ఏపీ, తెలంగాణ: ‘ఎండలు ఎంత పెరిగినా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపే ఉష్ణోగ్రతలు, రానున్న సెప్టెంబరు నాటికి 70 శాతం వార్షిక వర్షపాతం’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రుతుపవనాలు, ఎండలు, వర్షాలు, వానలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

సహజంగా రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని తెలుగు రాష్ట్రాల్లో నానుడి ఉంది.

వాస్తవానికి, మే నెల చివర్లో ఎండలు మండిపోతుంటాయి.

కానీ, ఈ ఏడాది అందుకు భిన్నంగా.. రుతుపవనాలు ముందుగా రావడంతో ఎండల తీవ్రత తగ్గిందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.

దాదాపు 16 ఏళ్ల తర్వాత అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు వచ్చాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ స్టెల్లా బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కావలి వరకు రుతుపవనాలు వచ్చినట్లు ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రుతుపవనాలు, ఎండలు, వర్షాలు, వానలు

ఫొటో సోర్స్, IMD

ఫొటో క్యాప్షన్, రుతుపవనాలు ముందే వస్తున్నాయంటూ ఐఎండీ విడుదల చేసిన చిత్రం

ముందుగానే రుతుపవనాలు..

సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే నెలాఖరుకు, లేదా జూన్‌ మొదటి వారంలోగానీ దేశంలోకి ప్రవేశిస్తాయి.

కానీ, ఈ ఏడాది చాలా ముందుగానే వచ్చాయని, అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించాయని ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

''మే 24 నాటికి రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారని చెప్పాలి. ఆ ఏడాది మే 23నే కేరళను తాకాయి. అంతకుముందు 1988లో, మే 17నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక నిరుడు మే 30న రుతుపవనాలు కేరళను తాకాయి.

ఈ ఏడాది కేరళతో పాటు, దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి'' అని ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా బీబీసీతో అన్నారు.

మరోవైపు, అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగానూ రుతుపవనాలు వేగంగా విస్తరించాయని ఆమె చెప్పారు.

''ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రపంచ వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఎల్‌నినో అంటే.. పసిఫిక్‌ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కడం. ఇలా ఉష్ణోగ్రతలు వేడెక్కడం వల్ల రుతుపవనాల గమనం వేగమవుతుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది రుతుపవనాలు వేగంగా దేశంలోకి ప్రవేశించాయి'' అని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ బీబీసీకి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రుతుపవనాలు, ఎండలు, వర్షాలు, వానలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఐఎండీ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ స్టెల్లా

'ఈ ఏడాది వడగాడ్పులు లేవు'

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది వడగాడ్పుల ప్రభావం లేదని స్టెల్లా చెప్పారు.

''ఈ సీజన్‌లో బాపట్ల ప్రాంతంలో ఒక్కరోజు మాత్రమే హీట్‌వేవ్‌ ఎఫెక్ట్‌ కనిపించింది. వరుసగా రెండురోజులు ఎఫెక్ట్‌ ఉంటేనే హీట్‌వేవ్‌గా పరిగణిస్తాం. కానీ, అక్కడ ఒక్కరోజు మాత్రమే తీవ్రత ఉంది. దీంతో ఈ ఏడాది వేసవిని వడగాడ్పులు లేని సమ్మర్‌ సీజన్‌గానే చెప్పాలి'' అన్నారు.

అలాగే, ఈ ఏడాది రాష్ట్రంలో ఎక్కడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటలేదని ఆమె వెల్లడించారు. ఈ సీజన్‌లో నంద్యాలలో ఒక్కసారి మాత్రమే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనట్లు చెప్పారు.

అప్పుడే వర్షాలు మొదలు..

రాయలసీమలో నైరుతి రుతుపవనాల ప్రభావం సోమవారమే మొదలైందని, అక్కడ వర్షాలు పడుతున్నాయని స్టెల్లా తెలిపారు.

నైరుతి రుతుపవనాలు వేగంగా రావడంతో ఈసారి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

వార్షిక వర్షపాతం 70 శాతం జూన్‌–సెప్టెంబర్‌ కాలంలోనే సంభవిస్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మళ్లీ ఎండలు తీవ్రమైనా 40 డిగ్రీలు దాటవు..

రుతుపవనాల ప్రవేశంతో ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎండల తీవ్రత తగ్గింది.

''బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఈ నెల 29 వరకు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది. ప్రస్తుతం చురుగ్గా ఉన్న రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో వేగం తగ్గి విరామ స్థితికి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు కాస్త ఎండలు పెరగొచ్చు. అయినా గరిష్ఠంగా 40 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశం ఉంది'' అని పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలోని అగ్రికల్చరల్‌ రీసర్చ్‌ స్టేషన్‌ హెడ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వి.సైదా నాయక్‌ బీబీసీతో చెప్పారు.

వర్షం

ఫొటో సోర్స్, Getty Images

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఈనెల 27 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు.

అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే ఉద్యాన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రోణంకి కూర్మనాథ్
ఫొటో క్యాప్షన్, రోణంకి కూర్మనాథ్

ముందుగా రుతుపవనాలు ఎందుకంటే?

బలమైన క్రాస్‌ ఈక్వటోరియల్‌ ప్రవాహం కారణంగా, పశ్చిమ తీరంలో ఆఫ్‌షోర్‌ సుడిగుండం, కొంకణ్, గోవా సమీపంలో పశ్చిమ తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రారంభమయ్యాయని ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా చెప్పారు.

2025 మే 26న, సోమవారం ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)