కరోనావైరస్: ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో స్వస్థలాలకు వస్తున్న శ్రీకాకుళం మత్స్యకారులు

    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులోని చెన్నైకి, గుజరాత్‌లోని వీరావల్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఏటా వలస వెళ్తుంటారు. అలా వెళ్లినవారంతా ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఆయా ప్రాంతాల్లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.

కొందరైతే స్వస్థలాలకు వచ్చేందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు. చెన్నైలో చిక్కుకుపోయినవారు సముద్ర ప్రయాణం చేసి శ్రీకాకుళం చేరుకుంటున్నారు. అలా వచ్చినవారిని అధికారులు గుర్తిస్తూ క్వారంటైన్‌‌కు తరలిస్తున్నారు.

గుజరాత్‌లో ఉన్న మత్స్యకారులు ఏపీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మత్స్యకారులకు అందిస్తున్న సాయంపై గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు.

రాష్ట్ర మొత్తం మీద 541 మత్స్యకార గ్రామాలూ, 3 లక్షల మంది పూర్తి స్థాయి చేపల వేటగాళ్లు (యాక్టివ్ ఫిషర్ మెన్) ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో 1.5 లక్షల మంది జనం ఉన్నారు.

శ్రీకాకుళంలో జెట్టీలు లేకపోవడంతో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరావల్, చెన్నైల్లో బోట్లలో కూలీలుగా చేరి వేట సాగిస్తున్నారు.

ఏటా ఆగస్టు నెలలో వీరావల్‌కు వలసలుంటాయి. ప్రతి ఏడాది 10 నుంచి 15 వేల మంది గుజరాత్‌కు, మరో 5 వేల మంది వరకూ చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

ఇలా వెళ్లినవాళ్లంతా ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు.

బోట్లు కొనుక్కుని వస్తున్నారు

గత ఐదు రోజుల్లో చెన్నై నుంచి 89 మంది వరకూ మత్స్యకారులు సముద్ర మార్గంలో శ్రీకాకుళం తీరానికి చేరుకున్నారు.

ఏప్రిల్ 18న కవిటి మండలం ఇద్దవానిపాలేనికి చెన్నై నుంచి 12 మంది మత్స్యకారులు సముద్రమార్గంలో వచ్చారు. 11న వీళ్లు చెన్నై నుంచి నాలుగు బోట్లలో బయల్దేరారు. ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు.

15న చెన్నై నుంచి బయలు దేరిన మరో 27 మంది మత్స్యకారులు 19న అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని డోన్కూరు బీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ ప్రయాణం కోసం వీళ్లే రూ.1.7 లక్షలు పెట్టి సొంతంగా బోటును కొనుక్కున్నారు.

రూ.1.3 లక్షలకు చెన్నైలో బోటు కొనుక్కొని మరో మత్స్యకారుల బృందం 17న బయల్దేరింది. వీరిలో 18 మంది శ్రీకాకుళం జిల్లా వారు కాగా, మరో 11 మంది ఒడిశాకు చెందిన వారు ఉన్నారు.

చెన్నై నుంచి వచ్చిన మరో బోటులో 15 మంది మత్స్యకారులు కవిటి మండలం సిహెచ్ . గొల్లగండి తీరానికి వచ్చారు. వీరు కూడా రూ.1.3 లక్షలు పెట్టి ఆ బోటును కొనుక్కుని వచ్చారు.

మరొక రెండు బోట్లు రావడానికి సిద్దంగా ఉన్నట్లు శ్రీకాకుళం వచ్చిన మత్స్యకారులు అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకూ చెన్నై నుంచి శ్రీకాకుళం సముద్ర మార్గంలో వచ్చిన మత్స్యకారులు 89 మంది. ఒడిశావాసులు 11 మంది. వీరందరిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

‘నరకం కనిపిస్తోంది’

శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశానికి చెందిన మూగి అప్పలస్వామి వీరావల్‌లో ఉంటున్నారు. అక్కడ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘వీరావల్ లో దాదాపు 10 వేల నుంచి 15 వేల మంది ఉంటున్నాం. ఈ రోజు అనారోగ్యంతో ఒక వ్యక్తి చనిపోయాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు, సమద్రం, రైలు ఇలా ఎలాగైనా ఇక్కడ నుంచి తరిలించమని అధికారులను కోరాం. కానీ, స్పందన లేదు. మా పరిస్థితి దయనీయంగా ఉంది’’ అని అన్నారు.

ఏప్రిల్ 14 నుంచి దాదాపు రెండు నెలలు చేపల వేట నిషేధం అమల్లో ఉండటంతో, మార్చి 20 కల్లా తీరానికి రావాలని బోటు యజమానులు చెప్పారని ఆయన చెప్పారు.

‘‘చివరి వేట చేసి ప్రతీ సంవత్సరం ఇంటికి వస్తాం. ఓనర్లు మాకు రావల్సినవి ఇచ్చేసి వెళ్లిపోయారు. బోట్లలోనే ఉంటూ ఉన్నవి తింటున్నాం. మొదట ఏప్రిల్ 14న లాక్ డౌన్ పూర్తి అవుతుందని అనుకున్నాం. కానీ పెంచారు. మా పరిస్థితి అర్దం కావడం లేదు. అప్పుడే మమ్మల్ని తరలించి క్వారంటీన్ ఏర్పాటు చేసి ఉంటే మాకు ఈ బాధలు తప్పేవి. నరకం కనిపిస్తోంది. నిద్ర లేదు. స్నానాలు లేవు. నామ మాత్రపు సహాయం అందుతుంది. కనీసం బట్టలు కూడా లేవు’’ అన్నారు అప్పలస్వామి.

‘సదుపాయాలు లేకుండా ఎలా?’

ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోవాలన్న వాదన సరైందేనని, కానీ సదుపాయాలు లేకుండా మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో ఎలా ఉంటారని ఏపీ మత్స్యకారులు, మత్య్సకార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలరాజు ప్రశ్నించారు.

‘‘సదుపాయాలు లేకుండా వాళ్లు అక్కడ ఉండటం ఎలా సాధ్యం. లాక్‌డౌన్ వల్ల చిక్కుకు పోయినవారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. వారిని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలి. లేదంటే స్వస్థలాలకు తీసుకురావాలి’’ అన్నారు.

ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం వల్ల మత్స్యకారులు ఎలాగైనా స్వస్థలాలకు చెరుకోవాలని ప్రమాద భరితమైన ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్ నష్టాన్ని కూడా కలిపి ప్రభుత్వం మత్స్యకారులకు నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని అప్పలరాజు డిమాండ్ చేశారు.

కేసులు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ

సముద్ర మార్గం, రోడ్డు మార్గంలో శ్రీకాకుళంలోకి ప్రవేశిస్తున్నవారి విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

అక్రమంగా జిల్లాలోకి ప్రవేశించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని, ఇప్పటికే దాదాపు 85కుపైగా మందిపై కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

సముద్ర మార్గం ద్వారా వస్తున్న వారిపై లాక్‌డౌన్ ఉల్లంఘనతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.

చేపలకు వాడే బోట్లను ప్రయాణాల కోసం ఉపయోగించకూడదని, మారిటైం చట్టం ప్రకారం కూడా ఇలా వచ్చేవారిపై కేసులు పెట్టవచ్చని ఆయన అన్నారు.

‘‘జిల్లాలోకి ప్రవేశించే వారిపట్ల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా పడవల ద్వారా చెన్నై నుంచి మత్స్యకారులు ఇటీవల బోట్లలో ఎక్కువగా వస్తున్నారు. తీరప్రాంతంలోని 40 గ్రామాల గుండా మత్స్యకారులు అక్రమంగా బోట్ల ద్వారా రావచ్చని అధికారులు గుర్తించారు. ఆ 40 గ్రామాల్లో పోలీసులు, మెరైన్ పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ వాలంటీర్లు, యువకులతో మల్టీ డిసిప్లెనరీ టీంలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అని నిరంతరం పహారా కాస్తున్నాయి. కొత్త వ్యక్తులు రాగానే ఈ బృందాలు వెంటనే వారిని క్వారంటైన్ కు పంపుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

తీరప్రాంతంలో ఉన్న పోలీసు పార్టీలకు బైనోక్లాక్స్, డ్రాగన్ లైట్లు, కమ్యునికేషన్ సెట్లు ఇస్తున్నట్లు అమ్మిరెడ్డి వివరించారు.

ఏపీలో మొత్తం 21 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

స్పందించిన ప్రభుత్వం

గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్ర మార్గంలో ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు చేరవేసేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఏపీ మత్స్యకారులకు సాయం చేయాలని సూచించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)