You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ‘గరిష్ట స్థాయిని దాటేశాం, అమెరికా త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది’ - డోనల్డ్ ట్రంప్
కరోనావైరస్ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్యలో గరిష్ట స్థాయిని దాటుకుని తమ దేశం కుదుటపడుతోందని, ఈ నెలలోనే మళ్లీ కొన్ని రాష్ట్రాలు తెరుచుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికావ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.
గవర్నర్లతో సంప్రదింపుల తర్వాత గురువారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తానని ట్రంప్ చెప్పారు.
‘‘మనమందరం ఎదురునిలిచి, గెలిచిన వాళ్లమవుతాం. మన దేశాన్ని మళ్లీ మనం యథాస్థితికి తెచ్చుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇప్పటివరకూ 6.3 లక్షలకుపైగా మందికి కరోనావైరస్ సోకింది. 28 వేలకుపైగా మంది మరణించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
‘‘దేశవ్యాప్తంగా కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్యలో శిఖర స్థాయిని దాటుకుని మన దేశం కుదుటపడుతున్నట్లు సమాచారం సూచిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. ఈ విషయంలో మనం మరింత పురోగతి సాధిస్తాం’’ అని ట్రంప్ అన్నారు.
దేశంలో 33 లక్షల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని, యాంటీబాడీ (ప్రతిరోధక) పరీక్షలు కూడా త్వరలోనే మొదలవుతాయని చెప్పారు.
ఈ పరిణామాలన్నింటి కారణంగా లౌక్‌డౌన్ ఎత్తివేసే విషయంలో మెరుగైన స్థితికి చేరుకున్నామని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ప్రభుత్వం మే 1న దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేయొచ్చని ఇదివరకు తెలిపింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో సాధారణ కార్యకలాపాలు అంతకన్నా ముందుగానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరగా లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఉండే ముప్పు గురించి ఎదురైన ప్రశ్నకు... ‘‘లాక్‌డౌన్ కొనసాగించినా మరణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన కొద్దీ జనాల్లో మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఆత్యహత్య హెల్ప్‌లైన్లకు ఫోన్ కాల్స్ వరదలా వస్తున్నాయి’’ అని ట్రంప్ అన్నారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ చర్యల కారణంగా లక్షల సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: కేరళ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎలా విజయం సాధించింది?
- కరోనావైరస్: లాక్ డౌన్లో కొత్త నిబంధనలతో ఎవరికి ప్రయోజనం?
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్ లాక్‌డౌన్: క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్న వలస కార్మికులు
- కరోనావైరస్; హెలికాప్టర్ మనీ అంటే ఏంటి... అది ఆర్థికవ్యవస్థకు ప్రమాదకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)