కరోనావైరస్: లాక్‌డౌన్‌‌తో దేశంలో రోజూ ఎన్ని వేల కోట్ల నష్టం వస్తోంది? ఎన్ని ఉద్యోగాలు పోతాయి?

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ హిందీ ప్రతినిధి

దేశంలో లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను విన్నవెంటనే.. ‘‘దేవుడా.. ఎలా బతకాలి?’’ అనుకుంది మంజు బోరా.

ఆమె ఒక తోపుడు బండిలో టీ, నూడుల్స్ అమ్ముతూ జీవిస్తుంది. కొన్ని వారాలుగా ఆ బండి తెరవలేదు. రోజూ వచ్చే 200 – 300 రూపాయల ఆదాయం ఆగిపోయింది. ముగ్గురు సభ్యుల ఆమె కుటుంబం అప్పులు చేస్తూ జీవితం నెట్టుకొస్తోంది.

రాజేష్ కుమార్, మనోజ్ కుమార్‌ల స్వస్థలం నైనితాల్. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని రాజధాని నగరం దిల్లీలో ఉంటున్నారు. ఇప్పుడు వారు తమ వృద్ధ తల్లిదండ్రులు పొదుపు చేసిన కాసిన్ని డబ్బులు, బీమా సొమ్ములు రోజు వారీ అవసరాలకు, పిల్లల స్కూలు ఫీజులకు ఖర్చుపెడుతూ బతుకుతున్నారు.

ఈశాన్య దిల్లీలో రోడ్డు పక్కన చిన్న దుకాణం నడుపుతాడు రాజేష్. ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వల్ల నష్టాల పాలయ్యాడు. ఇప్పుడు లాక్‌డౌన్ మరింతగా దెబ్బతీసింది. లాక్‌డౌన్ తర్వాత అయినా పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన అతడికి నిద్రపట్టనివ్వటం లేదు. ఎందుకంటే.. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో హాకర్లు అమ్మకాలు సాగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని సులువు కాదు.

ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదని.. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా.. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో తమ వంటి వారిని జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవటానికి అనుమతించరని అతడు చెప్తున్నాడు.

దేశంలో నాలుగు కోట్ల మంది హాకర్లు (వీధుల్లో విక్రయించే చిరువ్యాపారులు) ఉన్నారని నేషనల్ హాకర్స్ అసోసియేషన్ గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో 95 శాతం మంది లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తోందని, చాలా మంది పెట్టుబడులు కూడా నష్టపోయారని ఆ సంస్థ తెలిపింది.

గోల్‌గప్పాలు మొదలుకుని లోదుస్తుల వరకూ అనేక రకాల తినుబండారాలు, పండ్లు, చిరుతిళ్లు, మొబైల్ ఉపకరణాలు, ఇతర వస్తువులు ఈ హాకర్లు అమ్ముతుంటారు. అంటే.. వీరి వ్యాపారాలకు - కుటీర పరిశ్రమలు, సరఫరాదారులు, చిన్న రైతులు వంటి రంగాలకు నేరుగా సంబంధం ఉందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శక్తిమాన్ ఘోష్ బీబీసీతో పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా తాను ఈ సంఘంలో పనిచేస్తున్నానని.. హాకర్లను ఇటువంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు.

రిక్షా పుల్లర్లు, ఇంటి పనివారు వంటి చిన్న చిన్న పనులు చేసుకునే వారి పరిస్థితుల గురించి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రధానమంత్రి కూడా.. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం గురించి మాట్లాడారు. చాలా మూల్యం చెల్లిస్తున్నామన్నారు.

లాక్‌డౌన్ వల్ల దేశం రోజుకు రూ. 40,000 కోట్లు నష్టపోతోందని పరిశ్రమల సంఘం ఫిక్కీ అంటోంది.

2020 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో నాలుగు కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ అధ్యక్షురాలు సంగీతారెడ్డి పేర్కొన్నారు.

ఆర్థికాభివృద్ధి రేటు అంచనాలను రేటింగ్ సంస్థలు, బ్యాంకులు సవరించాయి. ఇంతకుముందు 2.5 శాతం వృద్ధి రేటు ఉంటుందన్నబార్క్లేస్.. ఇప్పుడు దానిని సున్నాకి తగ్గించింది. రెండు శాతం వృద్ధి రేటు ఉంటుందని ఫిచ్ జోస్యం చెప్పింది. ఈ రకంగా చూస్తే.. నాలుగు శాతం వృద్ధి ఉంటుందన్న ఏడీబీ అంచనా కాస్త ఆశావహంగా కనిపిస్తోంది.

కరోనావైరస్ అనంతర భారతదేశంలో ఆర్థికవృద్ధి 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉండవచ్చునని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. గత మూడు దశాబ్దాల్లో ఇది అత్యల్పం.

కానీ.. ఆర్థికవృద్ధి తిరోగమనంలో ఉంటుందని ఐఐటీ దిల్లీలో మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ వి.ఉపాధ్యాయ్ భావిస్తున్నారు.

గత నెల రోజులుగా దాదాపు అన్నీ స్తంభించిపోయాయని, ఇప్పుడు లాక్‌డౌన్‌ను పొడిగించారని.. మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాక అవి వేగం పుంజుకోవటానికి కొంత సమయం పడుతుందని.. కాబట్టి వృద్ధి చెందే అవకాశాలు ఏమీ లేవని ఆయన అంటున్నారు.

ఇటీవలి నిరుద్యోగిత రేటు 23 శాతంగా ఉందని చెప్తున్న సీఎంఐఈ అంచనాలను ఆయన ఉటంకిస్తున్నారు.

1930ల నాటి మహా మాంద్యం కాలంలో.. అమెరికాలో (1933) నిరుద్యోగిత రేటు 24.9 శాతంగా ఉంది.

శ్రామికశక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి శాతాన్ని.. ఆర్థిక వ్యవస్థను కొలవటానికి ఉపయోగిస్తారు.

డిమాండ్ తగ్గిపోవటం వల్ల ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపార సంస్థలు సిబ్బందిని తొలగించటం మొదలవుతుంది. దీనివల్ల ప్రజల దగ్గర డబ్బులు తగ్గిపోతాయి. ఫలితంగా మార్కెట్‌లో ఉత్పత్తులకు మరింతగా డిమాండ్ తగ్గుతుంది. దీంతో ఇంకా ఎక్కువ మంది కార్మికులు ఉపాధి కోల్పాతారు... ఇదొక విషవలయంలా కొనసాగుతుంది.

వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు, కార్మికులను తొలగించవద్దని ప్రధానమంత్రి పదే పదే కోరారు. కానీ.. లక్షలాది మంది వలస కార్మికులు తమ ఇళ్లకు చేరుకోవటానికి గుంపులు గుంపులుగా వందలాది కిలోమీటర్లు నడుస్తూ వెళుతున్న దృశ్యాలు.. ప్రధాని మాటల ఎంతవరకూ ఫలించాయనేది చాటుతున్నాయి.

నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం వంటి చాలా రంగాలకు ఉపశమనం ఉంటుందని, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత మరిన్ని రంగాలను ఈ జాబితాకు చేరుస్తామని మోదీ చెప్పారు. కానీ.. అవి అమలుకావటం ప్రశ్నార్థకంగానే ఉంది.

ప్రభుత్వం.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి గోధుమలను కొనుగోలు చేస్తుందని ప్రకటించిందని, కానీ ఇప్పటివరకూ జనానికి పాసులు సైతం లభించలేదని పంజాబ్‌లోని మోగాకు చెందిన రైతు దవీందర్ సింగ్ గిల్ చెప్పారు.

ఇతర రంగాలు మూసివేసి ఉండగా.. ఒక రంగాన్ని తెరవటం వల్ల ఉపయోగం లేదని రైతు, ఉద్యమకారుడు రమణ్‌దీప్ సింగ్ మాన్ పేర్కొన్నారు.

ఉదాహరణకు.. రైతుల దగ్గర పాలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ హోటళ్లు, రెస్టారెంట్లు వంటివన్నీ మూసివేశారు. దీనివల్ల డిమాండ్ దాదాపు 40 శాతం తగ్గిపోయింది. అదే సమయంలో పశువుల మేతల ధర మరింతగా పెరిగింది. ఫలితంగా రైతుల పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది.. ఆదాయం అడుగంటింది.

బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవటంతో పొలాల్లో కార్మికుల కొరత ఉందన్న వార్తలూ వస్తున్నాయి.

పంజాబ్, హరియాణాల నుంచి వ్యవసాయ పరికరాలు ఇక్కడకు రావటం లేదని.. ఇది పంట కోతల మీద ప్రభావం చూపుతుందని బిహార్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన క రైతు అకిల్ అహ్మద్ తెలిపారు.

మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచటానికి పలు చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐలు ప్రకటించాయి. కానీ.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలులో లోపాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉందన్న విషయాన్ని విస్మరించరాదని నిపుణులు చెప్తున్నారు.

అయితే.. ముడి చమురు ధరలు తగ్గటం, ఆర్‌బీఐ దగ్గర భారీగా నగదు నిల్వలు ఉండటం.. భారతదేశానికి ప్లస్ పాయింట్ అని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)