You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ‘నాలాంటి నాలుగు వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి’
- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ ప్రభావం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పై పడింది. రోజూ కోటి రూపాయల వ్యాపారం జరిగే ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు బోసిపోతోంది.
చేపల వ్యాపారంతో సందడిగా ఉండే జాలరిపేటను నిశ్శబ్దం అలుముకుంది. హార్బర్ పై ఆధారపడి జీవించే వేల మంది మహిళలు ఇప్పుడు కూలి దొరక్క ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద ఫిషింగ్ హార్బర్లలో విశాఖపట్నం హార్బర్ కూడా ఒకటి. పచ్చి చేపలతో పాటూ ఎండు చేపలు... చెన్నై, కేరళ, కర్నాటక ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంటాయి.
విశాఖలో 708 మెకనైజ్డ్ బోట్లు, 3,500 ఇంజిను పడవలు, 2000 తెప్పలు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి సుమారు 28వేలకుపైగా మంది జీవనం సాగిస్తున్నారు.
వీరితోపాటు చేపల మారు అమ్మకం చేసే మహిళలు, వీధుల వెంట తిరుగుతూ చేపలను అమ్మేవాళ్లు, ఎండు చేపల యార్డుల్లో పనిచేసేవాళ్లు.. ఇలా మరో 12 వేల మంది ఉపాధి పొందుతుంటారు.
అమ్ముడుపోని చేపలను ప్రాసెసింగ్ చేసి ఎండబెట్టడం, తిరిగి వాటిని అమ్మడం వంటి పనులను కూడా మహిళలు చేస్తుంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హార్బర్లో వివిధ పనులు నిర్వహిస్తున్న మహిళలను బీబీసీ పలకరించింది. వాళ్లు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంది.
పరదేశమ్మ అనే 60 ఏళ్ల మహిళ చేపలను ఎండబెడుతూ కనిపించారు.ఆరు రోజుల నుంచి తనకు ఆదాయం లేదని, ఎలా బతకాలో అర్థం కావడం లేదని ఆమె వాపోయారు.
‘‘నాకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లను నేను చూసుకోవాలి. ఎండు చేపలు అమ్మడంతో పాటు హార్బర్‌లో చిన్నా చితకా పనులు చేసి రోజుకు రూ.300 దాకా సంపాదించేదాన్ని. ఇప్పుడు పని లేకుండా పోయింది. నాకు పించను కూడా రాదు. ఇక్కడే ఉంటూ, ఏదైనా పని దొరుకుందేమోనని చూస్తూన్నా’’ అని ఆమె అన్నారు.
లాక్‌డౌన్ ప్రకటించడంతో అప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోట్లు అన్నీ అప్పటి వరకూ దొరికిన వేటతో వెనక్కు వచ్చాయి. చేపలను హార్బర్‌కు వచ్చిన మూడు రోజుల్లో ఎగుమతి చెయ్యాలి. లేకపోతే అవి దేనికీ పని రాకుండా పోతాయి.
కానీ, లాక్‌డౌన్ ప్రకటించే నాటికి రవాణా కూడా ఆగిపోవడంతో చేపలను ఎగుమతి చేసే వీలు లేకుండాపోయింది. ఎంతో కొంతకు ఇక్కడే అమ్ముకుందామనుకున్నా, జనాలను రానివ్వకపోవడంతో కొనేవాళ్లు కరవయ్యారు.
సత్యవతి అనే మహిళ హార్బర్‌లో చేపలు కొని వీధి వీధి తిరిగి అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం ఆమె ఖాళీగా ఉంటున్నారు.
‘‘జనాలు ఎవ్వరూ రావడం లేదు. చేపల వేట లేక మా మగవాళ్లు పస్తులు ఉంటున్నారు. మేం కూడా పస్తులు ఉంటున్నాం. చేపలతో బోట్లు అన్ని నిండుగా ఉన్నాయి. కాని అమ్ముకునే పరిస్థితి లేదు. బయట తిరగడానికి లేదు. గతంలో ఎంత లేదన్నా ఖర్చులు అన్నీ పోనూ రోజుకు రూ.200-300 మిగిలేది. నెలకు రూ.10 వేలు వచ్చేది. కుటుంబమంతా బతికేది. ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం చేస్తాం. వాళ్లు ఇప్పుడు డబ్బుల అడుగుతున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’’ అని అన్నారు సత్యవతి.
ఎర్రమ్మది ఎండు చేపల వ్యాపారం. ఆమె దగ్గర ఇప్పుడు రూ.లక్ష విలువ చేసే సరకు ఉంది.
‘‘ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎండు చేపలు కూడా పాడైపోతాయి. ఇప్పుడు పాడైపోతున్నాయి. వ్యాపారం జరిగితే రోజుకు రూ.400 వరకూ వచ్చేది.
హార్బర్ ఉన్న నాటి నుంచి దీని మీద ఆధారపడి బతకడమే తప్ప వేరే పని ఏటీ తెలీదు. నాలాంటి ఎండు చేపలు అమ్మేటోళ్లు, రోడ్ల మీద అమ్మేటోళ్లు, చేపలు శుభ్రం చేసేవాళ్లు... ఇలా దాదాపు 4 వేల మందికి పైగా బతుకుతున్నాం. అందరి బతుకులు రోడ్డు మీదకు వచ్చాయి’’ అన్నారు ఎర్రమ్మ.
చేపలు కొనేవారే ఎవరూ లేరని, ఎలా బతకాలో అర్థం కావడం లేదని నూకాలమ్మ వాపోయారు. ఆమె పచ్చి చేపలు అమ్ముతుంటారు.
‘‘అసలు ఎవ్వరూ రావడం లేదు. వెయ్యి రూపాయల కోనేం సేపను (చేపను) రెండొందలకు ఇస్తామన్నా తీసుకునేవాళ్లు లేరు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. పోనీ ప్రభుత్వం పరిహారం ఇత్తదా అంటే, కేవలం బోటు ఓనర్లకు మాత్రమే ఇత్తాది’’ అని అన్నారు ఆమె.
ఫిషింగ్ హార్బర్ దగ్గరకు వెళ్లే సమయానికి హార్బర్ నిండా బోట్లు వచ్చి ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ బోటు ఓనరు నూకరాజును బీబీసీ పలకరించింది.
‘‘లాక్ డౌన్ ప్రకటించే సమయానికి మా బోటు సముద్రంలో వేటలో ఉంది. మామూలుగా 10 నుంచి 15 రోజులు వేటలో ఉంటాం. రూ.60 -70 వేల పెట్టుబడి పెట్టుకుని వేటకు వెళ్తాం. ఈసారి వేట బాగా సాగింది. దాదాపు రూ.లక్ష విలువైన చేపలు పడ్డాయి. కానీ, ఏం లాభం? అంతా బోట్లలోనే ఉండిపోయింది. బయటకు తీసి అమ్ముకోలేని పరిస్థితి’’ అని నూకరాజు అన్నారు.‘‘నాకు రెండు బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటుకు దాదాపు రూ.లక్ష నష్టం వచ్చింది. ఇది కాకుండా, బోటులో పనిచేస్తున్న సిబ్బంది అందరికి మేం జీతాలు ఇవ్వాలి. రోడ్ల మీదకు దేన్నీ రానివ్వడం లేదు. బయట నుంచి వస్తేనే కదా మా దగ్గర ఉన్న సరుకు అమ్ముడుబోయేదీ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల గురించి మత్స్యకార్మిక సంఘం నగర కార్యదర్శి చంద్రశేఖర్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి ఎలాగూ చేపల వేటపై నిషేధం ఉంటుంది. అందుకే, చివరి వేట బాగా సాగాలని మత్య్సకారులు ఆశించారు. అనుకున్నట్లుగానే వేట బాగా సాగింది. కానీ, అనుకోకుండా కరోనావైరస్ ప్రభావం చూపడంతో జెట్టికి వచ్చిన చేపలను అమ్ముకోలేకపోతున్నాం. కోల్డ్ స్టోరేజీలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలు కడతామని ఎప్పటి నుంచో చెబుతోంది. అదే చేసుంటే ఇప్పుడు ఇంత విలువైన చేపలు పాడయ్యేవి కాదు. అనేక ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు చెందిన కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వాటిల్లో ఈ సరుకును నిల్వ చేయగలిగితే, మత్స్యకారులకు కొంతైనా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి’’ అని చంద్రశేఖర్ అన్నారు.
మత్స్యకార మహిళల సోసైటీలు పెట్టుకునే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం పెట్టిన పథకాలు చాలా వరకూ బోటు ఉన్న మత్స్యకారులకే వస్తాయి. మెకనైజడ్ బోటులో 18 -22 మంది కార్మికులు, ఇంజను బోటులో 7-9 మంది కార్మికులు ఉంటారు. తెప్పల్లో ఇద్దరు, ముగ్గురు మత్స్యకారులు కలిసి వెళ్తుంటారు. కానీ, సొంత పడవలు, ఇంజను బోట్లు, మెకనైన్డ్ బోట్లు ఉన్న వారికి, కళాసీలకు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తారు. హార్బర్‌పై ఆధారపడ్డ మిగిలిన వాళ్లకు పరిహారం రాదు.
ఈ సమస్యల గురించి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఫణి ప్రకాష్‌తో బీబీసీ మాట్లాడింది. మత్స్యకారుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని... జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో ఈ విషయం గురించి చర్చలు జరిపామని ఆయన అన్నారు.
‘‘రైతు బజార్లను బహిరంగ ప్రాంతాలకు తరలించి, రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేసినట్లే... చేపల అమ్మకాల కోసమూ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆయా చోట్ల అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- ‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’
- కరోనా వైరస్: ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందని కనిపెట్టడం ఎలా
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)