You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నల్లమలలో వంట, మంట నిషేధం.. కాలిబాట ప్రయాణాలు కూడా - ప్రెస్ రివ్యూ
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో నిప్పు రాజేయడం, వంటలు చేయడంపై అటవీ శాఖ నిషేధం ప్రకటించిందని.. రక్షిత అటవీ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు, ఇతరుల ప్రవేశంపైనా ఆంక్షలు విధించిందని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో మూడు అగ్నిప్రమాదాలు జరగటంతో పాటు.. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలుండటంతో అటవీ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది.
శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు నల్లమల అడవి మీదుగా శ్రీశైలానికి వెళ్లనున్న క్రమంలో.. వారు అటవీ శాఖ సూచనలు తప్పక పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని, కాలిబాట ప్రయాణాలు చేయరాదని ప్రకటించింది.
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లోనే సేదతీరేందుకు అనుమతి ఉందని అటవీ శాఖ స్పష్టం చేసింది. కూర్చునే సదుపాయం, తాగునీటి సౌకర్యం, చెత్త వేసేందుకు కుండీలు ఏర్పాటు చేస్తోంది.
అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. పశువుల కాపరులు, అడవిలోకి వచ్చేవారు సిగరెట్, బీడీ తాగకుండా చర్యలు చేపడుతోంది.
అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 9,771 కంపార్ట్‌మెంట్లకు గాను 43 అటవీ రేంజ్‌ల్లో 1,106 ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు అత్యంత ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించారు.
కనీసం ఐదుగురు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్‌లతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లుంటాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా... శాటిలైట్‌లో పర్యవేక్షించే విధానం పాటిస్తుండటంతో, ఎక్కడ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు.
రైతన్నకు 2 వేల కోట్లు బాకీ.. ధాన్యం డబ్బు కోసం రైతుల ఎదురుచూపులు
‘‘అన్నదాతలకు అండగా ఉంటాం. ధాన్యం అంతా కొంటాం. ప్రతి గింజ సేకరిస్తాం. డబ్బులు వెంటనే జమ చేస్తాం’’ అని ధాన్యం కొనుగోళ్లకు ముందు అమాత్యులు చేసిన ప్రకటనకు ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది. ప్రభుత్వ సేకరణ కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులకు.. ప్రభుత్వం అక్షరాలా రెండు వేల నలభై కోట్ల పన్నెండు లక్షల (2,040.12 కోట్లు) రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉందని చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ఖరీఫ్ ధాన్యంలో పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంకా 30 శాతం సొమ్ము రైతులకు చెల్లించాల్సి ఉంది. ధాన్యం ఇచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా.. సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్కుకుంటే ఇన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి ఉండేది కాదని వాపోతున్నారు.
డబ్బు చేతికొస్తే రెండో పంటకు పెట్టుబడులకు ఉపయోగపడతాయని రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 1710 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగింది. గత మూడు నెలల్లో 3,97,189 మంది రైతుల నుంచి 40,80,579 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది.
ఈ మొత్తానికి రూ. 7,421.32 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 5,381.20 కోట్లు జమ చేసింది. ఇంకా రూ. 2,044.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా రైతులకు అత్యధికంగా రూ. 573 కోట్లు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా రైతులకూ రూ. 433 కోట్లు దాకా ఇవ్వాల్సి ఉంది.
శ్రీకాకుళం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల రైతులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు జరగాల్సి ఉంది. నిధుల కొరత వల్లే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని పౌరసరఫరాల శాఖ సిబ్బంది చెబుతున్నారు.
మేడారం హుండీ ఆదాయం రూ. 15 కోట్లు!
మేడారం మహా జాతర హుండీల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో గత ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉందని ‘ఆంధ్రభూమి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మొత్తం 494 హుండీలకు ఇప్పటివరకు 341 హుండీలను లెక్కించగా రూ. 8 కోట్ల 76 లక్షల 37 వేల ఆదాయం వచ్చింది.
మరో మూడు రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. భారీ పోలీస్ భద్రత మధ్య మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది.
గత ఏడాది మేడారం హుండీల లెక్కింపు ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి దాదాపు రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
- హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- వుహాన్‌లో చిక్కుకుపోయిన కర్నూలు జ్యోతి పరిస్థితి ఏంటి?
- రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది
- భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
- అంటార్కిటికాలో 20.75 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రతలు
- హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)