కరోనావైరస్: హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో ప్రమాదాలు ఉన్నాయా?

కరోనావైరస్ మహమ్మారి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1.37 లక్షల ప్రాణాలను బలితీసుకుంది. అత్యధికంగా అమెరికాలో ఈ వ్యాధి బారిన పడి 28,000కుపైగా మంది చనిపోయారు.

అసలు ఈ కోవిడ్-19 వ్యాధికి మందు ఉందా? దీనికి చికిత్స ఏంటి? అందరూ చర్చించుకుంటున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకూ ఈ వ్యాధికి టీకాను పరిశోధకులు కనుక్కోలేకపోయారు.

అయితే, కొన్ని వేరే ఔషధాలను వైద్యులు కరోనావైరస్ సోకినవారి చికిత్సలో వినియోగిస్తున్నారు.

మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ‌కరోనావైరస్ చికిత్సలో వినియోగించేందుకు భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది.

కోవిడ్-19 రోగులపై హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కొంత పరిశోధన కూడా జరిగింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ కోవిడ్-19పై ఉపయోగపడుతోందన్న వాదనలను నిరూపించే గట్టి ఆధారాలేవీ ఇప్పటివరకూ లేవని, నిరూపణ అయ్యే వరకూ చికిత్సలో ఈ ఔషధాన్ని వాడొద్దని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) ఏప్రిల్ 6న అమెరికా ప్రభుత్వానికి సూచించింది.

‘ప్రాణాంతకం కావొచ్చు’

‘‘ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను, ప్రక్రియలను పాటించకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగిస్తే దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. రోగులు అనారోగ్యానికి గురికావొచ్చు. వాళ్లు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి’’ అని పాహో తెలిపింది.

మరోవైపు కరోనావైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రభావం చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు.

మిగతా వ్యాధుల చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్‌గా తలనొప్పి, కళ్లు తిరగడం, ఆకలి మందగించడం, విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది.

మలేరియా రోగులపై హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని, ఆహారంతో పాటుగా తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారించవచ్చని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) పేర్కొంది.

ఈ ఔషధం సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా ఉండొచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె జబ్బుల ముప్పు

హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ లాంటి మలేరియా ఔషధాలు, లోపినావిర్, రిటోనావిర్ లాంటి హెచ్ఐవీ ఔషధాల వల్ల రోగులకు గుండెజబ్బుల ముప్పు పెరుగుతుందని, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అమెరికాలోని మయో క్లినిక్ మార్చి 25న ఓ ప్రకటన చేసింది.

‘‘హైడ్రాక్సీక్లోరోరిక్విన్ లాంటి ఔషధాలు కణాల స్థాయిలో ఓ ప్రధానమైన పొటాషియం ఛానెల్‌ను అడ్డుకోవచ్చు. గుండెలోని ఎలక్ట్రికల్ రీచార్జ్ వ్యవస్థలో అది చాలా కీలకం. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, గుండెపోటు రావొచ్చు’’ అని పేర్కొంది.

ఈ ఔషధాలను ఉపయోగిస్తున్న రోగులకు క్రమం తప్పకుండా ఈసీజీ పరీక్షలు చేయాలని మయో క్లినిక్ సూచించింది.

హృద్రోగాలున్నవారికి ఇతర వ్యాధుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చినప్పుడు దుష్ప్రభావాలు ఉండొచ్చని పాహో సంస్థ కూడా తమ నివేదికలో తెలిపింది.

‘మధ్యలో ఆపేశాం’

కరోనావైరస్ సోకిన రోగికి హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ (దీన్ని కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కలిపి ఎక్కువగా ఇస్తుంటారు) ఇచ్చే పరీక్షలను మధ్యలోనే నిలిపివేశామని ఫ్రాన్స్‌లోని సెంటర్ హాస్పిటల్ యూనివర్సిటీ కార్డియాలజిస్ట్ ఎమిల్ ఫెరారీ ఓ వార్తా పత్రికతో చెప్పారు. ఆ రెండు ఔషధాలు ఇచ్చిన తర్వాత రోగిలో గుండె సంబంధిత సమస్యలు కనిపించాయని తెలిపారు.

‘‘ఒక్క హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రమే ఇస్తున్నప్పుడు గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయి. కానీ, దాన్ని, అజిత్రోమైసిన్‌ను కలిపి ఇచ్చినప్పుడు రోగి పరిస్థితి క్షీణించింది. ఏదైనా ఔషధంతో రోగి రక్తంలోని పొటాషియం తగ్గితే, అప్పుడు రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం కూడా తగ్గుతుంది. దాని దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ ఔషధాలు ఇచ్చినప్పుడు, గుండె పరిస్థితిని ఈసీజీ ద్వారా గమనించాలి’’ అని అన్నారు.

సమస్యకు కారణం

హైడ్రాక్సీక్లోరోక్విన్ దుష్ప్రభావాల గురించి హెచ్చరిస్తూ ఫ్రెంచ్ నేషనల్ ఏజెన్సీ ఫర్ సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్ (ఏఎన్ఎంఎస్) కూడా ఏప్రిల్ 10న ఓ ప్రకటన విడుదల చేసింది. లోపినావిర్, రిటోనావిర్ లాంటి ఔషధాల వల్ల కూడా కొందరు రోగుల్లో ఇబ్బందులు రావొచ్చని పేర్కొంది.

‘‘మార్చి 27 తర్వాత వంద మంది రోగులను మేం పరిశీలించాం. వీరిలో 53 మందికి గుండెపరమైన ఇబ్బందులు తలెత్తాయి. అందులో 43 మంది హైడ్రాక్సీక్లోరోక్విన్ గాని, దానికి తోడుగా అజిత్రోమైసిన్ గానీ తీసుకున్నవారే’’ అని తెలిపింది.

‘‘మరణించిన రోగుల్లో నలుగురిలో గుండె కొట్టుకునే వేగం అతిగా పెరగడం వంటి లక్షణాలు కనిపించాయి. ఇలాంటి చికిత్సల వల్ల ప్రమాదాలున్నాయని, ముఖ్యంగా గుండెజబ్బులున్నవారికి ముప్పు ఉందని ప్రాథమిక పరిశీలనల్లో వెల్లడవుతోంది’’ అని వివరించింది.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి...

కోవిడ్-19 రోగుల చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలపలేదు. కానీ, హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్‌తో పాటు మరికొన్ని ఔషధాలపై అంతర్జాతీయ క్లినికల్ ప్రయోగాలు మొదలుపెడతామని ఏప్రిల్ 8న ప్రకటించింది.

కోవిడ్-19 రోగుల చికిత్సలో అత్యవసర పరిస్థితుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ వినియోగించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మార్చి 28నే అనుమతి మంజూరు చేసింది. వీటి క్లినికల్ ప్రయోగాలు చేస్తున్నట్లు సీడీసీ కూడా ఆ తర్వాత వెల్లడించింది.

సార్స్ సీఓవీ, సార్స్ సీఓవీ-2 (కోవిడ్-19కు కారకం) వైరస్‌లు కణాల్లోకి ప్రవేశించకుండా చేయడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ విజయవంతమైనట్లు తమ ప్రయోగశాలల్లో చేసిన పరీక్షల్లో తేలిందని మయో క్లినిక్ కూడా తెలిపింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)