కరోనావైరస్‌కు ఆఫ్రికా తదుపరి కేంద్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించిన WHO

కరోనావైరస్ వ్యాప్తికి ఆఫ్రికా తదుపరి కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. గడచిన వారంలో ఆఫ్రికాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.

సుమారు 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండం వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 19,000 కేసులు నమోదు అయ్యాయి. అందులో 970 మంది మరణించారు. యూరప్, అమెరికాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువే.

కానీ, ఆఫ్రికా దేశాల రాజధాని నగరాల నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అనిపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ఆఫ్రికా దేశాలలో సరిపడా వెంటిలేటర్లు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.

ఉత్తర ఆఫ్రికాలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. అల్జీరియా, ఈజిప్టు, మొరాకో దేశాలలో ఒక్కో దేశంలో 2,000కి పైగా కేసులు, 100కి పైగా మరణాలు నమోదయ్యాయి. 348 మరణాలతో అల్జీరియా అగ్రస్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,000 దాటగా, 48 మంది మరణించారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశమైన నైజీరియాలో 442 కేసులు నమోదు కాగా, 13 మంది చనిపోయారు.

దక్షిణాఫ్రికా, నైజీరియా, ఐవరీ కోస్ట్, కేమెరూన్, ఘనా దేశాల్లో రాజధాని నగరాలకు సుదూరంగా ఉండే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వైరస్ పాకినట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా డైరెక్టర్, డాక్టర్ మత్‌షిడిసో మోయెతి బీబీసీతో చెప్పారు.

ఇప్పటికీ 15 ఆఫ్రికన్ దేశాల్లో వైరస్ కేసులు నమోదు కాలేదు. అక్కడ సామాజిక దూరాన్ని పక్కాగా పాటించగలిగితే, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సులవవుతుందని ఆమె అంటున్నారు.

ఒకేసారి భారీగా రోగులు వస్తే చికిత్స అందించేందుకు ఆఫ్రికా దేశాలలో సరైన వైద్య సదుపాయాలు లేవని, దాంతో కరోనావైరస్ చికిత్స కంటే, నివారణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నామని ఆమె తెలిపారు.

వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో కోటి మందికి పైగా ఈ వైరస్ బారిన పడొచ్చనీ డబ్ల్యూహెచ్ఓ ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. కానీ, అందుకు తగినట్లుగా ప్రభుత్వాలు వైద్య వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు కనిపించడంలేదు.

"ఐసీయూలో చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య పెరగకుండా చూడాలి. ఎందుకంటే, ఇప్పుడు ఈ దేశాలలో ఉన్న వైద్య సదుపాయాలు ఏమాత్రం సరిపోవు. ఈ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వెంటిలేటర్ల కొరత" అని మోయెతి వివరించారు.

చాలా ఆఫ్రికన్ దేశాలలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 5 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. యూరప్ దేశాల్లో ఆ సంఖ్య దాదాపు 4,000 దాకా ఉంది.

తీవ్ర అస్వస్థతకు గురయ్యే కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తారు. తమంతట తాము శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ఆ యంత్రాలను వినియోగిస్తారు. అవి రోగి ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువు (ఆక్సీజన్) పంపిస్తూ, కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువును బయటకు పంపిస్తాయి.

మార్చిలో జింబాబ్వేలో జొరోరో మకాంబా అనే జర్నలిస్టు చనిపోయారు. ఆఫ్రికాలో కరోనావైరస్ సోకి మొట్టమొదట చనిపోయిన వారిలో ఆయన ఒకరు. ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు తమ దగ్గర వెంటిలేర్ లేదని జింబాబ్వే రాజధాని హరారేకు చెందిన స్థానిక అధికారులు తెలిపారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి.

రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు సామాజిక దూరం పాటించడం సాధ్యం కాదు. తరచూ చేతులు కడుక్కునేందుకు వారికి సరిపడా నీటి సదుపాయం కూడా ఉండదు. అలాంటి ప్రాంతాలకు ఈ మహమ్మారి పాకితే, పరిస్థితి అదుపులోకి రావడం చాలా కష్టం.

ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

ఆఫ్రికాలోని పలు దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో పాఠశాలలను ఆరోగ్య కేంద్రాలుగా మార్చారు.

అక్కడ కరోనావైరస్ బాధితులను క్వారంటైన్ చేస్తున్నారు, కొన్ని చోట్ల వద్య సేవలు కూడా అందిస్తున్నారు.

వస్త్ర పరిశ్రమలు మెడికల్ గౌన్ల లాంటి వాటి తయారీని ప్రారంభించాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)