూడు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
మోనిరాంపుర్ డివిజన్‌లోని ఓ మార్కెట్‌లో సోమవారం సాయంత్రం రాణా ప్రతాప్ హత్యకు గురయ్యారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండగా, ఈ హత్యకు కారణమేంటనేది మిస్టరీగానే ఉంది.


ఫొటో సోర్స్, Collected
ఆ రోజు ఏం జరిగింది?
బైరాగి గతంలో అతివాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని స్థానికులు బీబీసీకి తెలిపారు. ఆయన బీడీ ఖబర్ అనే వార్తాపత్రికకు తాత్కాలిక ఎడిటర్‌గా ఉన్నట్లు చెప్పారు.
"ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. అబ్బాయి తండ్రి ఫిర్యాదు చేశారు" అని మోనిరాంపుర్ పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ మొహమ్మద్ రజీవుల్లా ఖాన్ బీబీసీకి తెలిపారు.
తన ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో రాణా ప్రతాప్ బైరాగి హత్యకు గురయ్యారని స్థానికులు బీబీసీకి తెలిపారు.
ఘటన జరిగిన రోజు సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న బైరాగికి కాల్ చేసి, ఆయనను కపాలియా క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లారని పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పారు.
"అక్కడే ఓ వాగ్వాదం జరిగి, బైరాగి తలపై కాల్చారు. ఆ తర్వాత నిందితులు పారిపోయారు. బుల్లెట్ గాయం కారణంగా బైరాగి అక్కడికక్కడే మరణించారు" అని చెప్పారు.
తమ కొడుకుకు ఎవరితోనూ వ్యాపార సంబంధిత గొడవలు లేవని మృతుడి తండ్రి తుషార్ కాంతి బైరాగి చెప్పారు. ఈ హత్య ఎందుకు చేశారో తనకేమాత్రం అవగాహన లేదని ఆయన తెలిపారు.
"అకస్మాత్తుగా ఇదంతా ఎందుకు జరిగిందో, వాళ్లు ఇలా ఎందుకు చేశారో మాకు అర్థం కావట్లేదు" అని తుషార్ కాంతి బైరాగి అన్నారు.
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కపాలియా బజార్‌లోని ఫ్యాక్టరీకీ తన కొడుకు వెళ్లారని ఆయన బీబీసీకి చెప్పారు.
బైరాగిని ఎవరు తీసుకువెళ్లారు, వారే ఈ హత్యలో అనుమానితులా అని తండ్రిని ప్రశ్నించగా.. "బహుశా వాళ్లే అయి ఉంటారు. మేం వాళ్లను గుర్తించలేం. ఆ సమయంలో మేం అక్కడ లేం. సంఘటన గురించి తెలిసిన తర్వాతే ఇక్కడికి వచ్చాను" అని తుషార్ కాంతి బైరాగి చెప్పారు.
పోలీసులు ఏం చెప్పారు?
'ఈ హత్య'లో ఎవరి ప్రమేయం ఉంది, ఈ హత్యకు గల కారణమేంటి అని మోనిరాంపుర పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రజీవుల్లా ఖాన్‌ను అడగగా.. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఈ కేసుపై ఎక్కువగా మాట్లాడటానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.
అయితే, రాణా ప్రతాప్ బైరాగి తలపై మూడు సార్లు కాల్చారని, ఆయన గొంతుకు కూడా గాయమైందని రజీవుల్లా ఖాన్ చెప్పారు. జెస్సోర్‌లోని ఆస్పత్రిలో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, COLLECTED
ఎవరీ రాణా ప్రతాప్ బైరాగి?
కేశవపుర్ సబ్-డిస్ట్రిక్ట్‌లోని ఆరువా జిల్లాలో ఒకప్పుడు స్కూల్ టీచర్ అయిన తుషార్ కాంతి బైరాగి కొడుకే ఈ రాణా ప్రతాప్ బైరాగి.
ఇద్దరు సోదరుల్లో రాణా పెద్దవారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త. మోనిరాంపుర్ సబ్-డిస్ట్రిక్ట్‌లోని కపాలియా బజార్‌లోని ఐస్ ఫ్యాక్టరీకి యజమానిగా ఉన్నారు.
ఆరువా గ్రామం నుంచి ఈ ఫ్యాక్టరీ సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
"ఆయన చాలా కాలంపాటు వ్యాపారవేత్తగా పని చేశారు. కపాలియా బజార్‌లో ఆయనకు ఐస్ ఫ్యాక్టరి ఉంది. కటఖలీలో ఓ చేపల దుకాణం కూడా ఉంది" అని మృతుడి తండ్రి తుషార్ కాంతి బీబీసీకి చెప్పారు.
తన కొడుకుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తుషార్ కాంతి చెప్పారు.
అయితే, మృతుడు ఒకప్పుడు ఓ అతివాద గ్రూపుతో కలిసి పని చేశారని స్థానికులు ఆరోపించారు. రాణా ప్రతాప్‌కు వ్యతిరేకంగా గతంలో వివిధ నేరాలకు సంబంధించిన రిపోర్టులు అనేక వార్తాపత్రికల్లో వచ్చాయి.
ఆ తర్వాత ఆయన సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా స్థానికులు చెప్పారు. రాణా ప్రతాప్ పలు వ్యాపారాలను ప్రారంభించారని, దాంతో పాటుగా లిటన్ దత్తా అనే వ్యక్తితో కలిసి ఓ వార్తాపత్రికను ప్రచురించేవారని వాళ్లు తెలిపారు.
బైరాగి సంపాదకత్వం వహించినట్లుగా స్థానికులు చెబుతున్న ‘బీడీ ఖబర్’ అనే పత్రిక గురించి గూగుల్‌లో బీబీసీ వెతకగా.. ఆ పేరుతో ఎలాంటి వెబ్‌సైట్ కనిపించలేదు. అయితే ఫేస్‌బుక్‌లో మాత్రం ఆ పేరుతో ఓ పేజీ కనిపించింది. న్యూస్‌పేపర్‌కు సంబంధించిన ఓ ఫోటోలో రాణా ప్రతాప్ బైరాగి తాత్కాలిక ఎడిటర్ అని రాసి ఉంది. ఎడిటర్ పేరు లిటన్ దత్తా అని ఉంది.
బంగ్లాదేశ్ నేషనల్ ఇన్‌ఫర్మేషన్ పోర్టల్‌లోనూ నరైల్ జిల్లా దినపత్రిక బీడీ ఖబర్‌కు ఎడిటర్‌గా లిటన్ దత్తా పేరు కనిపించింది.
మరోవైపు.. కొన్నేళ్ల కిందట నరైల్ నుంచి లిటన్ దత్తా, రాణా ప్రతాప్ బైరాగి ఓ వార్తాపత్రికను ప్రచురించారని స్థానిక విలేఖరులు రిపోర్ట్ చేశారు.
ముందు ఈ వార్తాపత్రికను నిత్యం ప్రచురించేవారని, ఆ తర్వాత అప్పుడప్పుడు ప్రచురించారు. కొన్నాళ్లకు ఈ పత్రిక ప్రచురణను పూర్తిగా నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Sazed Rahman
'మృతుడిపై ముందే మూడు కేసులు'
కేశవపూర్, అయోధ్యనగర్ పోలీస్ స్టేషన్లలో రాణా ప్రతాప్‌పై ఇంతకుముందే కేసులు నమోదయ్యాయని మోనిరాంపుర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మొహమ్మద్ రజీవుల్లా ఖాన్ చెప్పారు.
రాణా ప్రతాప్‌పై ఒక కేసు నమోదైందని జెస్సోర్‌లోని కేశవపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌దేవ్ రాయ్ తెలిపారు.
"పేలుడు పదార్థాల చట్టం కింద ఈ కేసు నమోదైంది. ఇది 2016 నాటికి చెందినదై ఉంటుంది. ఇంతకుమించిన వివరాలు నేను చెప్పలేను. ఇది పాత ఘటన. దీని గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. కోర్టులో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి" అని ఆయన అన్నారు.
మరోవైపు, తమ పోలీస్ స్టేషన్‌లోని రాణా ప్రతాప్ మీద హత్య, అత్యాచారానికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయని అయోధ్యనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్ఎం నురుజ్జమన్ చెప్పారు.
ఇందులో హత్య కేసు 2014 నాటిది కాగా, అత్యాచారం కేసు 2020లో నమోదైనట్లు చెప్పారు. అయితే, రాణా ప్రతాప్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి వివరాలను ఆయన చెప్పలేదు.
"దర్యాప్తు పూర్తైన తర్వాత, చాలాకాలం కిందటే ప్రాసిక్యూషన్ రిపోర్టును కోర్టుకు పంపించాం. కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. దాని ప్రస్తుత స్థితి గురించి నేను ఎలాంటి వివరాలు చెప్పలేను" అని నురుజ్జమన్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













