You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడుతున్నారా... ఈ జాగ్రత్తలు తీసుకోండి :ప్రెస్ రివ్యూ
ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనావైరస్ ఎక్కువకాలం మనుగడ సాగిస్తున్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తుండటంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వంటివాటి వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్(ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ) సూచనల మేరకు కేంద్ర ప్రజాపనుల శాఖ(సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలను విడుదల చేసింది.
వీటి ప్రకారం... గదిలో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీ (సెంటీగ్రేడ్)ల మధ్య ఉండేలా జాగ్రత్త పడాలి. గాలిలో తేమ స్థాయి 40-70 డిగ్రీల మధ్య ఉండాలి.
ఏసీలు పనిచేస్తున్నా.. బయటి నుంచి గాలి వచ్చేలా, ఇంట్లోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను కొద్దిగా తెరిచి పెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి.
స్ప్లిట్ ఏసీ ఫిల్టర్లను.. కార్యాలయాల్లోని సెంట్రలైజ్డ్ ఏసీల డక్ట్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
కమర్షియల్ ప్రాంతాల్లో.. 70-80శాతం బయటి గాలి లోనికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎయిర్ కూలర్లు వాడుతున్నవారు, అవి బయటి గాలిని పీల్చేలా జాగ్రత్తపడాలి. కూలర్‌ను గది తలుపు లేదా, కిటికీ దగ్గరపెట్టాలి.
కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి.
కూలర్లను వినియోగిస్తున్నా.. తేమ బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచే పెట్టాలి. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లను వాడకూడదు.
ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగానైనా తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది.
ఖరీఫ్, రబీ కాదు... వానకాలం, యాసింగి
వ్యవసాయ పంటకాలాలనూ సూచించేందుకు ఇప్పటివరకూ వాడుతున్న ‘ఖరీఫ్, రబీ’ పదాలకు బదులుగా ‘వానకాలం, యాసంగి’ పదాలను వాడాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
ఖరీఫ్, రబీ పదాలు అరబిక్ భాషకు చెందినవి. మొఘలాయిల పాలనకాలంలో వ్యవసాయ కాలాలను సూచించేందుకు వీటిని వాడేవారు.
వీటినే ప్రభుత్వం కూడా వినియోగిస్తూ వచ్చింది. అయితే, ఈ పదాల విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతుంటారు.
అందుకే, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా గ్రామీణప్రాంతాల్లో వాడుకలో ఉన్న ‘వానకాలం, యాసంగి’ పదాలతోనే పంట కాలలను పిలిచేలా చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి సూచించారు.
ఈ విషయమై వ్యవసాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇకపై వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలు వానకాలం, యాసంగి పదాలను వినియోగించాలని సూచిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
వీడియోకాల్‌లో కుమారుడి చివరిచూపు
లాక్‌డౌన్ కారణంగా అనంతపురంలో ఓ కుటుంబం తమ కుమారుడిని వీడియోకాల్ ద్వారా చివరిచూపు చూసుకోవాల్సి వచ్చిందంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, శివమ్మ దంపతుల కుమారుడు సుంకన్న(46) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసేవారు.
సుంకన్న భార్య పార్వతి ఏడు నెలల గర్భిణీ. వీరికి ఇద్దరు పిల్లలు.
సుంకన్న శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన తల్లిదండ్రుల సమక్షంలో అంత్యక్రియలు జరిపించాలని మృతదేహంతో అనంతపురానికి పార్వతి బయల్దేారారు.
అంత్యక్రియలు పూర్తయ్యాక 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఇక్కడి అధికారులు ఫోన్‌లో ఆమెకు చెప్పడంతో వెనుదిరిగారు.
హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. సుంకన్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో కాల్‌లో ఆ కార్యక్రమాన్ని చూశారు.
తెలంగాణలో ‘రికార్డు స్థాయిలో’ దిగుబడి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో వ్యవసాయంలో ఈ ఏడాది అత్యధిక స్థాయిలో దిగుబడులొస్తున్నట్లు ‘అర్థ, గణాంక శాఖ’ (డీఈఎస్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చినట్లు ‘ఈనాడు’ దినపత్రిక వార్త రాసింది.
గడచిన వానకాలం (ఖరీఫ్), ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లలో (2019-20) పండిన పంటల దిగుబడులపై ముందస్తు మూడో అంచనాల నివేదికను డీఈఎస్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి రూపొందించింది.
అంతకుముందు ఏడాది (2018-19)తో పోలిస్తే ఈసారి ఆహార ధాన్యాల దిగుబడి సుమారు 85 శాతం అదనంగా పెరగవచ్చని గణాంకశాఖ అంచనా వేసింది. గత జులై నుంచి డిసెంబరు దాకా వర్షాలు అధికంగా పడ్డాయి. ప్రధాన ఆహార పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్తు సరఫరా అయ్యింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేశారు.
ఇవన్నీ దిగుబడులు పెరుగుదలకు ప్రధానంగా దోహదపడ్డాయని డీఈఎస్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో సాధారణంగా జూన్‌లో ప్రవేశించే నైరుతి రుతుపవనాలతో జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కురిసే వర్షాలే కీలకం. కానీ అప్పుడు కాకుండా అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాలతో 38.50 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. దీనివల్ల భూగర్భజల మట్టాలు 2019 మే నెలతో పోలిస్తే 2020 మార్చిలో ఏకంగా 4.05 మీటర్లు అదనంగా పెరిగాయి. వీటన్నిటి ఫలితమే పంటల వెల్లువ.
తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి 2019-20లో పంటల సాగు విస్తీర్ణంలో అనూహ్య పెరుగుదల నమోదైంది. వానకాలం, యాసంగి కలిపి 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంతకుముందు ఏడాది (2018-19)తో పోలిస్తే ఇది ఏకంగా 46.96 శాతం అధికం అని తేలింది. ఆహార ధాన్యాల దిగుబడులు కూడా రికార్డుస్థాయిలో పెరిగి 2.41 కోట్ల టన్నులొచ్చాయి. రాష్ట్ర సాధారణ దిగుబడి 1.14 కోట్ల టన్నుల కంటే ఇది 1.27 కోట్ల టన్నులు అదనం.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 విషయంలో కొందరు నైజీరియన్లు తెగ సంబరపడుతున్నారు.. ఎందుకో తెలుసా
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్‌డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్‌డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ
- ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?
- ఏపీలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో ఏం జరుగుతోంది? డిశ్ఛార్జ్ అయిన వాళ్లు ఏం చెబుతున్నారు?
- కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)