కరోనావైరస్: భారత్‌లో తొలి కోవిడ్-19 మరణం వెనక ఉన్న వివాదం ఏమిటి?

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీ సౌదీ అరేబియాలోని జెడ్డాలో దంత వైద్యునిగా పని చేస్తున్న తన చిన్న కొడుకు దగ్గర ఒక నెల రోజులు ఉండి, ఫిబ్రవరి 28న భారత్‌కు తిరిగి వచ్చారు.

76 సంవత్సరాల సిద్దిఖీ ఇస్లామిక్ పండితుడు. ఆయన హైదరాబాద్‌లో విమానం దిగేటప్పటికే బాగా అలసినట్లు కనిపిస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం దిగి అక్కడ నుంచి కారులో 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని తమ సొంత ఊరు గుల్బర్గాకి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్ కూడా ఉన్నారు.

దారిలో టీ తాగడానికి, భోజనం చేయడానికి కారు ఆపారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్ళడానికి సుమారు 4 గంటలు పడుతుంది.

ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సిద్ధిఖీ పెద్ద కొడుకు హమీద్ ఫైజల్ సిద్దిఖీ చెప్పారు.

కానీ, ఊరు నుంచి వచ్చిన 10 రోజుల తర్వాత ఆయన మరణించారు. ఇది భారత్‌లో తొలి కోవిడ్-19 మరణంగా నమోదైంది.

ఆయన భారత్ వచ్చిన ఒక వారానికి తేలికపాటి అస్వస్థత మొదలైంది. మూడు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన్ను రెండు రోజుల వ్యవధిలో చికిత్స కోసం రెండు నగరాలు, నాలుగు హాస్పిటళ్ల చుట్టూ తిప్పారు. నాలుగు హాస్పిటళ్లలో సరైన చికిత్స అందక ఐదో హాస్పిటల్‌కి వెళ్తుండగా ఆయన దారిలో అంబులెన్సులోనే మరణించారు.

ఆ తర్వాత ఆయనది కోవిడ్-19 మరణమని అధికారులు ధృవీకరించారు.

“ఆయన కోవిడ్ 19 తో మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఇంకా మాకు డెత్ సర్టిఫికెట్ రాలేదు” అని ఆయన పెద్ద కొడుకు చెప్పారు.

ఆయన మరణం దేశంలో కోవిడ్-19 చికిత్స చుట్టూ అలుముకున్న అస్పష్ట వలయానికి ఒక నిదర్శనం.

గుల్బర్గాలో ఆయన పెద్ద కొడుకుతో కలిసి రెండంతస్తుల భవనంలో సిద్దిఖీ నివసించేవారు.

"ఐదు సంవత్సరాల క్రితం ఆయన భార్య చనిపోయినప్పటి నుంచి ఆయన ఏ పనీ చేయటం లేదు. ఆయన ఎక్కువ సమయం పుస్తకాలతో నిండి ఉన్న ఆఫీస్ గదిలోనే గడిపేవారు" అని ఆయన స్నేహితులు చెప్పారు.

ఆయన స్థానిక మసీదు నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకునేవారు. సిద్ధిఖీ చాలా మంచి వ్యక్తి అని ఆయన స్నేహితుడు గులాం గౌస్ చెప్పారు.

"తనకు అస్వస్థతగా ఉందని మార్చి 7న ఆయన చెప్పారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తూనే విపరీతమైన దగ్గుతో బాధపడిన ఆయన తాగడానికి మంచి నీళ్లు అడిగారు.

63 సంవత్సరాల ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి జలుబుకు మందులు ఇచ్చి వెళ్లారు. ఆ రోజంతా ఆయన్ను దగ్గు ఇబ్బంది పెడుతూనే ఉంది. అప్పటికే ఆయనకి జ్వరం కూడా ఉంది" అని గౌస్ చెప్పారు.

మార్చి 9న ఆయన్ను గుల్బర్గాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన 12 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.

ఇక్కడ ఓ విషయం కాస్త అయోమయానికి గురి చేస్తోంది.

ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిన డిశ్చార్జ్ నోట్‌లో సిద్దిఖీ న్యూమోనియాతో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆయనకు బీపీ కూడా ఉన్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. కానీ, కోవిడ్-19 కావచ్చనే అనుమానాన్ని ఆ డిశ్చార్జ్ నోట్లో ఎక్కడా పొందుపర్చలేదు.

అయితే, ఆయనకి కోవిడ్-19 సోకినట్లు ప్రైవేట్ హాస్పిటల్ ధృవీకరించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ఉండగా శ్వాబ్ శాంపిల్ తీసుకుని వైరస్ నిర్ధరణ పరీక్షలకి బెంగళూరు పంపినట్లు ప్రకటనలో తెలిపారు.

గుల్బర్గా హాస్పిటల్ నుంచి ఆయన్ను బయటకి తీసుకెళ్లినందుకు సిద్దిఖీ కుటుంబంపై నింద వేశారు.

వైరస్ పరీక్షల ఫలితాలు రాక ముందే సిద్దిఖీ కుటుంబం హాస్పిటల్ అధికారుల మాట వినకుండా హైదరాబాద్‌లోని మరో హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

"మాపై ఇలా నింద ఎందుకు వేస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు. ఇక్కడే ఉంచమని మాకు హాస్పిటల్ అధికారులు చెప్పి ఉంటే మేము స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఉండేవాళ్లం" అని హమీద్ చెప్పారు.

ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ తీసుకుని వెళ్ళమని చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.

జిల్లా వైద్య అధికారులు మాత్రం సిద్దిఖీని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమని సూచించినట్లు చెబుతున్నారు.

కానీ, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఒక అధికారి బీబీసీకి చెప్పారు.

ఆయన్ను మార్చి 10న అంబులెన్సులో హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. ఆయనతో పాటు ఆయన కొడుకు, కూతురు, అల్లుడు వెళ్లారు. ఆ రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారేసరికి హైదరాబాద్ చేరారు.

హైదరాబాద్‌లో చికిత్స కోసం ఆయన్ను ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కి తిప్పారు.

ఒక నరాలకు సంబంధించిన హాస్పిటల్ ఆయన్ను చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఆయనని కోవిడ్-19 వార్డ్ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమని సూచించింది.

ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర గంట ఎదురు చూసినా ఒక్క డాక్టర్ కూడా రాలేదని ఒక కుటుంబ సభ్యుడు చెప్పారు.

ఈలోపు అంబులెన్సులో సిద్దిఖీ పరిస్థితి మరింత క్షీణించింది.

ఇక చేసేది లేక, ఆయన్ను ఓ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. డాక్టర్లు ఆయనకి పరీక్షలు చేసి రెండు గంటల పాటు చూశారు.

రోగి రెండు రోజుల నుంచి దగ్గుతో బాధపడుతూ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు హాస్పిటల్ నోట్‌లో రాశారు. ఆయనకి అక్కడ నెబ్యులైజర్ పెట్టి, పారాసెటమాల్ మందులు ఇచ్చారు. మిగిలిన వైద్య పరీక్షలు కోసం ఆయన్ను హాస్పిటల్‌లో చేర్చమని సూచించారు.

అయితే, కుటుంబ సభ్యులు రోగికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఒప్పుకోలేదని హాస్పిటల్ నోట్‌లో పేర్కొన్నారు.

ఇది నిజం కాదని సిద్దిఖీ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయన్ను ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించమని చెప్పారని చెప్పారు.

తమకు ఏమీ అర్ధంకాక, తిరిగి గుల్బర్గా తీసుకుని వచ్చేయడానికి నిర్ణయించుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.

అంబులెన్సు మరుసటి రోజు ఉదయం గుల్బర్గా చేరేటప్పటికే ఆయన మరణించారు.

ఆయనకి వైరస్ లక్షణాలు కన్పించినప్పటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

టీవీలో వార్తలు చూసిన తర్వాతే తమ తండ్రిది కోవిడ్-19 మరణం అని తెలిసిందని హమీద్ చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం అంత్య క్రియలు నిర్వహించారు.

సిద్దిఖీ 45 ఏళ్ల కుమార్తె, ఆయనకి తొలుత వైద్యం అందించిన డాక్టర్‌కి కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అయితే, వీరిద్దరూ కోలుకున్నారు.

"నాకు కొంచెం నీళ్లు ఇవ్వండి. నాకు దాహంగా ఉంది. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి" అని సిద్దిఖీ చివరి సమయంలో అడిగినట్లు ఆయన కొడుకు చెప్పారు.

ఆయన కుటుంబం ఇంటికి తిరిగి వచ్చింది. కానీ, ఆయన రాలేకపోయారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)