హార్ముజ్ నుంచి పనామా వరకు: ప్రపంచంలోని ఏ సముద్ర మార్గాలలో ఎంతెంత ‘టోల్’ విధిస్తారు?

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
- రచయిత, అలీ రమజానియన్
- చదివే సమయం: 7 నిమిషాలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
ఇరాన్ తీసుకున్న ఈ చర్య కారణంగా ఆ ప్రాంతంలో రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ఆర్థిక రంగాలు, ఇంధన రంగాల నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన లభించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆ వ్యూహాత్మక జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలపై 'టోల్' వసూలు చేసే ప్రణాళికను ఇరాన్ ప్రకటించింది.
దీనిపై తొలుత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
అయితే, తాము ఈ ప్రణాళికను చాలా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్తున్నామని, దీన్ని చట్టబద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్నామని ఇరాన్ అధికారులు నొక్కి చెప్పారు.

ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 17 నుంచి ''హార్ముజ్ జలసంధిలో ఇస్లామిక్ రిపబ్లిక్ సార్వభౌమ అధికారాల వినియోగం'' అనే పేరుతో రూపొందించిన ప్రణాళికకు ఇరాన్ పార్లమెంటుకు చెందిన ఇస్లామిక్ అడ్వైజరీ కౌన్సిల్ పరిధిలోని నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిషన్ ఆమోదం తెలిపింది.
ఈ ప్రణాళికలో రియాల్ (ఇరాన్ కరెన్సీ), భద్రత, సముద్ర రవాణా, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన వివిధ రుసుములను వసూలు చేసే నిబంధనలు ఉన్నాయి.
హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల 'సురక్షిత ప్రయాణాన్ని' నిర్ధరించడానికి, కొన్ని రకాల నౌకలపై 20 లక్షల డాలర్ల (సుమారు రూ.18.62 కోట్లు) వరకు రుసుము విధించవచ్చని కొంతమంది ఇరాన్ అధికారులు ప్రకటించారు.
దీనిపై చమురు, గ్యాస్, పెట్రోకెమికల్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హుస్సేనీ మాట్లాడుతూ, ''నౌకల సురక్షిత ప్రయాణం కోసం రుసుము వసూలు చేసే ప్రోటోకాల్‌ను అమలు చేయడానికి ఇరాన్ నిశ్చయించుకుంది. కాల్పుల విరమణ వంటి రాజకీయ పరిణామాల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధానం మారదు'' అని చెప్పారు.
ఈ పరిణామాలు ఇటువంటి ప్రణాళిక చట్టబద్ధత, దీన్ని అమలు చేసే విధానంపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
ప్రపంచవ్యాప్తంగా టోల్ లేదా ఇతర రుసుములను వసూలు చేసే ఇతర జలమార్గాల గురించి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
సూయజ్ కాలువ
అంతర్జాతీయ జలమార్గాలలో టోల్ వసూలు చేయడం అనేది కొత్తగా వచ్చిన ఆలోచనేమీ కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించి సుదీర్ఘ చరిత్ర కలిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయి.
సూయజ్ కాలువ ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో అనుసంధానిస్తుంది. దీనివల్ల ఆసియా, యూరప్ మధ్య ప్రయాణ సమయం కనీసం పది రోజులు తగ్గుతుంది.
ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 10 శాతం వాటా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది. ఇందులో కంటైనర్ రవాణాలో 22 శాతం, వాహన రవాణాలో 20 శాతం, ముడి చమురు రవాణాలో 10 శాతం భాగం ఉంటుంది.
సూయజ్ కాలువలో టోల్ రుసుమును ఈజిప్టుకు చెందిన 'సూయజ్ కెనాల్ అథారిటీ' వసూలు చేస్తుంది. నౌక పరిమాణం, రకం, లోడ్ ఆధారంగా ఈ రుసుము నిర్ణయిస్తారు. ఇది ఒక్కోసారి కొన్న లక్షల డాలర్ల వరకూ ఉంటుంది.
ఈజిప్టు నియంత్రణలో ఉన్న ఈ కాలువకు ప్రత్యక్షంగా ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ, ప్రమాదాలకు ఇది అతీతం కాదు.
2021లో ఒక భారీ నౌక ఇక్కడ చిక్కుకుపోయింది. ఆ ప్రమాదం కారణంగా కాలువను ఆరు రోజుల పాటు మూసివేశారు. దీనివల్ల దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య నష్టం వాటిల్లింది.
ఈ వ్యూహాత్మక మార్గంలో అత్యంత సున్నితమైన ప్రాంతం ఎర్ర సముద్రం దక్షిణపు చివరన ఉన్న 'బాబ్ అల్ మండేబ్' జలసంధి.
2023 నుంచి 2025 మధ్య కాలంలో, గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి ప్రతిస్పందనగా, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హోతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడి చేశారు.
దీనివల్ల అనేక నౌకలు తమ మార్గాన్ని మార్చుకుని ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది.
దీని ఫలితంగా, 2023లో సూయజ్ కాలువ ద్వారా ప్రయాణించిన నౌకల సంఖ్య సుమారు 26 వేలు ఉండగా, అది 2024 నాటికి దాదాపు 13 వేలకు తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, Photo by MARTIN BERNETTI / AFP via Getty Images
పనామా కాలువ
పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ, ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 2.5 శాతం వాటాను కలిగి ఉంది. ఇది సాపేక్షంగా చిన్న వాటాగా అనిపించినప్పటికీ, దీని ద్వారా కంటెయినర్ కార్గో, కార్లు, ఆహార ధాన్యాలు వంటి వ్యూహాత్మకమైన, అత్యంత విలువైన వస్తువుల రవాణా జరుగుతుంది.
అమెరికాకు వచ్చే కంటైనర్ కార్గోలో దాదాపు 40 శాతం ఈ కాలువ ద్వారానే వెళుతుంది. దీని వార్షిక విలువ సుమారు 270 బిలియన్ డాలర్లు (సుమారు రూ.25.13 లక్షల కోట్లు).
పనామా కాలువ మీదుగా ప్రయాణించడానికి నౌకలు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. నౌకల రకం, పరిమాణం ఆధారంగా ఈ రుసుము మారుతూ ఉంటుంది, ఇది లక్షల డాలర్ల వరకు ఉండవచ్చు.
పనామా కాలువ వద్ద టోల్ వసూలును 'పనామా కెనాల్ అథారిటీ' నిర్వహిస్తోంది.
ఈ కాలువ మనుగడ వాతావరణ పరిస్థితులు, రాజకీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
2023 నుంచి వరుసగా రెండేళ్ల పాటు ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా, కాలువకు నీటిని అందించే మంచినీటి జలాశయాలలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. దీనివల్ల నౌకల సంఖ్యను, వాటి పరిమాణాన్ని పరిమితం చేయవలసి వచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మలక్కా జలసంధి
ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో మలక్కా జలసంధి ఒకటి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 24 శాతం వాటా దీని ద్వారానే జరుగుతుంది. ఇందులో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురు, వాహనాలలో చెరో 26 శాతం వాటా ఉంది. ఇదే మార్గంలో సింగపూర్ ఉంది. అక్కడ ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీగా ఉండే కంటైనర్ ఓడరేవు ఉంది.
మలక్కా ఒక సహజ సిద్ధమైన అంతర్జాతీయ జలమార్గం. ఇక్కడ నౌకల రాకపోకలపై నేరుగా ఎటువంటి రుసుము వసూలు చేయరు.
చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు ఇంధన సరఫరాలో మలక్కా జలసంధి ప్రధాన ద్వారం వంటిది. చైనా దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 80 శాతం ఈ మార్గం మీదుగానే వస్తుంది. ఈ ఆధారపడటాన్నే బీజింగ్ 'మలక్కా డైలమా' అని పిలుస్తుంది.
ఈ ప్రాంతంలో సముద్ర దొంగతనాల బెడద ఇప్పటికీ ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. 2025లో ఈ జలసంధిలో 130 కంటే ఎక్కువగానే దొంగతనాల సంఘటనలు నమోదయ్యాయి. అయినప్పటికీ, రాజకీయ, భౌగోళిక రాజకీయ అంశాలే ఇక్కడ పెద్ద ముప్పుగా పరిణమించాయి. చైనా, అమెరికా లేదా భారత్ మధ్య సముద్ర ఆధిపత్యం విషయంలో ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తితే, ఈ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం కలగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీలోని కీల్ కెనాల్
ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కాలువల్లో జర్మనీలోని కీల్ కెనాల్ ఒకటి. ఇది తరచుగా అత్యంత రద్దీగా ఉండే కాలువ. ఏటా 25 వేలకు పైగా నౌకలు దీని మీదుగా ప్రయాణిస్తాయి.
ఈ కాలువ ఉత్తర సముద్రాన్ని బాల్టిక్ సముద్రంతో అనుసంధానిస్తుంది. నౌకలు డెన్మార్క్ మీదుగా చుట్టి వెళ్లాల్సిన అవసరం లేకుండా తక్కువ దూరంలోనే గమ్యస్థానానికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ కృత్రిమ కాలువలో ప్రయాణించే నౌక బరువు, పరిమాణం ఆధారంగా జర్మనీకి చెందిన 'ఫెడరల్ వాటర్‌వేస్ అథారిటీ' టోల్ వసూలు చేస్తుంది. ఈ ఆదాయం కాలువ నిర్వహణ ఖర్చులో కొంత భాగాన్ని భర్తీ చేస్తుంది.
సూయజ్, పనామా కాలువలతో పోలిస్తే ఈ కాలువ టోల్ సాపేక్షంగా తక్కువగానే ఉంటుంది.
సూయజ్, పనామా ఈ రెండు కాలువలు కలిపి ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10 నుంచి 15 శాతాన్ని నిర్వహిస్తాయి. వీటి టోల్ ద్వారా కొన్ని బిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరుతుంది.

ఫొటో సోర్స్, Photo by Berk Ozkan/Anadolu Agency/Getty Images
తుర్కియే జలమార్గాలు
సముద్ర రవాణాలో తుర్కియే జలమార్గాలకూ అత్యంత ప్రాముఖ్యం ఉంది. బోస్పరస్, డార్డనెల్స్ ఈ రెండూ తుర్కియేలో కీలకమైన జలసంధులు. నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం మధ్య ఉన్న సముద్ర మార్గాలు ఇవి.
ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 3 శాతం వీటి ద్వారానే జరుగుతుంది. ఇది తక్కువగా అనిపించినప్పటికీ యుక్రెయిన్, రష్యా, రొమేనియాల నుంచి జరిగే ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే వెళుతుంది.
మాంట్రియక్స్ కన్వెన్షన్ ప్రకారం బోస్పరస్, డార్డనెల్స్ జలసంధులలో రాకపోకలు సాగించే నౌకల నుంచి ఎటువంటి రుసుమూ వసూలు చేయరు. అయితే, నావిగేషన్ లేదా భద్రత వంటి సేవల కోసం కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మార్గం అత్యంత ఇరుకైన చోట కేవలం 700 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది తుర్కియేలోని ఇస్తాంబుల్ నగరం మధ్య నుంచి ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ రవాణా చాలా సంక్లిష్టంగా మారుతుంది. చిన్నపాటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.
మాంట్రియక్స్ ఒప్పందం ప్రకారం, ఈ జలసంధులపై సైనిక నియంత్రణ అధికారం తుర్కియేకి ఉంది.
2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, వాణిజ్య రవాణాను కొనసాగిస్తూనే యుద్ధనౌకల రాకపోకలను పరిమితం చేయడానికి తుర్కియే ప్రభుత్వం ఈ అధికారాన్ని ఉపయోగించింది.
నల్ల సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ఇక్కడ సమతుల్యత దెబ్బతినవచ్చు, ప్రపంచ ఆహారధాన్యపు మార్కెట్లు అస్థిరపడవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































