కరోనావైరస్: టెలిఫోన్ బూత్‌లే స్ఫూర్తి... కోవిడ్-19 పరీక్షల కోసం కేరళ వైద్యుల వినూత్న ఆలోచన

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ నిర్ధరణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరణను వేగంగా, సురక్షితంగా చేసేందుకు కేరళ వైద్యులు వినూత్న ఆలోచన చేశారు. పాతకాలం టెలిఫోన్ బూత్‌లు, దక్షిణ కొరియా మోడల్ నుంచి స్ఫూర్తి పొంది కోచిలో వైద్యులు ‘వాక్ ఇన్ శాంపిల్ కియోస్క్‌’లను ఏర్పాటు చేశారు.

వీటిని విస్క్ (Wisk)లని పిలుస్తున్నారు.

కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఈ కియోస్క్‌ల ద్వారా జనాల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు.

పరీక్ష కోసం వచ్చే వ్యక్తి, పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బంది ఒకరికొకరు నేరుగా కలవకుండా ఉండేందుకు విస్క్‌తో వీలు కలుగుతుంది.

పారదర్శకంగా ఉండే అద్దం, గ్లవ్స్‌తో ఉండే ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వైద్య సిబ్బంది ఇందులో పని చేస్తారు. ఫలితంగా వారికి ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉండదు.

‘‘కరోనావైరస్ విషయమే కాదు. చికెన్‌పాక్స్, హెచ్1ఎన్1... శాంపిల్స్ సేకరించే సమయంలో ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు వైద్య సిబ్బందికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రక్రియను సురక్షితంగా మార్చాలన్నదే మా ఆలోచన’’ అని కలమస్సెరీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న గణేశ్ మోహన్ బీబీసీతో చెప్పారు.

విస్క్‌కు ఓ అయస్కాంత తలుపు ఉంటుంది. లోపల ఫ్యాన్ ‌కూడా ఉంటుంది. వైద్య సిబ్బంది తాజా గ్లోవ్స్ ధరించాల్సిన అవసరం కూడా లేదు.

విస్క్‌లో గ్లవ్స్‌లా ఉండే రెండు రంధ్రాల్లో చేతులు పెట్టి, అవతలి వైపున్న రోగి నుంచి శాంపిల్స్ సేకరించవచ్చు.

‘‘పాత టెలిఫోన్ బూత్ విధానాన్ని తీసుకున్నాం. దక్షిణ కొరియాలో కియోస్క్ నుంచి కూడా స్ఫూర్తి పొందాం. విస్క్‌కు చక్రాలు బిగించి, వాహనంతో లాక్కువెళ్లేలా... గ్రామాలు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, ఇలా ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లేలా దీనికి మెరుగులు దిద్దుతాం’’ అని డాక్టర్ మోహన్ అన్నారు.

ఒకవేళ కమ్యునిటీ ట్రాన్స్‌మిషన్ జరిగి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ యూనిట్స్ ఇస్తే, విస్క్‌లతో వేగంగా, మెరుగ్గా పరీక్షలు చేయవచ్చని చెప్పారు.

‘‘విస్క్‌తో రోజూ 500 నుంచి 600 దాకా శాంపిల్స్ సేకరించవచ్చు. మేం తదుపరి రూపొందించే నమూనాల్లో ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ కూడా పెడతాం. వాటిని రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్ట్‌ల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు’’ అని డాక్టర్ మోహన్ వివరించారు.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుంటున్నామని, వాటిని త్వరలోనే విస్క్‌ల్లో ఉపయోగిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్‌కే కుట్టప్పన్ బీబీసీతో చెప్పారు.

ఇళ్లలో క్వారంటీన్‌లో ఉన్నవారిని అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి, విస్క్‌ల్లో శాంపిల్స్ సేకరిస్తున్నామని ఆయన అన్నారు.

విస్క్‌లను స్థానికంగానే రూపొందించారు. డాక్టర్ మోహన్, ఆయన బృందంలోని డాక్టర్ మనోజ్ ఆంథోని, డాక్టర్ నిఖిలేశ్ మేనన్ దీని రూపకల్పన కోసం సలహాలు, సూచనలు చేశారు.

కేరళలో ఈ విస్క్‌ల వినియోగం మొదలుపెట్టిన మరుసటి రోజు దిల్లీ ప్రభుత్వం కూడా సొంతంగా కియోస్క్‌ ఏర్పాటు చేసింది.

‘‘ఇదేమీ పోటీ కాదు. మొదటి బహుమతి, రెండో బహుమతి అని ఉండవు. మనుగడ కోసం పోటీపడుతున్నాం. ఎవరైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. అందరి సలహాలనూ స్వాగతిస్తాం’’ అని డాక్టర్ మోహన్ అన్నారు.

కలమస్సెరీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో కొంతమంది కోవిడ్-19 రోగులకు చికిత్స జరుగుతోంది. 2000కుపైగా మందికి ఇక్కడ పరీక్షలు నిర్వహించారు.

త్వరలోనే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ విస్క్‌లను ఏర్పాటు చేస్తామని డాక్టర్ కుట్టప్పన్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)